Mar 06,2023 21:53
  • దశల వారిగా 550 విద్యుత్‌ బస్సుల పంపిణీ
  • త్వరలోనే మొదటి ఆర్డర్‌ సరఫరా

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఒజిఎల్‌)కు 550 విద్యుత్‌ బస్సుల భారీ ఆర్డర్‌ లభించింది. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌)కు చెందిన ఒజిఎల్‌ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను సరఫరా చేయనుంది. ఈ ఆర్డర్‌ దక్షిణ భారతదేశంలోనే తమకు అతి పెద్దదని ఒజిఎల్‌ సిఎండి కెవి ప్రదీప్‌ తెలిపారు. ''పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తాము మరిన్ని విద్యుత్‌ బస్సులను తీసుకురావాలని నిర్ణయించాము. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 ఇవి బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నాము.'' అని టిఎస్‌ఆర్‌టిసి ఛైర్మన్‌, ఎంఎల్‌ఎ బాజీరెడ్డి గోవర్థన్‌ రెడ్డి పేర్కొన్నారు. ''మార్చి 2025 నాటికి హైదరాబాద్‌ అంతటా విద్యుత్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. తొలి దశలో 550 ఈ-బస్సులను గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జిసిసి) పద్ధతిలో తీసుకుంటున్నాము. ఈ బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి.'' అని టిఎస్‌ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్‌ తెలిపారు. ''స్థిరమైన, ఆర్థికంగా బలమైన, పెద్ద ఎత్తున ప్రజా రవాణా చేసే టిఎస్‌ఆర్‌టిసితో కలిసి పనిచేసే అవకాశం మరోసారి వచ్చినందుకు మేము గర్విస్తున్నాము. ఈ బస్సులు నగరంలో ధ్వని, వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి'' అని కెవి ప్రదీప్‌ వెల్లడించారు. టిఎస్‌ఆర్‌టిసితో ఒలెక్ట్రా అనుబంధం 40 ఎలక్ట్రిక్‌ బస్సుల ఆర్డర్‌తో మార్చి 2019లోనే ప్రారంభమైందని ప్రదీప్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ బస్సులు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయన్నారు. నాలుగేళ్ల తర్వాత మరోసారి భారీ ఆర్డర్‌ దక్కిందన్నారు. ఇవి మెరుగైన పనితీరును అందిస్తూ.. ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో సేవలు అందిస్తాయని ప్రదీప్‌ తెలిపారు. అధిక ప్రయాణీకుల సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రజారవాణా కోసం అద్భుతమైన ఎంపిక అని పేర్కొన్నారు. ఒలెక్ట్రా ఇవి బస్సుల నిర్వహణ, విస్తరణ, కార్యకలాపాల కోసం టిఎస్‌ఆర్‌టిసి జంటనగరాల్లోని దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, జీడిమెట్ల, మియాపూర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్లలో ఐదు డిపోలను ఏర్పాటు చేయనుందని సమాచారం. ఎసి ఇంటర్‌ సిటీ కోచ్‌ విద్యుత్‌ బస్సులు హైదరాబాద్‌, విజయవాడ మధ్య తిరుగుతాయి. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 325 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్‌ బస్సులు హైదరాబాద్‌ నగర పరిధిలో తిరుగుతాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి.