Sep 03,2023 09:22

'ఆకాశ వీధిలో అందాల జాబిలి... ఒయ్యారి తారలు చేరి ఉయ్యాలలూగెనే.. సయ్యాటలాడెనే...! పలుమారు దాగి దాగి.. పంతాలు పోయి.. పందాలు వేసి.. అందాల చందమామ దొంగాటలాడెనే.. దోబూచులాడెనే..' అని కవి అన్నట్లు.. చందమామను చేరడానికి ఇస్రో చేసి చంద్రయాన్‌ 1, 2 ప్రయత్నాలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోయినా.. 'కలకాలం నీవే నేనని పలు బాసలాడి.. అందాల చందమామ.. అనురాగం చాటెనే.. నయగారం చేసెనే..' అన్నట్లు ఆకాశ వీధిలో చంద్రయాన్‌ 3కి జాబిలి అందింది. ఇప్పటి వరకు ఏ దేశం కాలుమోపని దక్షిణ ధృవంపై మనదేశం కాలుమోపింది. ఇది ప్రపంచంలో సైన్స్‌ సాధించిన గొప్ప విజయం. చంద్రయాన్‌ 3 ప్రయోగం సఫలమై విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రమండలంపై కాలుమోపి, రోవర్‌ ప్రజ్ఞాన్‌ విడుదల చేసింది. ప్రజ్ఞాన్‌ తొలి అడుగులు.. అసలు చందమామ కథాకమామిషు, ఈ విజ్ఞానానికి మూలం ఎవరు.. ఇంతటి విజ్ఞానానికి మతతత్వ రంగు పులుతున్న తీరు.. తదితర విషయాలపై ప్రత్యేక కథనం.

చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుమోపిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి రోవర్‌ బయటకు వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై ఇది తొలి అడుగులు వేసింది. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల బృందం ఘనతగా చెప్పుకోవాలి. ఈ బృందంలో మహిళా శాస్త్రవేత్తల భూమికా చెప్పుకోదగ్గది. విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా చంద్రుడిపై దిగడంతో అక్కడ సురక్షితంగా కాలు మోపిన అమెరికా, రష్యా, చైనా సరసన ఇప్పుడు భారత్‌ కూడా చేరింది.
          విక్రమ్‌ ల్యాండర్‌ లోపల 26 కేజీల ప్రజ్ఞాన్‌ రోవర్‌ను పెట్టి పంపారు. ల్యాండింగ్‌ సమయంలో ఎగసిన దుమ్మూధూళి సర్దుకున్న తర్వాత విక్రమ్‌ ప్యానెల్స్‌ తెరుచుకున్నాయి. ఇవి ప్రజ్ఞాన్‌ బయటకు వచ్చేందుకు ర్యాంప్‌ను ఏర్పాటుచేశాయి. వీటి గుండా రోవర్‌ కిందకు దిగింది. అక్కడుండే రాళ్లు, బిలాల పరిసరాల్లో రోవర్‌ తిరుగుతోంది. కీలకమైన డేటాను సేకరించి భూమిపైకి ల్యాండర్‌, ఆర్బిటర్‌ల ద్వారా ఇది పంపిస్తుంది.
 

                                                                            ప్రజ్ఞాన్‌ పనితనం..

