Jul 30,2023 12:01

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి గంట, గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ... లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి వశిష్ట గోదావరి మరింత ఉధృతంగా మారింది. ధవళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు సముద్రంలోకి వదులుతుండటంతో వశిష్ట గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో లంక గ్రామాలకు వరద నీరు మెల్లమెల్లగా చేరుతుంది. మండలంలో పుచ్చలలంక, నెక్కిడిలంక, రాయిలంకలు ముంపు బారినపడ్డాయి. అయోధ్య లంకలో పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది. అయోధ్య లంకలో ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. లంక వాసులకు రాకపోకలు నిలిచిపోవడంతో వారు నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. భీమలాపురం ఏటిగట్టుకు దిగువన ఉన్న కాపులపాలెం లో వరద నీరు చుట్టుముడుతుంది. పంటలు నీటమునిగాయి. లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా తమలపాకు పండించిన రైతులకు తీవ్ర నష్టాలు తప్పడం లేదు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టామని రైతులు వాపోతున్నారు. పచ్చిమిర్చి, అరటి, వంగా, బెండ, బీర, ఆనభ చిక్కుడు, మునగ, తోటకూర, గోంగూర, తదితర ఇతర కూరగాయ తోటలు కూడా పూర్తిగా నీట మునిగాయి. రైతులు సురక్షిత ప్రాంతాలకు పశువులను తరలిస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరుగుతున్న నేపథ్యంలో ... లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. లంక గ్రామాలయిన పెదమల్లం పంచాయతీ పరిధి ఆనగారలంక, పెదమల్లంలంక, కోడేరు పల్లెపాలెం, అయోధ్య లంక, మర్రి మూల, పుచ్చల లంక, రాయిలంక, నక్కిడి లంక, పెద్ద పేట, భీమలాపురం, పంచాయతీ పరిధి కాపుల పాలెంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రభుత్వపరంగా భోజన సదుపాయాలు కల్పించారు.