Aug 23,2023 12:57

ఇంటర్నెట్‌డెస్క్‌ : గ్రంథాలయం ఓ విజ్ఞాన భాండాగారం. చరిత్రకు వారధిగా నిలిచే ఈ గ్రంథాలయాలు మన దేశంలో ఎన్ని ఉన్నాయి? బ్రిటిష్‌వారి కాలంలో కట్టిన గ్రంథాలయం ఎక్కడుంది? మొదటి పబ్లిక్‌ లైబ్రరీ మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది వంటి విషయాలను తెలుసుకుందామా? ప్రధానంగా మన దేశంలో 46,746 పబ్లిక్‌ లైబ్రరీలు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 12,191 లైబ్రరీలు ఉన్నాయి. ఇక కేరళ 8,415, కర్ణాటక 6,798, పశ్చిమబెంగాల్‌ 5,251, తమిళనాడు 4,622 ఉన్నాయి. రాజారామ్మోహన్‌రారు లైబ్రరీ ఫౌండేషన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌ఎల్‌ఎఫ్‌) ద్వారా భారత దేశంలో పబ్లిక్‌ లైబ్రరీలను, వాటి అనుబంధ సేవలను కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రోత్సహిస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ఎల్‌ఎఫ్‌ దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేలు, ఏడువేల లైబ్రరీలకు వార్షిక నిధులను అందిస్తుంది. గత కేంద్ర బడ్జెట్‌లో దేశంలోని గ్రామ పంచాయతీల్లోని గ్రంథాలయాలను నెలకొల్పడానికి ఐదువేల కోట్లను కేటాయించినట్లు ఆర్‌ఆర్‌ఆర్‌ఎల్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ లైబ్రరరీస్‌ అదనపు మిషన్‌ డైరెక్టర్‌ అజరు ప్రతాప్‌సింగ్‌ చెప్పారు. దాదాపు 9 వేల లైబ్రరీలను ఆధునీకరించడానికి, డిజిటల్‌గా లింక్‌ చేసే కార్యక్రమం 2014లోనే మంత్రిత్వశాఖ చేపట్టింది.

kerala library


భారత్‌లో పురాతన గ్రంథాలయం ఎక్కడుందంటే?
భారతదేశంలో అత్యంత పురాతన గ్రంథాలయం తిరువనంతపురంలో ఉంది. ఇది ఎరుపు, తెలుపు రంగులతో ఉంటుంది. విక్టోరియన్‌ స్టైల్‌లో ఉండే ఈ బిల్డింగ్‌ను 1829లో స్వాతి తిరునాల్‌ రామ వర్మ హయాంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ లైబ్రరీని తిరువనంతపురం పీపుల్స్‌ లైబ్రరరీగా పిలుస్తున్నారు. ఈ గ్రంథాలయాన్ని అప్పుడున్న స్థానిక ఉన్నత అధికారులతోపాటు, బ్రిటిష్‌ అధికారులు ప్రారంభించారు. ఈ లైబ్రరీని 1899లో ప్రజలకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ లైబ్రరరీలో కంటి చూపు లేనివారి కోసం ఆడియో లైబ్రరరీని, లైబ్రరీ యాప్‌ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

library



మొదటి ఉచిత పబ్లిక్‌ లైబ్రరరీ
పశ్చిమబెంగాల్‌లోని ఉత్తరపరా సిటీలోని రెండు అంతస్తుల భవనాన్ని ఉచిత పబ్లిక్‌ లైబ్రరీగా 1859లో జమీందార్‌ జయకృష్ణ ముఖర్జీ మొట్టమొదటిసారిగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి నిధుల కొరత వేధిస్తోంది. శిక్షణ పొందిన లైబ్రరీయన్లు అవసరం. అరుదైన పుస్తకాలను భద్రపరచడం, దాని బైబిలోగ్రఫీని జాబితా చేయడం వంటివి ప్రధానంగా ఉన్నాయి.