ప్రజ్ఞాన్‌లో రెండు పరికరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి చంద్రుడిపై ఖనిజాలను అన్వేషిస్తుంది. ఆ క్రమంలో సల్ఫర్‌, అల్యూమినియం, క్యాల్షియం, ఫెర్రం (ఇనుము), క్రోమియం, టైటానియం, సిలికాన్‌, మాంగనీస్‌, ఆక్సిజన్‌ మూలకాలను సైతం ప్రజ్ఞాన్‌ గుర్తించడం విశేషం. హైడ్రోజన్‌ కోసం శోధన కొనసాగుతోంది. మరొకటి మట్టిలోని రసాయనిక స్వరూపంపైనా దృష్టి సారిస్తుంది. ప్రజ్ఞాన్‌ కేవలం ల్యాండర్‌తో మాత్రమే కమ్యూనికేట్‌ అవుతుంది. ఆ ల్యాండర్‌ సమాచారాన్ని చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌కు పంపిస్తుంది. 2019లో పంపిన ఆ ఆర్బిటర్‌ ఇప్పటికీ కక్ష్యలోనే తిరుగుతోంది. సెకనుకు సెం.మీ. వేగంతో రోవర్‌ తిరుగుతోందని ఇస్రో వెల్లడించింది. రోవర్‌ వేస్తున్న ప్రతి అడుగుకూ చక్రాలపైనున్న ఇస్రో లోగో, చిహ్నాల ముద్రలు అక్కడి నేలపై పడేలా ఏర్పాటు చేశారు. ప్రజ్ఞాన్‌కి తన మార్గంలో ఒక పెద్ద గొయ్యి అడ్డు రావడంతో డైరెక్షన్‌ ఇవ్వగానే అందుకుంది. తన మార్గం మార్చుకుని సురక్షితంగా ముందుకు కొనసాగింది. చంద్రుడిపై ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేసింది. పగలు అత్యంత వేడిగానూ, రాత్రి అత్యంత చలిగానూ ఉన్నట్టు తేల్చింది. అంటే ఆ వాతావరణం అన్నివిధాలా అత్యధికంగానే ఉందన్న మాట.
           చంద్రుడిపై రోజు మొదలు కావడంతోనే అక్కడ ల్యాండింగ్‌ జరిగింది. చంద్రుడిపై ఒకరోజు అంటే భూమిపై 28 రోజులతో సమానం. అంటే ఇక్కడ 14 రోజులపాటు తన బ్యాటరీలను ఛార్జ్‌ పెట్టుకునేందుకు ల్యాండర్‌కు అవకాశం ఉంటుంది. ఒకసారి రాత్రి అయితే, సూర్యరశ్మి లేకపోవడంతో అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. అయితే, మళ్లీ ఇక్కడ రోజు మొదలయ్యేటప్పుడు అవి పనిచేస్తాయో లేదో ప్రస్తుతానికి స్పష్టత లేదు.
          లాండర్‌లోనూ పరిశోధనల కోసం కొన్ని పరికరాలను ఏర్పాటు చేశారు. చంద్రుడి ఉపరితలంతోపాటు పైపొరల కింద ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. చంద్రుడిపై ముఖ్యమైన ఖనిజాలు చాలా ఉన్నాయని భావించినప్పటికీ ప్రస్తుత ప్రయోగంలో అక్కడి ధ్రువంలోని భారీ బిలాలపై నీటి జాడలను గుర్తించడంపైనే దృష్టి పెడుతున్నారు. అక్కడ మంచు రూపంలో నీరు ఉండొచ్చని, ఇది భవిష్యత్‌ మానవ ఆవాసాలకు ఉపయోగపడొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఇలాంటి మరెన్నో ప్రయోగాలు జరిగిన తర్వాతగానే నిర్ధారణకు రాలేమన్నది శాస్త్రవేత్తల మాట. అలాగే అక్కడ స్థలాలు కొన్నామనీ, కొంటున్నారనీ వస్తున్న వార్తలన్నీ సత్యదూరాలే. అవి అలా కొనుగోలు చేయడం చట్టబద్ధం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ విశ్వం మొత్తం ప్రపంచానికి చెందినది. మరోవైపు అంగారకుడు, ఇతర సుదూర గ్రహాలపై యాత్రలకూ అవసరమైన ఇంధనం కూడా ఇక్కడ లభించే అవకాశముంది.
         రష్యాకు చెందిన లూనా-25 వ్యోమనౌక కుప్పకూలిన కొన్ని రోజుల్లోనే చంద్రయాన్‌-3 విజయం సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఎగుడుదిగుడ్లు, బండరాళ్లు, భారీ బిలాలతో కూడిన పరిసరాలే లూనా విఫలం కావడానికి కారణంగా భావిస్తున్నారు. భారత్‌ కూడా 2019లోనూ ఇలానే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించింది. కానీ, ఆ ప్రయోగం సఫలం కాలేదు. ల్యాండర్‌, రోవర్‌ కూడా అప్పట్లో కుప్పకూలాయి. అయితే, నాటి ఆర్బిటర్‌ ఇప్పటికీ చంద్రుడు చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండర్‌ తీసిన చిత్రాలు భూమి పైకి పంపేందుకు ఇది సాయం చేస్తోంది. చంద్రుడిపై ప్రస్తుతం దృష్టి సారించిన దేశం భారత్‌ ఒక్కటే కాదు. చాలా దేశాలు చంద్రుడిపై ప్రయోగాలకు సిద్ధం అవుతున్నాయి.

