Feb 24,2023 11:01
  • రూ.20,287 కోట్లతో అధికారుల ప్రతిపాదనలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వైద్యం కోసం భారీ నిధులు కోరుతూ ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం బడ్జెట్‌లో దాదాపు పది శాతం వరకు కావాలని వారు ప్రతిపాదించడం గమనార్హం. అయితే ఇందులో కేంద్ర పథకాలకు వచ్చే నిధులను కూడా కలిపి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. మొత్తమ్మీద తమకు రూ.20,287 కోట్లు కేటాయించాలని వారు కోరుతున్నారు.
            తాజా ప్రతిపాదనల్లో అత్యధికంగా వైద్య విద్యకు రూ.9,906 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌కు రూ.4,858 కోట్లు, వైద్య విధాన పరిషత్‌కు రూ.2,477 కోట్లు ప్రతిపాదించగా, అంతంతమాత్రంగానే సాగుతున్న రూ.2,953 కోట్లు కావాలని ప్రతిపాదించడం విశేషం. ఈ మొత్తం ప్రతిపాదనల్లో చేసే వ్యయంపైనా వివరణ సమర్పించారు. మందుల సరఫరాకు రూ.715 కోట్లు వ్యయం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అనేక ఆస్పత్రుల్లో సరైన మందులు లభ్యం కాని పరిస్థితుల్లో ఈ రంగానికి రూ.700 కోట్లకుపైగా కేటాయించాలని కోరడం గమనార్హం. 60-40 వాటా నిధులతో కేంద్ర సహకారంతో అమలుచేసే జాతీయ హెల్త్‌ మిషన్‌కు రూ.4,094 కోట్లు అవసరమవుతాయని కోరారు. పలు ఆస్పత్రుల్లో సర్జికల్‌ పరికరాల కొనుగోలుకు రూ.715 కోట్లు, కంటి వెలుగు కార్యక్రమానికి రూ.20 కోట్లు, నవరత్నాల్లోని నాడు-నేడు కార్యక్రమంలో సబ్‌ సెంటర్‌ నుంచి బోధనాస్పత్రుల వరకు మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ.3,639 కోట్లు కావాలని ప్రతిపాదించారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కిరద రూ.493 కోట్లు, 108, 104 వాహనాల కోసం రూ.478 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.
           2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.14,088 కోట్లను ప్రతిపాదించగా 2022-23లో రూ.15,708 కోట్లను ప్రతిపాదించారు. ఇళా ప్రతియేటా కొంత శాతాన్ని పెంచుతూ ప్రతిపాదనలు పంపించడం అన్ని శాఖలకూ ఆనవాయితీగా మారగా, ఆరోగ్యశాఖ కూడా గతేడాది 13 శాతం పెంపుతో ప్రతిపాదనలు పంపించడం గమనార్హం. ఈ ఏడాది కూడా అదే కోవలో పెంచి అడగడం విశేషం. కేంద్రం నుంచి నిధుల రాక తక్కువగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపుల కన్నా విడుదల తక్కువగా ఉన్నా.. ప్రతిపాదనలు భారీగా సమర్పించడం గమనార్హం.