Sep 23,2022 09:17

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం నుంచి వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. పన్నుల రూపంలో వసూలు చేసే రెవెన్యూ ఆదాయాల్లో 2020-21 మధ్య కాలంలో అమ్మకాలు, వాణిజ్యం, మొదలైన వాటిపై పన్నులు, రాష్ట్ర వస్తు సేవల పన్నులు, అబ్కారీ శాఖల ఆదాయం 84 శాతానికి చేరింది. రాష్ట్రానికి వస్తున్న మొత్తం రెవెన్యూ రాబడి రూ.1,17,136 ఉండగా, దానిలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.57,409 కోట్లుగా ఉంది. అంటే మొత్తం ఆదాయంలో 49.01 శాతం. 2016 నుండి పోలిస్తే ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అబ్కారీ శాఖ ద్వారా ఆదాయం రూ.4,645 కోట్లు ఉండగా, 2019-20 నాటికి రూ.6,915 కోట్లుకు చేరింది. 2020-21లో రూ.7,913 కోట్లు వస్తాయని బడ్జెట్‌ అంచనాల్లో చూపించగా, రూ.11,575 కోట్లు వచ్చాయి. అంటే 2019 నుండి 2020-21 ఆర్థిక సంవత్సరానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.4,660 కోట్లకు చేరింది. పరుగుదల 67.39 శాతానికి చేరింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిస్తామని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. బార్ల లైసెన్సులు తగ్గించింది. ప్రభుత్వం ద్వారా అమ్మకాలు మొదలుపెట్టింది. మద్యం ధరలు పెంచడం ద్వారా పేదలు మద్యం జోలికి రాకుండా చూస్తామని ప్రకటించింది. మద్యంపై విధించిన అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను(ఎఆర్‌ఇటి)తో ఆదాయాన్ని మరింత పెంచుకుంది. రెవెన్యూ ఆదాయాలు వచ్చే శాఖల్లో బడ్జెట్‌ అంచనాలను ఒకటీ రెండు శాఖలు చేరుకోలేకపోయినా మద్యం అంచనాలను మించి అమ్మకాలు జరగడం విశేషం.