Jul 23,2023 12:41

'ప్రభాత సూర్యుడికి ప్రణామం / సమస్త ప్రకృతికి ప్రణామం / విశ్వంతో మమేకం ప్రయాణం / మన చిరునవ్వులే పూలు / నిట్టూర్పులే తడి మేఘాలు / హృదయమే గగనం / రుధిరమే సంద్రం / ఆశే పచ్చదనం / మారే ఋతువుల్లా వర్ణం / మన మనసుల భావోద్వేగం / సరిగా చూస్తే ప్రకృతి మొత్తం / మనలో ప్రతిబింబం / సమస్త ప్రకృతికి ప్రణామం / ఎవడికి సొంతం ఇదంతా / ఇది యెవ్వడు నాటిన పంట / ఎవడికి వాడు నాదే హక్కని / చెయ్యేస్తే ఎట్ట / తరములనాటి కదంతా / మన తదుపరి మిగలాలంటా / కదపక చెరపక / పదికాలలిది కాపాడాలంటా / ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం / ఇష్టంగా గుండెకు హత్తుకుందాం / కన్నెర్రే కన్నీరై ఓ కొంచెం / తల్లడిల్లిందో ఈ తల్లి / ఏ ఒక్కరం మిగలం / సమస్త ప్రకృతికి ప్రణామం' అన్న కవి మాటలు అక్షరసత్యాలు. నేడు జరగాల్సింది అదే. మొక్కే కదా అని పీకేస్తే.. మనకు ప్రాణవాయువే లేకుండా అయిపోతుంది. ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు ఉత్తరాది వరద బీభత్సం మన కళ్ల ముందు ఉంచుతోంది. పూర్వీకులు మనకు అందించిన ప్రకృతిని భావితరాలకు మనం అందివ్వగలగాలి. ఈ నెల 28న 'అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినం (వరల్డ్‌ నేచర్‌ కన్జర్వేషన్‌ డే)' ఉనికిలోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

775

          'రేలా..రేలా..రేలా...రే' అంటూ అడవిబిడ్డలు కాలు కదిపినా.. 'హైలెస్సా... హైలెస్సా...' అంటూ మత్స్యకారులు గొంతు విప్పినా వాటి సారాంశం ఒకటే. అదే ప్రకృతి పరిరక్షణ. అడవితో పాటు అందులోని జంతుజాలం చల్లగా ఉండాలని గిరిజనులు తమ పాటల్లో ఆకాంక్షిస్తారు. తమతో పాటు, అనంత జలరాశిలోని సమస్త జీవజాలాన్ని కాపాడాలని మత్య్సకారులు గంగమ్మను వేడుకుంటూ హైలా ఆలాపనతో తెడ్డు వేస్తారు. పొట్ట కూటికి తప్ప లాభాపేక్ష తెలియని వీరు సహజంగానే తమ పరిసరాలను ప్రేమిస్తారు. వారి మనుగడ దీనితోనే కొనసాగుతోంది. ఏ దేశమైనా మానవాళి ప్రయాణం ఇలాగే కొనసాగేది. కాలం మారింది.. విషపు కోరలు జాచిన కార్పొరేటీకరణ అన్నింటితో పాటు ప్రకృతినీ కబళిస్తోంది. అసలుకే మోసం వస్తుందన్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా వనరుల్ని దోచేస్తోంది. ఈ నేపథ్యంలోనే పర్యావరణాన్ని, జీవావరణాన్ని కాపాడుకోవాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, మేధావులు గళం విప్పుతున్నారు. నిరంతరాయంగా సాగుతున్న వీరి కృషి ఫలితంగా 'అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినం' ఏర్పడింది.
 

443

                                                                                ఐరాస గుర్తింపు..

