Aug 27,2023 20:50

చెరువు గర్భంలో నిర్మిస్తున్న ఇళ్లు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి / వేపాడ : రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవలేదన్నట్టు అధికార పార్టీ నాయకులు తలచుకుంటే ఆక్రమణలకు, అధికారులు తలచుకుంటే అక్రమ పద్ధతులకు కొదవలేదని మరోసారి నిరూపితమౌతోంది. పంట పొలాలకు సాగునీరు అందించే ఓ చెరువులో జగనన్న ఇళ్లు పథకం కింద తమ అనుయాయులకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని అధికార పార్టీ నాయకులు సూచించారు. అడిగిందే తడువుగా అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఇదే తడువుగా ఇచ్చిన స్థలాలకు రెట్టింపు స్థాయిలో ఆక్రమించుకుని లబ్ధిదారులు ఇళ్లు నిర్మిస్తున్నారు. దీనిపై ఆందోళన చెందిన రైతులు స్థానిక తహశీల్దార్‌ మొదలుకుని కలెక్టర్‌ వరకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. ఇదే అదునుగా లబ్ధిదారులు నిర్మాణాలు వేగవంతం చేశారు. మరోవైపు బాధితులంతా హైకోర్టును ఆశ్రయించారు. పనులు ఉన్నపలంగా నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఇదే విషయాన్ని కలెక్టర్‌, ఆర్‌డిఒ, తహశీల్దార్‌ సహా తొమ్మిది మందికి తెలియజేసినట్టు సమాచారం. అయినా నిర్మాణాలు ఆగకపోవడం గమనార్హం.
వేపాడ మండలం గుడివాడ రెవెన్యూ పరిధిలోని సుమారు 10.81 ఎకరాల విస్తీర్ణంలోని గుడివాడవాని చెరువు.. సుమారు 70 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఇది నిండగా మిగిలిన నీటితో దిగువనున్న మరో బంద ద్వారా ఇంకో 30 ఎకరాలకుపైగా నీరు అందుతుంది. మారిక కొండలపై నుంచి జాలువారిన వర్షపునీరు దిగువున ఉన్న ఊరు చెరువుకు వస్తుంది. అక్కడి నుంచి వివిధ గొలుసుకట్టు చెరువులకు నీరు చేరుతుంది. ఇందులో భాగంగానే గుడివాడవానిచెరువులో వర్షాలు పడినప్పుడల్లా నీరు చేరుతోంది. దీంతో ఖరీఫ్‌లో జగ్గయ్యపేటకు చెందిన రైతులకు నమ్మకమైన పంట పండుతోంది. ఇటువంటి చెరువు గర్భంలో స్థానిక వైసిపి నాయకులు సూత్రధారణలో అధికారులు ఐదు కుటుంబాల వారికి 1.5 సెంట్ల చొప్పున ఇళ్లపట్టాలు మంజూరు చేశారు. ఇదే తడువుగా లబ్ధిదారులు మరో 1.5 సెంట్ల చొప్పున ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. కాలువలు, రోడ్లు కలుపుకుని మొత్తంగా 10 సెంట్ల వరకు నిర్మాణంలోకి వెళ్లిపోయింది. దీంతో వస్తున్న నీటితో చెరువు ఆటుపోట్లకు గురికావాల్సి వస్తోంది. చెరువుగట్టు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి. వరదలు వస్తే అంతే సంగతులు అన్నంతగా మారింది. మరోవైపు గతంలో ఉన్నంత నీరు నిల్వ ఉండే అవకాశం లేకపోవడంతో ఆయుకట్టు అమాంతంగా తగ్గిపోనుంది. ఇప్పటికే ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లు ముంపునకు గురికాకుండా దొడ్డిదారిలో చెరువు మదుములు తెరుస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన రైతులు అధికారులను నిలదీశారు.
అధికారులకు స్థానిక వైసిపి నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో కనీసం స్పందించలేదు. దీంతో జులై 14న గ్రామ సర్పంచి సహా రైతులు కలెక్టర్‌ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఆమె నుంచీ స్పందన రాకపోవడంతో బాధితులంతా కలిసి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, గుడివాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 207 (గుడివాడ చెరువు)లో నిర్మాణాలను అనుమతించవద్దంటూ కలెక్టర్‌, ఆర్‌డిఒ, తహశీల్దార్‌ సహా మొత్తం తొమ్మిది మందికి హైకోర్టు ఈనెల 22న ఆదేశాలు పంపినట్టు సమాచారం. అయినా, చెరువులో నిర్మాణాలు ఆగడం లేదు. యథేచ్ఛగా కొనసాగుతుండడంతో కలెక్టర్‌ను మరోసారి కలిసి నిలదీసేందుకు రైతులు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో వైసిపికి చెందిన ఓ సంస్థ డైరెక్టర్‌ తమను కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు అండగా ఉండడంతో రెచ్చిపోతున్నారని కూడా జనం చర్చించుకుంటున్నారు.
మా బతుకు పోయినట్టే
చెరువు ఆక్రమణలు తొలగించకపోతే మా బతుకు పోయినట్టే. నాకున్న ఎకరా భూమికి గుడివాడ వానిచెరువు నుంచే నీరు అందుతుంది. ప్రస్తుతం చేపట్టిన నిర్మాణాలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు రాత్రి సమయాల్లో మదుములు ఓపెన్‌ చేస్తున్నారు. దీంతో, ప్రస్తుతం ఉబాలు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
- రొంగలి వెంకటరమణ, రైతు


కోర్టు ఆదేశాలతో నిర్మాణాలు నిలిపివేత
కోర్టు ఆదేశాలతో ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని సంబంధిత లబ్ధిదారులను ఆదేశించాం. ప్రస్తుతం పనులు నిలిచినట్టుగానే భావిస్తున్నాం. ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- ప్రసన్న కుమార్‌ ,
తహశీల్దార్‌, వేపాడ మండలం