22


                                                                     సాధించిన మూడు లక్ష్యాలు..

అంతరిక్షం, రోబోటిక్స్‌, ఏఐ వంటి రంగాల్లో ఆకాశ్‌ సిన్హా అనుభవజ్ఞులు. ఆయన చెప్తున్న మేరకు 'మిషన్‌ పూర్తయింది. మనం చంద్రుడిపై దిగాం. ఇక్కడి నుంచే రోవర్‌ పని ప్రారంభమవుతుంది. చంద్రుడిపైన ఉన్న మట్టి నమూనాలను సేకరించేందుకు వీలుగా రోవర్‌ను చాలా స్మార్ట్‌గా రూపొం దించారు. చంద్రుడిపై ఇది నావిగేట్‌ అవుతూ, అది సేకరించిన డేటాను మనకు పంపిస్తుంది. రోవర్‌ అనేది ఒక డ్రైవర్‌లెస్‌ కారు లాంటిది. ఇది చంద్రుడిపై దానికదే తిరుగుతూ ఉంటుంది. దాని ఎదురుగా ఏదైనా గుంతలున్నాయా? రాళ్లున్నాయా? అని చూసుకుంటూ, వాటిని దాటుకుని వెళ్లగలదో లేదో దానికదే నిర్ణయించుకోవాలి. దీని కోసం రోవర్‌లో రెండు స్మార్ట్‌ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరా సాయంతో రోవర్‌ దాని 3డీ మోడల్‌ను తయారు చేసుకుంటుంది. దాని సాయంతోనే నేవిగేట్‌ అవుతుంది. ఈ మిషన్‌లో అతిపెద్ద లక్ష్యం చంద్రుడిపై ఉన్న నీటిని పరిశీలించడం. దీంతో పాటు, చంద్రుడిపై అరుదైన వాటిని కూడా ఈ రోవర్‌ సేకరించే అవకాశం ఉంది. యురేనియం, బంగారం లేదా మరే ఇతర అరుదైన ఖనిజమైనా ఇక్కడ దొరకవచ్చు. హీలియం-3 ఇక్కడ ఉండే అవకాశం ఉంది. దీంతో అణు ఇంధనాన్ని తయారు చేయొచ్చు. రోవర్‌లో ఉన్న ప్రత్యేక సెన్సార్లన్నీ ఈ పనులు చేయనున్నాయి. కనెక్టివిటీ కోసం ఇస్రో ఈ సారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌లో పదికి పైగా యాంటెన్నాలను అమర్చింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ఐడీఎస్‌ఎన్‌ (ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌)తో కమ్యూనికేట్‌ అవుతుంది. ల్యాండర్‌ మాడ్యూల్‌ ఐడీఎస్‌ఎన్‌తో, రోవర్‌తో కమ్యూనికేట్‌ అవుతుంది. చంద్రయాన్‌-2 ఆర్బిటార్‌తోనూ ఇది అనుసంధాన మవుతుంది. రోవర్‌ కేవలం ల్యాండర్‌తో కమ్యూనికేట్‌ చేస్తుంది.
           2008లోనే చంద్రుడి దక్షిణ ధ్రువానికి భారత్‌ తన త్రివర్ణ పతాకం లోగోతో వెళ్లింది. ఇస్రో చంద్రుడి ఉపరితలం మీదకు పంపిన మూన్‌ ఇంపాక్ట్‌ ప్రోబ్‌ దాదాపు దక్షిణ ధ్రువం వరకు వెళ్లింది. దానిలో అమర్చిన మూన్‌ మైనరాలజీ మ్యాపర్‌ ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి, చంద్రుడి మీద నీటి జాడలను గుర్తించినట్లుగా ఇస్రో ప్రకటించింది. అయితే, ఈసారి రోవర్‌లో త్రివర్ణ పతకాన్ని ఉంచలేదు. కానీ, మూడు రంగుల జెండా గుర్తును దాని మీద ముద్రించారు. ఈసారి ఇస్రో ఇంకా ప్రత్యేక ఏర్పాట్లతో, రోవర్‌ను చంద్రుడిపైకి పంపింది. రోవర్‌ చక్రాలకు స్టాంప్స్‌ను ఉంచింది. ఒకవైపు జాతీయ చిహ్నం, మరోవైపు ఇస్రో లోగో ఉన్నాయి. రోవర్‌ వేసే ప్రతి అడుగుకూ చక్రాలపైనున్న ఇస్రో లోగో, చిహ్నాల ముద్రలు అక్కడి నేలపై పడుతూ ఉంటాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ముద్రలు ఎప్పటికీ అలానే ఉంటాయి. ఎందుకంటే చంద్రుడిపై గాలి ఉండదు కనుక. ఇలా చరిత్ర సృష్టించిన భారత్‌ ముద్రలు ఎప్పటికీ చంద్రుడిపై చిరస్థాయిగా నిలవనున్నాయి' అని ఆయన వివరించారు.
 

