
ఒక అడవిలో పక్కపక్కన రెండు చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు మీద కాకులు, మరొక చెట్టు మీద చిలుకలు నివసిస్తున్నాయి. అవి రోజూ ఆహారానికి వెళ్లి తిరిగి రాత్రికి తమ గూటికి చేరుకునేవి. ఒకరోజు నాలుగు కుర్ర రామచిలుకలు కాకులు నివసించే చెట్టు దగ్గరకు షికారుకు వచ్చాయి. వాటిని చూసిన కాకులు వాటితో పిచ్చాపాటి మాట్లాడుతూ 'మీరెప్పుడూ ఈ చెట్ల మధ్యనే తిరుగుతూ, దొరికిన పండ్లను తింటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. మేమైతే పట్నాల్లోకి వెళతాం. అక్కడ బజారులో రకరకాల పండ్లు, తినుబండారాలు అమ్ముతారు. అవన్నీ మేం తింటాం. ఎంత రుచిగా ఉంటాయో.. మీరు కూడా మాతో రావచ్చు కదా!' అన్నాయి.
'అమ్మో మేము రాము. మా చిలుక జాతికి తెలిస్తే కోప్పడతాయి' అన్నది ఒక చిలుక. 'ఏం ఫర్వాలేదులే మనం వెళ్దాం' అన్నాయి మిగతా చిలుకలు. ఆ రోజు నుంచి ఈ నాలుగు చిలుకలు కాకులతో వెళ్లడం ప్రారంభించాయి.
ఈ విషయం మిగతా చిలుకలకు తెలిసి మందలించాయి. అయినా వాటి మాట పట్టించుకోకుండా చిలుకలు నగరానికి వెళ్తున్నాయి. కాకులతో పాటు తిరుగుతున్నాయి.
ఒక రోజు ఒక రైతు తను పండించిన పండ్లు అమ్మేందుకు పట్నం బయల్దేరాడు. అతని పండ్ల గంప జారిపడిపోయింది. అది చూసి కాకులు గుంపులు గుంపులుగా వాలి పండ్లను తినడం ఆరంభించాయి. చిలుకలు కూడా వాటితో పాటే పండ్ల దగ్గరకు వెళ్లాయి. అయితే తమతో పోటీగా వచ్చిన ఈ చిలుకలను చూసిన ఇతర కాకులు వాటిని బాగా పొడిచాయి. చిలుకలకు గాయాలయ్యాయి. అదేమీ పట్టించుకోకుండా కాకులన్నీ వెళ్లిపోయాయి.
అప్పుడే అడవిలో ఉండే ఒక చిలుక అటుగా వెళుతూ వీటిని చూసి తన బంధువులందరికీ చెప్పి తీసుకువచ్చింది. ఆ చిలుకలను ఇంటికి తీసుకువచ్చి, సపర్యలు చేసి గాయాలు మానిపించాయి. అప్పటినుంచి ఇతరుల మాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని చిలుకలు నిశ్చయించుకున్నాయి.
- ద్వారపురెడ్డి జయరాం నాయుడు,
94415 19570