1992 డిసెంబరు6న బాబ్రీ మసీదు కూల్చివేత యాదృచ్ఛికంగా జరిగిందేమీ కాదు. బిజెపి, సంఫ్‌ుపరివార్ ఒక పథకం ప్రకారమే దాన్నీ కూల్చేశాయి. కార్పొరేట్లకు ఒక వైపు ఊడిగం చేస్తూ, మరో వైపు హిందూత్వ ఎజెండాను ముందుకు తెచ్చి ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు మతతత్వ బిజెపి ప్రయత్నిస్తున్నది.
ఆ రోజు ఏం జరిగింది ?
1992 డిసెంబరు6న అయోధ్యలో కరసేవ నిర్వహించడం వల్ల బాబ్రీ మసీదు కట్టడానికి ఎటువంటి ముప్పు ఉండబోదని సుప్రీం కోర్టుకు సమర్పించిన ప్రమాణ పత్రానికి భిన్నంగా బిజెపి, ఆరెస్సెస్‌లు మోసపూరితంగా వ్యవహరించాయి. అయోధ్యలో యథాతథ స్థితి (స్టేటస్‌కో)ను మార్చే ఎటువంటి యత్నాన్ని తన ప్రభుత్వం అనుమతించబోదని సుప్రీం కోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి యుపి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ పదే పదే హామీ ఇచ్చారు. వివాదాస్పద స్థలిలో ఎవరూ గుమికూడరాదని నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కొన్ని రోజుల ముందు నుంచే కరసేవకులు అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకోనారంభించారు. జూలై-ఆగస్టు నెలల్లో 13 రోజులపాటు ప్రతీ ఏటా ఝూలా యాత్ర లక్షలాదిమంది భక్తులతో జరుగుతుంది. సరిగ్గా ఆ సమయాన్ని సంఘపరివార్ ఎంచుకుంది. యుపిలో బిజెపి ప్రభుత్వ అండతోనే ఇదంతా జరిగింది. కరసేవకులు దాడి చేస్తుంటే కల్యాణ్ సింగ్ ప్రభుత్వం చోద్యం చూసిందే తప్ప, వారిని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేంద్రంలో పివి నరసింహారావు ప్రభుత్వం చేష్టలుడిగినట్లు వ్యవహరించడం వల్లే ఆరెస్సెస్ ఆధ్వర్యంలో మూకలు బాబ్రీ మసీదును పూర్తిగా నేలమట్టం చేయగలిగాయి. మసీదు కూల్చివేతకు సంబంధించి కరసేవకులకు కొన్ని నెలల ముందు నుంచే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.. రెగ్యులర్ డ్రిల్లుతో బాటు ఎత్తయిన కట్టడాలను ఎక్కడంలో,. నేలను తవ్వడం, తాడు పట్టుకుని పైకి ఎగబాకడం వంటి వాటిలో వారు తర్ఫీదు పొందినట్టు కోబ్రా పోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత బిజెపి పాలిత రాష్ట్రాలు స్కూల్ పాఠ్యాంశాలను కాషాయీకరించే యత్నం చేశాయి. చివరికి గణితాన్ని కూడా వదల్లేదు. ఉదాహరణకు ఒక మసీదును కూల్చడానికి పది మందికి వారం రోజులు పడితే, వంద మంది ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇటువంటి ప్రశ్నల ద్వారా విద్యార్థుల మనసుల్లో విద్వేషాన్ని కుమ్మరించే యత్నం చేసింది. అందుకే బిజెపిని ఆటవిక, అనాగరిక పార్టీ అని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబాసు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆప్పటి ప్రధాని వాజ్‌పేయి గింజుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో పర్యటనకు వెళ్లిన సమయంలో జ్యోతిబసు కలసినప్పుడు 'మా పార్టీని ఎందుకలా తీవ్ర పదజాలంతో నిందించారు' అని అడిగారట. దీనికి జ్యోతిబసు ఠక్కున బదులిస్తూ, 'డిక్షనరీలో ఇంతకన్నా తీవ్రమైన పదాలేవైనా ఉన్నాయా అని వెతికాను. కానీ, దొరకలేదు' అని చెప్పారు. దీంతో వాజ్‌పేయి కంగుతిన్నారు.
- కె గడ్డెన్న










