Apr 24,2023 20:27
  • క్యూ4లో రెట్టింపై రూ.840 కోట్లు

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బిఒఎం) అత్యంత ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. బ్యాంక్‌ మొండి బాకీలు తగ్గడం, ఆదాయం పెరగడంతో గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 136 శాతం వృద్థితో రూ.840 కోట్ల లాభాలు సాధించింది. ఇంతక్రితం ఇదే క్యూ4లో రూ.355 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.3,949 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. క్రితం క్యూ4లో రూ.5,317 కోట్లకు చేరింది. నికర వడ్డీపై ఆదాయం రూ.3,426 కోట్ల నుంచి రూ.4,495 కోట్లకు పెరిగింది. 2023 మార్చి 31తో ముగిసిన ఏడాదికి గాను రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.1.30 లేదా 13 శాతం డివిడెండ్‌ను అందించడానికి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ) 2.47 శాతానికి తగ్గాయి. 2022 మార్చి 31 నాటికి జిఎన్‌పిఎ 3.94 శాతంగా నమోదయ్యింది. నికర నిరర్థక ఆస్తులు 0.97 శాతం నుంచి ఏకంగా 0.25 శాతానికి తగ్గడం విశేషం.