హాయ్ ఫ్రెండ్స్,
నా పేరు అభినవ్. నాకు రైలు ప్రయాణమంటే చాలా ఇష్టం. ఈ వేసవి సెలవులకు నేను మా మామయ్య ఇంటికి రాజమండ్రి వెళ్లాను. రైళ్లో ఎప్పుడూ కిటికీ పక్కనే కూర్చుంటాను. కిటికీలోంచి చెట్లు, కొండలను చూడడం నాకు చాలా ఇష్టం. రాజమండ్రి స్టేషను ఇంకాసేపట్లో వస్తుంది అనగా నేను ఎక్కిన రైలు పెద్ద శబ్దం చేస్తూ బ్రిడ్జిపై వెళ్లింది. అప్పుడు నాకు చాలా భయమేసింది. రైలు పడిపోతుందా ? అని అమ్మని అడిగా.. 'ఏం పడదు.. అరవకుండా కూర్చో' అంది. మామయ్య ఇంటికి వెళ్లాక చాలా సరదాగా గడిచింది. మామయ్య పిల్లలతో బాగా ఆడుకున్నాను. ధవళేశ్వరం బ్రిడ్జి చూపించడానికి మామయ్య నన్ను తీసుకెళ్లాడు. దారి పొడుగునా గోదావరి నదిలో చాలా పడవలు కనిపించాయి. అన్ని పడవలు నేనెప్పుడూ చూడలేదు. అదే విషయం మామయ్యని అడిగా. అవన్నీ ఇసుక రీచ్‌లని ఆ పడవలు ఇసుకను తీసుకెళ్తాయని మామయ్య చెప్పాడు. ఇసుకను ఎందుకు తీసుకెళ్లాలి అని మామయ్యని అడిగాను. ఇటుకలతో కట్టే ప్రతి నిర్మాణానికి అంటే వంతెనలు, బిల్డింగ్‌లు, ఇళ్ల తయారీలో ఇసుకను వాడతారని మామయ్య చెప్పాడు. ఇక రాజమండ్రి నుండి ఇంటికి వచ్చేటప్పుడు మామయ్య స్టేషనుకు వచ్చాడు. అక్కడ కొన్ని రైళ్లు ఆగి వున్నాయి. వాటినే చూస్తున్న నాకు ఓ అనుమానం వచ్చింది. వెంటనే 'అమ్మా ఈ రైలు రివర్స్ ఎలా తిరుగుతాయి' అని అడిగాను. 'ఎలాగోలా తిరుగుతాయిలే సైలెంట్‌గా కూర్చో' అని అమ్మ విసుక్కుంది. అప్పుడు మామయ్య అమ్మని కోప్పడి, 'చూడు అభి.. రైలు రివర్స్ తిరగదు. వెనక్కి వెళ్లాల్సినప్పుడు ఇంజను మారుస్తారు' అని చెప్పాడు. నేనెప్పుడూ ఇలాగే ప్రశ్నలు అడిగి అమ్మని ఇబ్బంది పెడతాను. చాలాసార్లు సమాధానం చెబుతుంది. ఒక్కోసారి విసుక్కుంటుంది. మీరు కూడా మీ పెద్దవాళ్లని ఇలాగే విసిగిస్తారా.. ఆ విషయాలన్నీ వేసవి విడిదికి రాసి పంపించండి.. ఆలస్యం చేయకండి.. సరేనా..
ఎం. అభినవ్,
1వ తరగతి, తాడేపల్లి మండలం, గుంటూరుజిల్లా.










