Jun 06,2023 16:05
  •  రాష్ట్ర షూటింగ్‌ బాల్‌ సంఘం చైర్మన్‌ అర్‌.డి.ప్రసాద్‌

ప్రజాశక్తి-కర్నూల్‌ స్పోర్ట్స్‌ : షూటింగ్‌ బాల్‌ ఫెడరేషన్‌ పేరుతో కర్నూలుకు చెందిన పరుశు రాముడు విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్‌లు అందజేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని మరో వైపు తమ ఫెడరేషన్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ క్రీడాకారులకు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్పార్ట్స్‌ అథారిటీ అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడని రాష్ట్ర షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ అర్‌.డి.ప్రసాద్‌,సెక్రెటరీ జోసఫ్‌ లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని మౌర్య ఇన్‌ హౌటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కర్నూల్‌లో ఒక పేరూపొందిన స్కూల్‌లో పిఈటిగా ఉన్న పరుశురాముడు చేస్తున్న దురాగతాలపై గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన క్రీడా పోటీలు అడ్డుకోవడానికి ఎంపీ నందిగాం సురేష్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి కుట్రలు చేయడం సరైంది కాదన్నారు. క్రీడాల పేరుతో పరుశు రాముడు చేస్తున్న అక్రమ వసూళ్లు, బాగోతాలు మీడియా ముందు డిబేట్‌ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకే వ్యక్తిగా అనేక సంఘాల పేరుతో జరుగుతున్న అక్రమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అనేక క్రిమినల్‌ కేసులో ముద్దాయి గా ఉన్న పరుశురాముడుపై గతంలో స్పోర్ట్స్‌ అథారిటీకి పిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అ సమావేశంలో కర్నూలు జిల్లా షూటింగ్‌ బాల్‌ సంఘం ఈశ్వర్‌ నాయుడు, నంద్యాల జిల్లా సంఘం నరేష్‌, అటియ పాటియా నిర్వాహక కార్యదర్శి వంశీకృష్ణ హాజరై మాట్లాడారు.