ఎంత చేదు కొసరినా
జీవితాన్ని అనుభవించక తప్పదు కదా
ఆరు పదులైనా ఏడు పదులైనా
జీవితాన్ని చంకన పెట్టుకొని సాగిపోవాలి అనుభవాలన్నీ నలుగురితో పంచుకోవాలి మంచైనా చెడైనా వొక దారి దొరుకుతుంది పిట్టల్లా
బంధువులు స్నేహితులు
అయినవారు కానివారు
అందరూ గంపగుత్తగా రాలిపోయాక
కనీసం కన్నీళ్లు పంచుకోటానికైనా
ఎవరికీ ధైర్యం చాలానప్పుడు
పలకరించే ముఖాలు కొత్తవే కావొచ్చు
శిథిలాల నుంచి పునర్జన్మ పొందిన
సంకోచం గుండెను గాయపరచవచ్చు
భయం ఆవహించినప్పుడు
పరాయితనం గురించి కాదు
గుండెను తాకిన క్షణం గురించి ఆలోచించాలి
ప్రపంచం యావత్తు ఒక వైపు
అగోచర భూకంప శత్రువు ఒకవైపు
జన సైన్యం కొనసాగిస్తున్న యుద్ధం మరోవైపు
కొడుకులు కూతుళ్లు కట్టుకున్న ఇల్లాలు ఒక ఎత్తైతే
అన్నలు తమ్ముళ్లు బంధువులు మరో ఎత్తై
తమలో ప్రవహిస్తున్న రక్తాన్ని అంటరానిది చేసినప్పుడు
నాలుగు జతల కాళ్లతో
భూ ప్రళయం అష్టదిగ్బంధనం చేసి
అందరూ ఉన్న అనాథని గుండెలకు హత్తుకుని
కర్త కర్మ క్రియని గీతార్థ సారంలో ముగించి
బైబిల్ ఖురాన్ గ్రంధ్ అవెస్తాలని తృప్తిపరుస్తూ
ఆఫన్న హస్తమై ఆదుకొన్నవేళ
ఎలా మరువగలం మూర్తి భావించిన మానవత్వాన్ని
దైవం మానుష రూపేణ అన్న సత్యాన్ని.
అయినా యుద్ధం ముగియలేదు
ఆకు రాలే కాలం రుతువు మారలేదు
ప్రపంచం వొక సుదీర్ఘ యుద్ధాన్ని
మనోధైర్యంతో కొనసాగిస్తూనే ఉంది
శత్రువు ప్రత్యక్షమవుతునే వున్నాడు
మనిషి నుండి నిద్రని దొంగలించిన
శత్రువు కంటే మించిన విరోధి లేడు
ఊపిరి గుర్రం పైన స్వారీ చేస్తూ
ఒక్కసారి కోట్లకొద్ది సరాలు అందించగల ధనుర్ధారి
భూ ప్రళయాన్ని మట్టుబెట్టాలంటే
పిటికళ్లు కాదు
ప్రకృతి పైన జెండా ఎగురేయాలి
నీటికీ తిండికి వాచిపోయిన బాధితుల్ని ఆదుకోవాలి
కూటికి లేని వాళ్ళ నోటి ముద్ద కావాలి
మానసిక బొబ్బలకు బలం కావాలి
కష్టాల కడలిలో బాటలు పరుచుకోవాలి
అందరినీ ఆత్మీయంగా కలుపుకొని
ఆత్మవిశ్వాసం పెంచుకుంటే కానీ
మనోధైర్యం నింపగలిగితే కానీ
ఈ విపత్తును జయించలేము
కొండంత శత్రువును కంకర రాయిలా మార్చాలంటే
మానవత్వం ఒకే తాడుగా అల్లుకోవాలి
ప్రపంచ దేశాలే కాదు
ప్రతి మనిషీ మేలుకోవాలి!
- ఈతకోట సుబ్బారావు
94405 29785










