Nov 08,2023 18:21

ప్రజారక్షణ భేరి బస్సుయాత్రలు 10వ రోజు వివరాలు 
సీతంపేట - విజయవాడ యాత్ర
    10వ రోజు ప్రజారక్షణ భేరీ యాత్ర బుధవారం కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌ నుండి బయలుదేరి గన్నవరం మీదుగా విజయవాడకు చేరింది.
    సందర్శన : ఏలూరు సమీపంలో పోనంగి వద్ద నిర్మాణం మధ్యలో ఆగిన టిడ్కో గృహాలను పరిశీలించారు. నివాళి: కృష్ణా జిల్లా తేలప్రోలు గ్రామంలో, గన్నవరం సిపిఎం పార్టీ ఆఫీసులో కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినతి : నిడమనూరు గిడ్డంగుల హమాలీ కార్మికులు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. 
    తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి జనసేన తాకట్టు
రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ మళ్ళీ ప్రధాని ఎందుకు కావాలో పవన్‌ చెప్పాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
    హనుమాన్‌ జంక్షన్‌లో జరిగిన సభకు సిపిఎం బాపులపాడు మండల కార్యదర్శి బేతా శ్రీనివాసరావు, గన్నవరంలో జరిగిన సభకు పార్టీ మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణా ఎన్నికల ప్రచారంలో భారతదేశానికి మూడోసారి ప్రధానిగా మోడీ రావాలని, ఆంధ్రరాష్ట్రంలో తాను ముఖ్యమంత్రి కావాలని పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయాన్ని తెలియజేయడం శోచనీయమన్నారు. దీన్నిబట్టి పవన్‌ కళ్యాణ్‌కు బిజెపి ఇచ్చిన రోడ్‌ మ్యాప్‌ ఏంటో అర్ధం అవుతోందన్నారు. మోడీ దేశంలో బలమైన నాయకుడని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారని, మోడీతో జతకట్టి రాష్ట్రాన్ని పవన్‌ ధ్వంసం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మోడి ఒక వెన్నుపోటు పొడిస్తే నీవు కూడా మరోపోటు పొడుద్దామని అనుకుంటున్నారా? అని పవన్‌ కళ్యాణ్‌ని ప్రశ్నించారు. మోడీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో పవన్‌ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. లేకపోతే రాజకీయాల్లో పాల్గొనే అర్హత పవన్‌కు ఉండదన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి పల్లకి మోస్తున్న పార్టీలకు రాష్ట్ర ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ఈ సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.వెంకటేశ్వర్లు, కిల్లో సురేంద్ర, కృష్ణా జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఆదోని - విజయవాడ యాత్ర
    10వ రోజు ప్రజారక్షణ భేరీ యాత్ర బుధవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుండి బయలుదేరి బాపట్ల జిల్లా చీరాల మీదుగా బాపట్ల వరకు సాగింది. అనంతరం బాపట్ల జిల్లా వెల్లటూరుకు రాత్రికి చేరింది.
    సందర్శన : బాపట్ల జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ భవనాలను సందర్శించిన యాత్ర బృందం.
అధికారమే పరమావధిగా వైసిపి, తెలుగుదేశం పార్టీలు :  సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ పిలుపు
    రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాస్తున్న వైసీపీ, టిడిపి, జనసేన పార్టీ లను ప్రజలు నీలదీయాలని  సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్‌ పిలుపునిచ్చారు. సిపిఎం చేపట్టిన ప్రజారక్షణభేరిలో భాగంగా బుధవారం బాపట్ల జిల్లా లోని పర్చూరు, చీరాల లో జరిగిన బస్సు యాత్ర బహిరంగ సభల్లో గఫూర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదన్నారు. రాష్టానికి ఇచ్చిన ఏ ఒక్కహామీ అమలు చేయకపోగా అదానీ, అంబానీలకు కేంద్రం కొమ్ము కాస్తుందన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తుంటే సిఎం జగన్‌ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు గానీ ఏమి పట్టడం లేదన్నారు.జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ కూడా  కేంద్రానికి భజన చేస్తున్నారన్నారు. సియం జగన్‌ పరిస్థితి పంజరం లో చిలక లా ఉందన్నారు.బటన్‌ నొక్కడానికి ఎదో ఒక జిల్లా కు వెళ్లడం, బటన్‌ నొక్కడం వచ్చి ఇంట్లో కూర్చోవడం జరుగుతుందన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేనపార్టీ లు గుడ్డిగా కేంద్రానికి మద్దతు ఇవ్వడం వల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు. సియం జగన్‌ రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పరు , నిరుద్యోగులకు ఏం చేశారో తెలియదు, రైతులను ఆదుకోరు, వ్యవసాయ కూలీల సమస్యలు పట్టదు. వర్షాధారాన్నిబట్టి కరువు మండల ప్రకటన చేస్తామంటారని గఫూర్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ప్రజా గర్జన సభలో  సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు డి.రమాదేవి, కె ప్రభాకర రెడ్డి, రాష్ట్ర కమిటి సభ్యులు కె.ఉమామహేశ్వరరావు, యం.భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.
    మందస - విజయవాడ యాత్ర
    7వ రోజు ప్రజారక్షణ భేరీ యాత్ర బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుండి బయలుదేరి మార్టేరు, తణుకు, తాడేపల్లి గూడెం మీదుగా కేశవరం చేరింది. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకి రాత్రికి చేరింది.
    సందర్శన : పాలకొల్లు మండలం సగం చెరువు గ్రామంలో 90 ఏళ్లకు పైగా నివసిస్తున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని న్యాయపోరాటం చేస్తున్న పేదలను కలిసిన యాత్ర బృందం. యాత్రకు సహాయం : సిపిఎం పార్టీ సీనియర్‌ కామ్రేడ్‌, ఎ. నారాయణమ్మ గారు. ప్రజా రక్షణ భేరి బస్సుయాత్ర బృందానికి ఆర్థిక సహాయం చేశారు. సత్కారం : పాలకొల్లుకు చెందిన సీనియర్‌ సిపిఎం నేతలు వలవల శ్రీరామమూర్తి, యర్రా కృష్ణారావు, అరటికట్ల నారాయణమ్మలను యాత్ర బృందం ఘనంగా సత్కరించారు. నివాళి : పుచ్చలపల్లి సుందరయ్య, డాక్టర్‌ బిఆర్‌. అంబేద్కర్‌ విగ్రహాలకు యాత్ర బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినతి : తణుకులో కల్లుగీత కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు.
అదానీ బొగ్గుతో కరెంట్‌ ఛార్జీలకు రెక్కలు : సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం
    జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్‌ అధ్యక్షతన జరిగిన సభల్లో కె.లోకనాథం మాట్లాడుతూ బొగ్గు గనులను అదాని, అంబానీలకు కట్టబెట్టడంతో తిరిగి వారి వద్ద నుంచి బొగ్గు కొనుగోలు చేయడంతో ధర పెరిగి, దేశంలో కరెంట్‌ ఛార్జీలు దారుణంగా పెరిగాయని చెప్పారు. ఇలా సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో విలవిల్లాడుతున్నారని చెప్పారు. పాలకొల్లులో పుచ్చలపల్లి సుందరయ్య, అంబేద్కర్‌ విగ్రహాలకు రాష్ట్ర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, నాగేశ్వరరావు, అండ్ర మాల్యాద్రి, జిల్లా కార్యదర్శి బి.బలరాం, తదితరులు పాల్గొన్నారు.