Oct 24,2023 08:39

హైదరాబాద్‌ : రవితేజ్‌ టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలో హేమలతా లవణం పాత్రలో రేణూ దేశారు చక్కగా నటించి అలరించారు. ఆ పాత్రలో ఎంతో హుందాగా కనిపించారు. సినిమాలో ఆమె కొద్దిసేపు మాత్రమే కనిపించినా టైగర్‌ నాగేశ్వరరావు చిత్రానికి ఆమె పాత్ర కూడా చాలా ప్రాముఖ్యతనిచ్చింది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ... తాజాగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

 పవన్‌ సిఎం కావాలని కోరుకుంటున్నారా..? అనే ప్రశ్నకు రేణు ఇలా చెప్పారు.

' ఆయన గురించి ఈ క్వశ్చనే వద్దు (నవ్వుతూ) అన్నారు. ఒక పొలిటీషియన్‌గా ఈ సొసైటికి అవసరం అని మాత్రమే గతంలో ఒక వీడియో ద్వారా నేను చెప్పాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆయన సీఎం అవుతారా లేదా అనేది నేను కోరుకోను.. దేవుడు ఉన్నాడు.. ఆ విషయం ఆయనే డిసైడ్‌ చేస్తాడు. కనీసం ఒక కామన్‌ వ్యక్తిగా కూడా ఆయనవైపు స్టాండ్‌ తీసుకోను. పలాన వ్యక్తిని సపోర్ట్‌ చేయండి అని నేను ఎలాంటి ఎన్నికల ప్రచారం కూడా చేయను. అది నాకు అవసరం లేని విషయం. పవన్‌ గురించి నేను ప్రతిసారి నిజాలే చెప్పాను. నా విడాకుల సమయంలో నేను ఏమైతే చెప్పానో అవన్నీ నిజాలే.. కొద్దిరోజుల క్రితం పవన్‌ గురించి చెప్పిన మాటల్లో కూడా నిజమే ఉంది. కావాలంటే లైవ్‌ డిటెక్టర్‌ పెట్టి చెక్‌ చేసుకోవచ్చు. ' అని రేణుదేశారు చెప్పారు.

జీవితంలో సింగిల్‌ మదర్‌గా కొనసాగడం చాలా కష్టం అంటూ రేణు దేశారు ఇలా చెప్పారు. ' నాకు పెద్దవాళ్ల సపోర్టు కూడా లేదు. నేను సింగిల్‌గానే నా పిల్లలను పోషిస్తున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదు. త్వరలో నేను కచ్చితంగా మరో పెళ్లి చేసుకుంటాను. అందులో ఎలాంటి సందేహం లేదు. అది వంద శాతం జరుగుతుంది. కానీ నేను ఎక్కువగా ఆధ్యా గురించే ఆలోచిస్తున్నాను. అందుకే ఆ విషయంలో కొంత టైమ్‌ తీసుకుంటున్నాను. ముందుగా నా బిడ్డలను సరైన క్రమంలో పెంచాలి.. ఆ విధంగానే వారిని తయారు చేస్తున్నాను. ' అన్నారు.

' నా బిడ్డలు ఎప్పటికీ తప్పు చేయరు. ఒకవేళ వాళ్లు తప్పు చేస్తే నన్నే తప్పుపట్టండి. ఆ అవకాశం వాళ్లు కూడా ఎవరికీ ఇవ్వరు. ఒక అబ్బాయి సమాజంలో ఎలా ఉండాలో అకీరాకు నేర్పించాను. అలాగే ఆధ్యాకు కూడా పలు విషయాలు ఎప్పుడూ చెబుతూనే పెంచాను. భవిష్యత్‌లో ఆధ్యా ఒకరికి భార్య అవుతుంది, మరొకరికి తల్లి అవుతుంది. మరొక కుటుంబంలో కోడలిగా అడుగుపెడుతుంది. వారందరికీ మంచి పేరు తీసుకురావాలి. అలాంటి దారిలోనే నా పిల్లలను పెంచాను. ' అని చెప్పారు.

' టైగర్‌ నాగేశ్వరరావు చిత్రం వల్ల నేను ఈ మధ్య పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి నెగటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. పవన్‌ గురించి మాట్లాడకండి అంటూ వార్న్‌ చేస్తున్నారు. కొంతమంది పనికట్టుకుని మరీ ఇలాంటి పనులు చేస్తున్నారు. నాకు నచ్చినట్లు ఉంటాను వాళ్లు ఎవరు నన్ను ప్రశ్నించడానికి. పవన్‌ గురించి నాకు ఇష్టం ఉంటేనే మాట్లాడుతాను లేదంటే లేదు. వాళ్లు ఎవరు నన్ను కమాండ్‌ చేయడానికి. ' అని పవన్‌ ఫ్యాన్స్‌పై రేణు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా రేణు రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో పవన్‌ ఫ్యాన్స్‌ చేసిన రచ్చ గురించి చెప్పారు. రెండో పెళ్లి ఎందుకని బూతులతో ఆమెపై తెగబడ్డారనీ... ఆమె పెళ్లి చేసుకుంటే పవన్‌ పరువు ఏం కావాలని ఫ్యాన్స్‌ కామెంట్లు చేసిన సంగతి తెలిపారు.