హైదరాబాద్: ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు టీఎస్‌ఆర్టీసీ వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల రాఖీపౌర్ణమికి నిర్వహించిన లక్కీడ్రాకు విశేష స్పందన రావడంతో దసరాకు సైతం అదే తరహా ఏర్పాట్లు చేస్తోంది. దసరాకు 5వేలకు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన టీఎస్‌ఆర్టీసీ సంస్థ.. తమ బస్సుల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు నగదు బహుమతులు గెలుచుకొనే ఛాన్స్ కల్పిస్తోంది. ఈ లక్కీ డ్రా ద్వారా రూ. 11 లక్షల నగదు బహుమతులను ప్రయాణికులకు అందించే అద్భుత అవకాశాన్ని అందిస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇందుకోసం ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుక తమ పూర్తి పేరు, ఫోన్ నంబర్‌ను రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్కుల్లో వేయాలని సూచించారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్టు సజ్జనార్ తెలిపారు. ప్రతి రీజియన్‌కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు చొప్పున మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున నగదు బహుమతులను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుంచి 23 తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల్లో టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చన్నారు.బతుకమ్మ, దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దఅష్ట్యా టీఎస్‌ఆర్టీసీ 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్ష్లను ఏర్పాటు చేస్తారు. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్‌లను సంబంధిత ఆర్‌ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. మొత్తం 11 రీజియన్లలో కలిపి 110 విజేతలను ఎంపిక చేసి వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేస్తారు. దసరా లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.