Aug 17,2023 21:01

రూ.3వేల కోట్లతో ప్రాజెక్ట్‌
18వ టవర్లలో 3266 నివాసాలు
ఆ సంస్థ ప్రమోటర్ల వెల్లడి
హైదరాబాద్‌ : ప్రముఖ నిర్మాణ సంస్థ హానర్‌ హోమ్స్‌ రూ.3,000 కోట్లతో కొత్త ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది. కూకట్‌పల్లి ఐడిఎల్‌ చెరువు సమీపంలో 27.5 ఎకరాల్లో 'హానర్‌ సిగ్నాటిస్‌' నిర్మాణాన్ని చేపడుతున్నామని హానర్‌ ప్రమోటర్‌, డైరెక్టర్‌ ఎం బాలు చౌదరి తెలిపారు. మొత్తం 3266 నివాసాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. గురువారం హైదరాబాద్‌లో నూతన ప్రాజెక్టు బ్రోచర్‌ను ఆ సంస్థ డైరెక్టర్లు బాలు చౌదరి, వెంకటేశ్వర్లు, వై స్వప్ప కుమార్‌, ఎస్‌ రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బాలు చౌదరీ మీడియాతో మాట్లాడతూ.. ఇది తమకు నాలుగవ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ అని తెలిపారు. ఇప్పటికే 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామన్నారు. గడిచిన రెండు ప్రాజెక్టుల్లో రూ.2,000 కోట్ల వ్యాపారం నమోదు చేశామన్నారు.
హానర్‌ సిగ్నాటిస్‌ ప్రాజెక్ట్‌ను 18 టవర్లతో 3 లెవల్‌ పార్కింగ్‌, 26 అంతస్తులతో అందుబాటులోకి తేనున్నామన్నారు. ఇందులో 1695 నుంచి 3815 అడుగుల విస్తీర్ణంలో 3, 3.5, 4 పడక గదులతో నివాసాలను అభివృద్థి చేయనున్నామన్నారు. ఆగస్ట్‌ 19న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుందని.. ఆఫర్‌లో చదరపు అడుగు ధర.7499గా నిర్ణయించామన్నారు. ఇప్పటికే 1200 ఫ్లాట్లకు అడ్వాన్స్‌ బుకింగ్‌లు వచ్చాయన్నారు. నగరం మధ్యలో ఇదే అత్యంత పెద్ద ప్రాజెక్ట్‌ అని పేర్కొన్నారు. విశాలమైన 2 క్లబ్‌ హౌసులు, రెండు స్విమ్మింగ్‌ పూల్స్‌, 20వేల చదరపు అడుగుల్లో అతిపెద్ద జిమ్‌ సెంటర్‌. 5 ఎకరాల సెంట్రల్‌ పార్క్‌, వెహికల్‌ ఫ్రీ పోడియం లెవల్‌, ఇవి ఛార్జింగ్‌ స్టేషన్స్‌ తదితర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. హానర్‌ సిగటీస్‌కు పర్యావరణహిత ప్రాజెక్టుగా ఐజిబిసి ముందస్తు సర్టిఫికెట్‌ కూడా ఇచ్చిందన్నారు. తొలి దశ దాదాపు 50 శాతం ఫ్లాట్లు 2026 డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి రానున్నాయన్నారు. 2027 ముగింపు నాటికి రెండో దశ పూర్తి కానుందన్నారు. నగరంలోనే మరో రెండు కొత్త ప్రాజెక్టులు చేపట్టే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. దాదాపు కోటి చదరపు అడుగుల్లో వీటిని చేపట్టనున్నామన్నారు.