Nov 20,2023 09:49
  • విశ్వవిజేత ఆస్ట్రేలియా
  • ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ ఓటమి
  • ఛేదనలో ట్రావిశ్‌ హెడ్‌ మెరుపు సెంచరీ
  • భారత్‌ 240/10, ఆస్ట్రేలియా 241/4

కల చెదిరింది. కన్నీరే ఇక మిగిలింది. 2023 ప్రపంచకప్‌ టీమ్‌ ఇండియా చేజారింది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 2003 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన టీమ్‌ ఇండియా.. సొంతగడ్డపై 2023 ప్రపంచకప్‌ తుది పోరులోనూ నిరాశపరిచింది. ప్రపంచకప్‌లో ఫైనల్లో భారత్‌కు ఇది రెండో ఓటమి. అజేయ ప్రస్థానానికి ఊహించని ముగింపు. ఆతిథ్య జట్టుగా ప్రపంచకప్‌లో వరుసగా పది మ్యాచుల్లో ఎదురులేని విజయాలు సాధించిన టీమ్‌ ఇండియా.. టైటిల్‌ ముంగిట ఫైనల్లో బోల్తా పడింది. 'టాస్‌' పాత్ర గణనీయంగానే ఉన్నప్పటికీ బ్యాట్‌తో ఆతిథ్య జట్టు అంచనాలను అందుకోలేదు. సెమీఫైనల్‌ వరకు ప్రత్యర్థులను అన్ని విభాగాల్లో చిత్తు చేసిన టీమ్‌ ఇండియా.. టైటిల్‌ పోరులో మాత్రం ఆసీస్‌ చేతిలో అన్ని విభాగాల్లో తేలిపోయింది !.
ఆస్ట్రేలియా సిక్సర్‌. ఐసీసీ ప్రపంచకప్‌ టైటిల్‌ మరోసారి కంగారూ గూటికి చేరుకుంది. అలెన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా, రికీ పాంటింగ్‌, మైకల్‌ క్లార్క్‌ సరసన పాట్‌ కమిన్స్‌ నిలిచాడు. ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ టైటిల్‌ అందించిన తొలి, ఓవరాల్‌గా మూడో బౌలర్‌, కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో పేసర్లు కపిల్‌ దేవ్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రమే కెప్టెన్‌గా ప్రపంచకప్‌ ట్రోఫీని గెలుపొందారు. ఏడాది ఆరంభంలో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా.. ఏడాది ఆఖర్లో ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ ఇండియాకు తీరని వేదన మిగిల్చింది.