అంతా బాగుందని ఎవరన్నారు
చీలికలైన పొరల్లోంచి
ఆకలి కేకలు వినిపిస్తూనే వున్నాయి.
అంతా సరిచేశామని
ఏ ఏలికలు చెప్పారు
మడత పడిన పేగుల్లోంచి
కడుపు మంట రాగాలు
ఎల్లవేళలా ఘోషిస్తూనే వున్నాయి.
నాలుగంచులా సవ్యంగా వుందని
ఏ పాలిత పాటలు ఊపందుకున్నాయి
మూల మూలల్లో వదిలేసిన
ఎంగిలి మెతుకుల్తో
కొన్ని ప్రాణాలు నిలుస్తున్నాయి.
అంతా మా కష్టమేనని
ఎవరు నినదిస్తున్నారు
బరువెక్కిన బతుకుల్లోంచి
కొన్ని దేహాలు రాలిపడుతున్నాయి.
అంతా మా సలవేనని
మాటల్ని పూసల్లా పేర్చిందెవరు
గొంతులెండిన శ్వాసల్లోంచి
కొన్ని మాటలు మూగబోయాయి.
ఇక ఆకలి పోరాటం
పిడికిలి బిగించందే
బక్కచిక్కిన శరీరాలకు చలనముండదు
మారుమూల అణచబడిన
అకలి కడుపులకు అన్నం వుండదు.
- నరెద్దుల రాజారెడ్డి
సెల్ : 9666016636