Sep 02,2023 08:43

రాబోయే కాలంలో మార్కెట్లో ఉసిరి కాయలు లభ్యమవుతాయి. చాలామంది ఈ ఉసిరితో నిల్వ పచ్చళ్లు చేసుకుంటారు. కొందరైతే గింజలను తీసేసి కాయలను ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. బోలెడు ప్రయోజనాలున్న ఉసిరిని ప్రతి ఒక్కరూ తప్పక వాడాలి. ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలను రోజుకి 1 లేదా 2 తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
 

విటమిన్లు-మినరల్స్‌ : తాజా ఉసిరికాయలోనే కాదు.. ఎండిన ఉసిరి ముక్కల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి ఉంటాయి. ఉసిరిలో ఉండే విటమిన్‌ సి ఎండిన తర్వాత యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు రావు.

అజీర్తి దూరం చేస్తుంది : ప్రతిరోజూ ఎండిన ఉసిరి తింటే.. అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.

జుట్టు సమస్య ఉండదు : జుట్టు రాలడం వంటి సమస్యతో బాధపడే వారికి ఎండిన ఉసిరి మంచి పరిష్కారం. ఉసిరి ముక్కల్ని తినడం వల్ల శిరోజాలు రాలడం తగ్గి.. ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతాయి. కుదుళ్లు కూడా దృఢంగా ఉంటాయి.

వాపులకు చెక్‌ : ఎండిన ఉసిరి ముక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంపై వచ్చే వాపులు, ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి.

చర్మానికి మేలు : రోజూ రెండు ఎండిన ఉసిరి ముక్కలను తింటే.. చర్మం కాంతివంతంగా ఉంటుంది. చర్మంపై త్వరగా ముడతలు రావు. మొటిమలు, మచ్చలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. ఆందోళన, వణుకు, మతిమరుపు, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలు సైతం తగ్గుతాయి.