                                                                           ఆకారాలు.. వాస్తవాలు..

చంద్రుడిని తీక్షణంగా గమనించినప్పుడు అక్కడ మనిషి, జంతువుల మాదిరిగా కొన్ని ఆకారాలు కనిపిస్తాయి. అసలు ఏమై ఉంటాయన్నది చాలామంది సందేహం. బసాల్ట్‌ శిలల రూపంలో చంద్రుడిపై పురాతనమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు కాంతిని తక్కువ స్థాయిలో ప్రతిబింబిస్తాయి. అందువల్ల అలాంటి ప్రదేశాలున్న ప్రాంతం నీడలాగా, వివిధ ఆకారాలుగా కనిపిస్తుందని నాసా చెబుతోంది.
 

                                    (ఈ వ్యాసం రాసే సమయానికి అందిన సమాచారం మేరకు) ఆసక్తికరమైన విషయాలు...

చందమామ గురించి అనేక పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వందల ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు, మేధావులు చంద్రుడి గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అనేక దేశాలు చంద్రుడి మీదకు మానవ రహిత, మానవ సహిత వ్యోమనౌకలను పంపి పరిశోధనలు సాగిస్తున్నాయి. చంద్రుడి మీద ఇన్ని పరిశోధనలు జరిగినా, చంద్రుడి గురించి తెలియని కొన్ని కీలక విషయాలు ఉన్నాయి.
 

033

                                                                                గుండ్రంగా లేడు

గుండ్రని ముఖాన్ని వర్ణించడానికి చంద్రుడితో పోల్చేవాళ్లు. అయితే మనకు కనిపించే ఫొటోలలోనూ చంద్రుడు గుండ్రంగా ఉన్నట్లే కనిపిస్తాడు. నిండు పౌర్ణమి రోజున చంద్రుడిని చూసినప్పుడు కొలతలు వేసి గీసినట్లు గుండ్రంగా ఉంటాడు. కానీ, నిజానికి ఒక ఉపగ్రహమైన చంద్రుడు బంతిలాగా గుండ్రంగా లేడు. చంద్రుడు ఓవల్‌ షేప్‌ అంటే కోడిగుడ్డు / బాదం ఆకారం. ఈ ఆకారం కావడం వల్లే భూమి మీద నుంచి చంద్రుడిని పూర్తిగా చూడలేము.
 

                                                                                పూర్తిగా చూడలేం

మనం ఎప్పుడు చూసినా చంద్రుడిలో గరిష్టంగా 59% ప్రాంతాన్నే చూడగలం. మిగతా 41% చంద్రుడు మనకు కనిపించడు. మనం చంద్రుడి మీదకు వెళ్లి ఆ 41% ప్రాంతంలో ఉండి చూస్తే, మనకు భూమి కనిపించదు.
 

                                                                 'బ్లూ మూన్‌'కు అగ్నిపర్వతాల పేలుళ్లకు లింక్‌

చంద్రుడు అప్పుడప్పుడు నీలి రంగులో కనిపిస్తాడు. దాన్ని 'బ్లూ మూన్‌' అంటారు. వాస్తవానికి చంద్రుడి రంగులో మార్పేమీ ఉండదు. కొన్ని వాతావరణ పరిస్థితుల ప్రభావంతోనే చంద్రుడు మనకు నీలి రంగులో కనిపిస్తాడు. అయితే, ఈ పేరు ఎలా వాడకంలోకి వచ్చింది అంటే.. 1883లో ఇండోనేషియాలోని క్రాకటోవా ద్వీపంలో అగ్నిపర్వతం పేలినప్పుడు భారీ ఎత్తున ధూళి మేఘాలు ఏర్పడ్డాయి. ఈ మేఘాల కారణంగా ఆకాశం మొత్తం రంగు మారినట్లు కనిపించింది. అంతేకాకుండా చంద్రుడు నీలిరంగులో కనిపించాడు. అప్పటి నుంచి 'బ్లూ మూన్‌' అనే పేరు స్థిరపడింది. క్రాకటోవా ద్వీపంలో అతి పెద్ద అగ్నిపర్వతం పేలింది. దాని ప్రభావమే అలా కనిపించిందని అంటారు.
 

