- చర్యలు తీసుకోవాలని పిఎస్‌యులు, వర్శిటీలకు ఆర్థికశాఖ లేఖ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసుపై వివాదం తలెత్తింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసిన ఆందోళన సందర్భంగా రిటైర్‌మెంట్ వయసుపు 62కు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ఉత్తర్వులు ఉద్యోగులందరికి వర్తించవని ఆర్థికశాఖ పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా అనేకమంది విరమణ వయసు లబ్ధిపొందుతున్నారని తెలిపింది, అర్హత లేని వారందరికి తక్షణం దీనిని ఉపసంహరించి, 60 ఏళ్ల రిటైర్‌మెంట్ విధానాన్నే అమలు చేయాలని , తప్పుడు నిర్ణయాలకు బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్ మెమో ఉద్యోగవర్గాల్లో కలకలం రేపింది. ప్రభుత్వ రంగ సంస్థలు,కార్పొరేషన్లు, ఇన్‌స్టి ట్యూషన్లు, కంపెనీలు, సొసైటీలు, విద్యాసంస్థల సొసైటీలు, యూనివర్శిటీల్లోని నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు ఉద్యోగవిరమణ వయసు పెంపు వర్తించదని ఈ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అయితే, వీటిలో కూడా 62 సంవత్సరాల రిటైర్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలా చేయడం ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్దమని, ప్రభుత్వ నియమావళిని, నిబంధనలను ఉల్లంఘించినట్టేనని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అందువల్ల తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుగా అన్వయించుకుని, గందర గోళానికి, నష్టానికి కారకులైన వారిపై క్రమశిక్షణ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెంపు వీరికే
పబ్లిక్ సరీసు కమిషన్ల ద్వారా ఎంపికయి, ప్రభుత్వ విధులు నిర్వహించే ఉద్యోగులకు, ప్రభుత్వ కన్సాలిడేటడ్ ఫండ్ నుండి జీతాలు తీసుకునే స్థానిక సంస్థల ఉద్యోగులకు అధికారులకు ఉద్యోగ విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ జారీ చేసిన జిఓ నెంబర్ 15 వర్తిస్తుందని సర్కులర్‌లో పేర్కొన్నారు. అదే విధంగా అసెంబ్లీ కార్యాలయ సిబ్బందికి కూడా ఈ జిఓ వర్తిస్తుంది. గ్రామాధికారులు, న్యాయాధికారులు మినహా 309 ఆర్టికల్ పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగి, అధికారికి కూడా ఉద్యోగ విరమణ వయసు పెంపు నిర్ణయం వర్తిస్తుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. వీరు మినహా ఇతరులెవరికి ఆ నిర్ణయం అమలు కాదని, దీనికి భిన్నంగా అమలు చేస్తున్న సంస్థలకు సంబంధిరచిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు తక్షణవ సరైన చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ మెమోలో ఆదేశించారు.










