Aug 10,2023 12:57

తుని (కాకినాడ) : రోడ్డుపై చేపలలోడుతో వెళ్లే లారీ పడిపోయినప్పుడు, కోడిగుడ్ల వ్యాన్‌లు పడినప్పుడు, పాల ప్యాకెట్ల వ్యాన్‌లు పడినప్పుడు.... ఎక్కడెక్కడి నుండో జనం అక్కడకు చేరుకొని అందినకాడికి పట్టుకుపోయిన ఘటనలు అప్పుడప్పుడు చూశాం.. విన్నాం.. అయితే అలానే... అన్ని రకాల మద్యం సీసాలు కుప్పలుకుప్పలుగా పడితే.. అక్కడి మందుబాబుల హంగామానే వేరు..!

కాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు దగ్గర ఓ ఘటన జరిగింది. బీర్‌, బ్రాంది, విస్కీ, వైన్‌ ఇలా... అన్ని రకాల మద్యం సీసాలతో ఓ మినీ వ్యాన్‌ వెళుతూ .... కాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు దగ్గర ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో కొన్ని మద్యం సీసాలు ధ్వంసం కాగా మరికొన్ని కిందపడ్డాయి... ఇంకేముంది... వెంటనే జనాలు పోగయ్యారు.. మద్యం సీసాల కోసం ఎగబడ్డారు. అందినకాడికి ఎత్తుకుపోయారు.. కొంతమందైతే సంచులుసంచులు తెచ్చుకొని తీసుకెళ్లిపోయారు... ' భలే ఛాన్సులే ... లిక్కర్‌ ఛాన్సులే ' అన్నట్లు మందుబాబుల హడావిడితో ఆ ప్రాంతమంతా హడలెత్తింది. మొత్తానికి పోలీసులకు ఈ విషయం తెలియడంతో పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం సీసాలను ఎవ్వరూ తీసుకెళ్లకుండా ఆపారు. కానీ అప్పటికే చాలావరకు మద్యం సీసాలు ఖాళీ అయ్యాయి. అక్కడున్న మందుబాబులను ఆపడం పోలీసులకు కూడా కష్టతరమయ్యింది. పోలీసులు పడ్డ అవస్థలు చెప్పనక్కర లేదనుకుంటా..!