                                                                                   సీక్రెట్‌ ప్రాజెక్ట్‌

చంద్రుడి మీదకు మానవ సహిత వ్యోమనౌకలను పంపించడం 1960 తర్వాతనే సాధ్యమైంది. అయితే అంతకుముందే, చంద్రుడి మీద అణుబాంబును పేల్చాలని అమెరికా ఒక సీక్రెట్‌ ప్రాజెక్టును నడిపింది. అప్పటికే అమెరికా, రష్యాలు స్పేస్‌ రేస్‌లో ఉండగా, తన అధిపత్యాన్ని చాటుకోవడానికి అమెరికా చంద్రుడి మీద అణుబాంబు పేల్చి, దానిని భూమి మీద మనషులకు కనిపించేలా చేయాలని ప్లాన్‌ చేసింది. ఈ సీక్రెట్‌ ప్రాజెక్ట్‌ పేరు 'ఎ స్టడీ ఆఫ్‌ లూనార్‌ రీసెర్చ్‌ ఫ్లైట్స్‌' లేదా ప్రాజెక్ట్‌ 'ఎ119'. ఈ ప్రయోగం ద్వారా ఖగోళ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడం అమెరికా ప్రధాన ఉద్దేశంగా చెబుతారు.
 

                                                                    గుంటలు ఎలా ఏర్పడ్డాయి ?

చందమామ ఉపరితలంలపై అక్కడక్కడా గుంటలు ఉన్నట్లు జూమ్‌లో తీసిన ఫొటోలలో కనిపిస్తాయి. వీటిని క్రేటర్స్‌ అంటారు. ఇవి సుమారు నాలుగు వందల కోట్ల సంవత్సరాల కిందట, కొన్ని ఖగోళ వస్తువులు చంద్రుడిని ఢకొీట్టడం వల్ల ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 

                                                                              భూభ్రమణ వేగం తగ్గుదల

చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, దానిని ''పెరిజీ'' అంటారు. ఈ సమయంలో సముద్రాలలో అలల స్థాయి బాగా పెరుగుతుంది. భూమి భ్రమణశక్తిలో మార్పు వస్తుంది. భూమి తిరిగే వేగం తగ్గుతుంది. ప్రతి వందేళ్లకు 1.5 మిల్లీ సెకన్లు చంద్రుడి వేగం మందగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 

                                                                                 చంద్ర కాంతి

భూమి మీదకు వచ్చే సూర్యకాంతి పూర్ణ చంద్రుడి కాంతి కన్నా 14 రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. మనం సూర్యకాంతికి సమానమైన కాంతిని చంద్రుడి నుంచి పొందాలంటే ఇప్పుడున్న చంద్రుడిలాంటి 3,98,110 చంద్ర గ్రహాలు అవసరం. చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. అప్పుడు చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రత 260 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేరకు తగ్గిపోతుంది. చంద్రగ్రహణం సాధారణంగా 90 నిమిషాల లోపు ఉంటుంది.
 

                                                                      లియోనార్డో దావించీ కనుగొన్నది..

కొన్నిసార్లు చంద్రుడు ఉంగరంలా కనిపిస్తాడు. మనం దానిని అర్ధచంద్రాకారం / నెలవంక అని అంటాం. చూడటానికి సూర్యుడు చంద్రుని మీద ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తాడు. ఈ సమయంలో చంద్రుడిలో కొంతభాగం మాత్రమే ప్రకాశవంతంగా ఉంటుంది. దీనిని బట్టి చంద్రుడు కుచించుకుపోతాడని కొందరు నమ్ముతుండగా అది నిజం కాదని లియోనార్డో దావించీ చెప్పారు. భూమి మీద పడిన సూర్య కిరణాలు రిఫ్లెక్ట్‌ అయ్యి, చంద్రుడిలో కొంతభాగం మీద పడటం వల్ల ఆ భాగం వరకూ ప్రకాశవంతంగా కనిపిస్తుందని ఆయన మొదటిసారి వెల్లడించారు.
 

