గాంధీ నగర్ : సాంప్రదాయ వైద్యంలో భారత్ ఘనమైన చరిత్రను కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వ్యాఖ్యానించింది. గాంధీనగర్‌లో గురువారం ప్రారంభమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయ వైద్యం అంతర్జాతీయ సదస్సును డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్ టెడ్రోస్ అథ్‌నామ్ ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు టెడ్రోస్ బుధవారం భారత్ చేరుకున్నారు. అనంతరం ఈ సదస్సులో ప్రసంగించారు. సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం గొప్ప చరిత్రను కలిగి ఉందని, ఇందులో ముఖ్యంగా యోగా నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని టెడ్రోస్ పేర్కొన్నారు. సంక్రమించని వ్యాధులు, మానసిక ఆరోగ్యంతో పాటు అనేక ఇతర వ్యాధుల చికిత్సకు ఇతర దేశాలు సాంప్రదాయ ఔషధాన్ని వినియోగిస్తున్నాయని అన్నారు. సాంప్రదాయ వైద్యం మానవ ఆరోగ్యానికి తగిన సహకారం అందించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
బుధవారం గుజరాత్‌లోని వెయ్యి నివాసాల్లోని 5,000 మంది ప్రజలకు ఆరోగ్య సేవలను అందించే ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించే అవకాశం తనకు కలిగిందని అన్నారు. వారు మెడిసిన్‌ని వినియోగిస్తున్న విధానం, సేవలను విస్తరించడం, సమయం, డబ్బు ఆదా చేయడం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు, ప్రాథమిక వైద్య సేవల స్థాయిలోనే సాంప్రదాయ వైద్యాన్ని అనుసరించడాన్ని తాను చూశానని అన్నారు. సాంప్రదాయ వైద్యంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే.. మానవుల ఆరోగ్యం, పర్యావరణం మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. దీంతో జామ్‌నగర్‌లో ''గ్లోబల్ ట్రెడిషినల్ మెడిసిన్ సెంటర్'' ద్వారా ఈ ఔషధాలను ఇతర దేశాలకు విస్తరించేందుకు సహకరించాలని అన్నారు. గతేడాది ఈ సెంటర్‌ను ప్రధాని మోడీతో కలిసి ప్రారంభించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.