Sep 09,2022 07:57

పిల్లలూ, హఠాత్తుగా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఏ విధంగా వైద్యం అందించాలో ఈ రోజు తెలుసుకుందామా !

చిన్న గాయాలు, హఠాత్తుగా జరిగే సంఘటనల సమయంలో నిపుణుల వైద్యం అందేలోపల తాత్కాలికంగా అందించే వైద్యవిధానాన్ని ప్రథమ చికిత్స అంటారు. ప్రమాద తీవ్రత తగ్గించడానికి ప్రాథమిక చికిత్స అందించటం చాలా అవసరం.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు :
1. ఘటన స్థలం నుంచి సురక్షిత ప్రదేశానికి బాధితుడిని తీసుకెళ్లాలి.
3. అంబులెన్సు సమాచారం అందించి ప్రథమ చికిత్స ప్రారంభించాలి.
4. బాధితుడి శ్వాస ఆడుతున్నా స్పహలో లేకుంటే.. ముందుగా గాయాలను తనిఖీ చేయాలి.
5. బాహ్య గాయాలు లేకుంటే అతని తల పైకి ఉండేలా చేసి.. కాళ్లను కొద్దిగా మడవాలి. అలా అతన్ని అంబులెన్స్‌ వచ్చే వరకు గమనిస్తూ ఉండాలి.
6. ఒక వేళ గాయపడిన వ్యక్తి ఊపిరి పీల్చకుంటే వెంటనే సీపీఆర్‌ (నోటి ద్వారా శ్వాస అందించటం, ఛాతీ భాగంలో నొక్కటం) చేయాలి. ఈ ప్రక్రియ మీకు పూర్తిగా తెలియకపోతే గుండె భాగంలో నొక్కటం వల్ల కొంత మేర ఫలితం ఉంటుంది.
తీవ్ర గాయాలైతే ...
1. ఒకవేళ బాధితుడికి ఎముకలు విరిగాయన్న విషయంపై స్పష్టత లేకపోతే, కచ్చితంగా ఎముకలు విరిగి ఉంటాయన్న భావనతోనే సహాయం అందించాలి. ఆసుపత్రికి తరలించే వరకూ నిశ్చలంగా ఉంచాలి.
3. ఒక వేళ గాయం తగిలిందని తేలితే.. ఆ భాగాన్ని గుడ్డతో గట్టిగా కట్టాలి.
4. శరీరంలో ఏదైనా గుచ్చుకుని ఉంటే దానిని తీసేందుకు ప్రయత్నించవచ్చు. కానీ, విరిగిన లేదా గాయపడిన ఎముకను యథాస్థానంలో ఉంచడానికి ప్రయత్నించకూడదు.
5. ఎముక విరిగి బయటికి వచ్చిన సందర్భాల్లో గాయాన్ని కొంత మేర శుభ్రం చేయవచ్చు.
6. గాయపడిన వ్యక్తికి నొప్పి/ బాహ్య గాయాలు లేకపోతే లేదా అంబులెన్స్‌ రావడానికి ఆలస్యం అవుతున్నట్లయితే వెంటనే అందుబాటులో ఉన్న వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించాలి.
7. గాయపడిన వ్యక్తికి అవసరానికి మించి నీళ్లు తాగించకూడదు. ఈ సమయంలో నీరు తాగితే ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంది. ఏదైనా ఆహారం తీసుకుంటే గాయపడిన వ్యక్తికి శస్త్రచికిత్స చేయటానికి ఆలస్యం అవుతుంది.
రక్తస్రావం అవుతుంటే...
1. బాధితుడికి ముందు గాయాలను పరిశీలించి.. ఆ తర్వాత రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నించాలి.
2. రక్తస్రావం జరుగుతున్న ప్రదేశంలో గట్టిగా కట్టుకట్టాలి. ఎముకలు విరిగి బయటికి రావటం, లోతుగా ఏదైనా వస్తువు దిగటం, బాహ్యంగా కనిపించే గాయాలున్న చోట రక్తం ఎక్కువగా కారుతుంది. ఇక్కడ గట్టిగా కట్టు కట్టినా రక్తస్రావం ఆగకపోవచ్చు. చేతులు, కాళ్ల మీద అయ్యే గాయాలకు 'టార్నిక్వెట్‌' ధమనిని అదిమి రక్తస్రావాన్ని నిలువరించవచ్చు. అయితే ఇది నిపుణులు మాత్రమే చేయగలరు.
3. గాయాల్లో చిక్కుకున్న పదార్థాలను తొలగించేందుకు ప్రయత్నిస్తే గాయాలు పెద్దవి కావటమో, రక్తం కారటమో జరుగుతుంది. ఆ వస్తువు గుచ్చుకొన్న తీరును నిశితంగా పరిశీలించి ప్రమాదం లేదని నిర్ధారించుకొన్న తర్వాతే తీయాలి.
ప్రమాదాలు జరిగిన వెంటనే ఈ జాగ్రత్తలు పాటించి ప్రాథమిక చికిత్స అందిస్తే బాధితులను కాపాడిన వారమవుతాం. అందుకే ప్రాథమిక చికిత్సపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం.

- డాక్టర్‌ బాలాజీ దీక్షితులు పి.వి
88853 91722


పిల్లలూ, మీ కథలు, బొమ్మలూ పంపండి. ఇదిగో మెయిల్‌ ఐడీ: chinnaarips@gmail.com