                                                                  బిలాలకు పేర్లు ఎవరు పెడతారు ?

ఇంటర్నేషనల్‌ ఆస్ట్రనామికల్‌ యూనియన్‌ చంద్రుని మీద క్రేటర్స్‌ (బిలాలు) కు మాత్రమే కాకుండా, ఇతర ఖగోళ వస్తువులకు కూడా పేర్లు పెడుతుంది. చంద్రుని మీద ఉన్న క్రేటర్స్‌కు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, కళాకారులు, అన్వేషకుల పేర్లు పెట్టారు. అపోలో క్రేటర్‌, మేయర్‌ మోస్కోవిన్స్‌ (మాస్కో సముద్రం) సమీపంలోని క్రేటర్లకు అమెరికన్‌, రష్యన్‌ వ్యోమగాముల పేరు పెట్టారు. మేయర్‌ మోస్కోవిన్స్‌ అనేది చంద్రుడి మీద కనిపించే సముద్ర ప్రాంతం.
 

                                                                    దక్షిణ ధ్రువంలో రహస్యాలు

చంద్రయాన్‌-3 అడుగుపెట్టిన చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం చాలామందికి తెలియని, ఒక రహస్య ప్రాంతంగా పరిగణిస్తారు. నాసా చెప్పిన దాని ప్రకారం ఈ ప్రాంతంలో చాలా లోతైన గుంటలు, పర్వతాలు ఉన్నాయి. వంద కోట్ల సంవత్సరాలుగా ఇక్కడ సూర్యకాంతి పడలేదు.
 

                                                                చంద్రుడు లేకపోతే భూమి ఏమవుతుంది ?

చంద్రుని ఆకర్షణ శక్తి భూమి దాని అక్షం మీద ఉండేందుకు కారణమవుతోంది. ఒకవేళ చంద్రుడు లేకపోయినట్లయితే, భూమి అక్షం మీద నిలిచే విధానంలో తేడా వచ్చి, భూమి కదిలికలలో తేడా ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో ఋతువులలో అనేక మార్పులకు అవకాశం ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లలో కూడా వైవిధ్యం ఉంటుంది. రోజు నిడివి కూడా మారవచ్చు. చంద్రుడు లేకపోతే భూవాతావరణం, గ్లోబల్‌ వార్మింగ్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
 

                                                                           వీటి మధ్య దూరం

ప్రస్తుత లెక్కల ప్రకారం చంద్రుడు భూమికి 3,84,400 కి.మీ దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి 2,70,000 కి.మీ దూరంలో ఉన్నట్లు ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. అంటే చంద్రుడు ఇప్పుడున్న దూరం కంటే 70% మేర చేరువగా ఉండేవాడని ఈ అధ్యయనం చెబుతోంది. అప్పట్లో భూమి వేగంగా తిరుగుతున్నందున రోజు నిడివి కూడా తక్కువగా ఉండేది. లోపల ఏముంది?
చంద్రుడి లోపలి భాగం రాళ్లు, ఖనిజాలతో నిండి ఉంటుందని చెన్నైలోని బిర్లా ప్లానిటోరియం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈ.కె. లెనిన్‌ తమిళ్‌కోవన్‌ చెప్పారు. 'చంద్రుడి లోపలి భాగం ప్రధానంగా సిలికేట్‌లతో కూడి ఉంటుంది. ఉపరితలంపై వాతావరణం లేదు. పై భాగంలో పెద్ద గుంతలు (క్రేటర్స్‌), పర్వతాలు, లోయలు, మారియా అని పిలిచే పెద్ద, చదునైన సముద్రాలు ఉన్నాయి. అయితే వాటిలో నీరు ఉండదు' అని ఆయన పేర్కొన్నారు.
 

                                                                               ఎలా ఏర్పడ్డాడు ?

