Apr 11,2023 11:37

ప్రజాశక్తి-అమరావతి : జ్యోతిరావు పూలే 196 వ జయంతి వేడుకలను కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సూరిబాబు మాట్లాడుతూ ... స్వాతంత్ర సమరయోధులు, సంఘసంస్కర్త, సామాజిక అసమానత లేని సమాజం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహనీయు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆనాడు విద్య అణగారిన వర్గాలకు అందుబాటులో లేకపోవడంతో తానే స్వయంగా తన భార్య సావిత్రి పూలే ద్వారా పాఠశాల ఏర్పాటు చేసి శూద్ర కులాలకు విద్య అందించిన విద్యా విధాత జ్యోతిరావు పూలే అని అన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా మనుషులంతా సమానంగా జీవించాలని పూలే ఉద్యమించారని, వితంతు వివాహాల్ని ప్రోత్సహించారని, బాలవివాహాల్ని వ్యతిరేకించారని సిపిఎం నాయకులు సూరిబాబు వివరించారు. బ్రిటిష్‌ అధికారులకు రైతులు కార్మికుల సమస్యలపైన నిరంతరం అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం కార్మిక కర్షక పోరాటాలు నిర్వహించారని అన్నారు. రచయితగా అనేక పుస్తకాలు రచించారని తెలిపారు. వారి త్యాగాలు వృధా కావని నేటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని సామాజిక మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూరిబాబు కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, మోదిన్‌ వల్లి మురారి, సుబ్బారావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.