ఇది చాలామందిలో ఉండే సందేహం. అయితే, దీనికి స్పష్టమైన సమాధానం లేదు. చంద్రుడు ఎలా ఆవిర్భవించాడన్న అంశంపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అనేకమంది శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ ఎక్కువమంది ఆమోదించిన సిద్ధాంతం ఒకటుంది. సౌర కుటుంబం ఏర్పడిన సమయంలో అంటే సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట కుజుడి పరిమాణంలో ఉండే వస్తువు ఒకటి భూమిని బలంగా ఢకొీట్టింది. దానివల్ల భూమి చుట్టూ ఒక ధూళి మేఘం ఏర్పడి, అందులోని శిలలు, ఆవిరి, ఇతర పదార్థాలన్నీ ఏకమై చంద్రుడిగా ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు చెబుతారు.
 

                                                              ప్రకాశవంతంగా ఎలా కనిపిస్తాడు ?

పౌర్ణమి రోజులలో చంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. అయితే అది చంద్రుడి కాంతి కాదు. సూర్యకాంతి. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. వెలుతురును సృష్టించలేడు. సూర్యుడి నుంచి వచ్చిన కాంతి చంద్రుడి మీద పడి అది ప్రతిబింబిస్తుంది. చంద్రుడు భూమి నుండి చూస్తే కాంతివంతంగా కనిపిస్తాడు. అలా చూసినప్పుడు చంద్రుడు తెల్లగా ఉన్నాడని అనిపిస్తుంది. వాస్తవానికి చంద్రుడు తెలుపు రంగులో ఉండడు. చంద్రుడిని దగ్గరగా చూసినప్పుడు, అది ముదురు బూడిద రంగులో ఉంటుంది. ఇప్పటివరకు కనుగొన్నవి..
          చంద్రుడి కోసం పని చేసే అనేక మిషన్లు చంద్రుడి భౌగోళిక స్వరూపం, ఉపరితల నిర్మాణం, దానికి పుట్టుక, చరిత్ర గురించి అ ముఖ్యమైన సమాచారాన్ని అందించాయి. 'చంద్రయాన్‌-1 ప్రోబ్‌ చంద్రుడి మీద నీరు ఉన్నట్లు నిర్ధారించింది. నాసా పంపిన అపోలో మిషన్లు భూమికి తీసుకువచ్చిన శాంపిల్స్‌పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి' అని తమిళ్‌కోవన్‌ అన్నారు. గతేడాది శాస్త్రవేత్తలు చంద్రుడి నుంచి తీసిన మట్టిలో మొక్కలను పెంచే ప్రయత్నం చేశారు.

                                                                    అక్కడ బరువు ఎందుకు తగ్గుతాం ?

'భూమి మీదకన్నా చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువ' అని తమిళ్‌కోవన్‌ అన్నారు. 'ఒక వ్యక్తి బరువు భూమి మీద 80 కిలోలు అయితే, అదే చంద్రునిపై బరువు 13.3 కిలోలు మాత్రమే ఉంటుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికన్నా భూమి శక్తి ఆరు రెట్లు ఎక్కువ. అందుకే చంద్రుడిపై బరువు తగ్గుతాం' అని ఆయన వివరించారు.

032

                                                                      ఎన్నిసార్లు కాలు మోపారు ?

1969, 1972 మధ్య అమెరికా పంపిన అపోలో మిషన్ల ద్వారా మొత్తం ఆరుసార్లు చంద్రునిపై మనుషులు దిగారు. అపోలో 17 మిషన్‌ ద్వారా మనుషులు చివరిసారిగా 1972 డిసెంబర్‌లో చంద్రునిపైకి వెళ్లారు. ఆర్థిక పరిమితులు, చంద్రుడి మీదకు మనుషులను పంపడం వల్ల ఏం ప్రయోజనం అనే రాజకీయ విమర్శల కారణంగా చంద్రుడి మీదికి ప్రయాణాలను నిలిపేశారు.

modi

                                                                    విజ్ఞానానికి మతతత్వ మసి

ఆరు దశాబ్దాలుగా రోదసీ రంగంలో శాస్త్రవేత్తలు సాగించిన అద్భుతమైన కృషి, విజయాలపై మోడీ మార్క్‌ మతతత్వ మసి అంటుకుంది. ఇటీవల ఇస్రో కేంద్రానికి వెళ్లిన మోడీ చంద్రయాన్‌ -3ని విజయవంతం గావించిన శాస్త్రవేత్తల్ని అభినందించారు. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతానికి ''శివశక్తి'' అని, చంద్రయాన్‌-2 కూలి పోయిన ప్రదేశానికి ''తిరంగా'' అని నామకరణం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది విశ్వ మానవాళికి చెందినది. ఏదో ఒక దేశానికి.. ఒక మతానికి చెందిన పేర్లు పెట్టడం ఏమాత్రం అంగీకరించే విషయం కాదు. ఈ పేర్లు ఆమోదించబడవు. అంతరిక్ష రంగంలో విశేష కృషి చేసిన మహనీయుల పేర్లను సాధారణంగా ఇలాంటి వాటికి పెట్టడం ఆనవాయితీ. దీనికి భిన్నంగా మత ప్రమేయంతో కూడిన పేర్లను ప్రధాని ఎంచుకోవడం గమనార్హం. ఇప్పటికైన ఒకసారి దీన్ని పునరాలోచన చేసి, ఆనవాయితీని కొనసాగించాలి.

sarabhai

                                                                 అసలైన చంద్రుడు విక్రమ్‌ సారాభాయ్

ఈ విజయాన్ని అందుకోగల శక్తిని అందించిన మహనీయుడు సైంటిస్ట్‌ విక్రమ్‌ సారాభాయ్. ఆ విక్రమ్‌ సారాభాయ్ కుమార్తె మల్లికాసారాభారుతో ఈ సందర్భంగా 'స్వేచ్ఛ' చేసిన చర్చ.. మనందరికీ, దేశానికి ఒక కర్తవ్యాన్ని బోధించింది.
'నేను తెలివిగలవాడిని అని నిరూపించుకోవడానికో.. మరొకరిని ఓడించటానికో నేను కృషి చేయలేదు.. కేవలం గెలవడానికే నేను కృషి చేశాను. ఆ గెలుపు సైన్సు, టెక్నాలజీకే కాదు.. దేశానికి, దేశ ప్రజలకు, సమస్త మానవాళికి ఉపయోగపడినప్పుడే.. మనం అసలైన విజయం సాధించినట్లు!' అని విక్రమ్‌ సారాభాయ్ చెప్పారు.
          ఆ మాటలను ఆయన కుమార్తె మల్లికా సారాభాయ్ మరింత స్పష్టంగా చెప్పారు. 'టెక్నాలజీ మానవాళి అభివృద్ధికి ఉపయోగపడినప్పుడే నిజమైన సక్సెస్‌. కనీసం ఇస్రో సాధించిన ఈ విజయంతో నైనా దేశ యువతంతా సైన్సు, టెక్నాలజీ వైపు చూస్తుందని భావిస్తున్నాను. మన దేశం, ప్రజలు మనకు ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి!' అని ఆవిడ కోరారు.
         ఇస్రో సాధించిన ఈ ఘన విజయం సందర్భంగా మల్లికా సారాభాయ్ చెప్పిన మాటలు యువతకు మార్గదర్శకం. మానవాళి సమస్యలను తీర్చగల టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో అందరూ కర్తవ్యోన్ముఖులు కావాలి. ఆగస్ట్‌ 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం
            'ఆగస్ట్‌ 23న భారత్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడింది గనుక ఇక ఇప్పటి నుంచి, ఈ రోజుని భారత్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుందాం' అని ప్రధాని మోడీ ప్రకటించారు.

                                                               చంద్రునిపై మనుషులు నివసించొచ్చా?

దీనిపై తమిళ గోవన్‌ మాట్లాడుతూ 'చంద్రునిపై మనుషులు నివసించడానికి వీలవుతుందా? లేదా? అన్న అంశంపై ఇంకా అన్వేషణ, పరిశోధన కొనసాగుతూనే ఉంది. శ్వాసించడానికి వీలుగా భూమి మీద ఉన్న వాతావరణం అక్కడ లేదు. అక్కడి పగలు, రాత్రుల ఉష్ణోగ్రతల్లో తేడాలు (పగలు అధిక వేడి, రాత్రి అధిక చలి) వంటి వాటివల్ల అక్కడ మానవ నివాసానికి పరిస్థితులు అనువుగా లేవు. మనకు అక్కడ తక్షణమే నీరు లభించే అవకాశం లేకపోవడం పెద్ద సమస్య. అందువల్ల, స్వల్పకాలంలో అక్కడ నివాసంతోపాటు, శాస్త్రీయ పరిశోధనల కోసం స్థావరాలను ఏర్పాటు చేసే అవకాశాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు' అని అన్నారు.

శాంతిశ్రీ
8333818985