వాతావరణ మార్పులతో తలెత్తుతున్న పర్యావరణ ఉత్పాతాలు ఒకవైపు. అడవుల నరికివేత, పెరుగుతున్న కాలుష్యం, భూమి మీద నుండి అదృశ్యమవుతున్న జీవజాలం మరోవైపు. వీటిని విడివిడిగా కాకుండా ఒక్కటిగా చూడాలన్న తపనే ప్రకృతి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించడం. ఈ సమస్యలపై విడివిడిగా కార్యక్రమాలు చేస్తున్న వారంతా ఈ ఒక్కరోజైనా కలిసికట్టుగా చేయాలనేదే దీని ఆకాంక్ష. మానవాళి మనుగడకు మూలమైన సమస్త ప్రకృతిని కాపాడుకోవడానికి నడుం బిగించాలన్నది దీని లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 2018లో జరిగిన సర్వసభ్య సమావేశం జులై 28ని 'అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినం'గా పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. నిజానికి అంతకుముందు కొన్నేళ్లుగా అనేక దేశాల్లోని వివిధ సంస్థలు ఈ దిశలో కార్యక్రమాలు నిర్వహించాయి. ఐక్యరాజ్యసమితి నిర్ణయం తర్వాత ఈ రోజుకు అధికారిక గుర్తింపు లభించింది. యావత్‌ ప్రపంచం.. వ్యక్తులు, సంస్థలు, అనేక దేశదేశాల ప్రభుత్వాలు ప్రకృతి పరిరక్షణపై దృష్టి సారించాయి. భూగోళ పరిరక్షణకు, మానవాళి భద్రత, భవిష్యత్తుకు నడుం బిగించాయి. అప్పటివరకు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకున్నాయి. కొంగొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి 2018 నుండి జులై 28ని ఒక వేదికగా చేసుకున్నాయి. మన దేశమూ ఈ అపూర్వ కృషిలో భాగస్వామిగా మారి, తన వంతు బాధ్యతను నిర్వహిస్తోంది. అయితే, ప్రకృతి పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా పడుతున్న ఈ అడుగులు సజావుగా పడుతున్నాయా? ఎటువంటి ఉత్పాతాలు, ప్రకోపాలు లేని అందమైన భూగోళాన్ని భావితరాలకు అందించగలమా? ఇవే ప్రపంచం ముందున్న ప్రధాన ప్రశ్నలు. ఆవైపు అడుగులు వేస్తూ భావితరాలకు అందమైన భూగోళాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిదీ.

33


                                                                                   మన దేశంలో..

ప్రకృతితో మమేకమయ్యామంటూ ఎన్ని మాటలు చెప్పుకున్నా.. మన దేశంలోనూ విధ్వంసం భారీ స్థాయిలో జరుగుతోంది. ప్రకృతి వనరులను ధ్వంసం చేయడంలో కొన్ని సందర్భాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 30 ఏళ్లుగా దేశంలో అడవుల నరికివేత విచ్చలవిడిగా కొనసాగుతోంది. గత దశాబ్ధంలో ఇది మరింత పెరిగింది. బ్రిటన్‌కు చెందిన 'యుటిలిటి బిడ్డర్‌' అనే పర్యావరణ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2015-20 మధ్య దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అడవులు క్షీణించిపోయాయి. ఈ కాలంలో 6,68,400 హెక్టార్ల అటవీ భూమి దేశ వ్యాప్తంగా తగ్గిపోయింది. దీంతో అటవీభూమి క్షీణతలో మనదేశం ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. మొదటిస్థానంలో బ్రెజిల్‌ ఉంది. అయితే, మన దేశంలో అటవీ భూమి తగ్గడానికి రకరకాల కారణాలతో అడవుల నరికివేతే ప్రధానకారణం. బ్రెజిల్‌లో వాతావరణ మార్పుల కారణంగా అటవీ విస్తీర్ణం తగ్గినట్టు ఆ సంస్థ పేర్కొంది. బ్రెజిల్‌లో అడవుల పెంపు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మన దేశంలో ఆ తరహా కార్యక్రమాలు ప్రచారానికే పరిమితం. ప్రభుత్వ రికార్డులతో పాటు అందుబాటులో ఉన్న అన్ని రకాల సమాచారాన్ని వినియోగించుకుని 'యుటిలిటి బిడ్డర్‌' ప్రకటించే నివేదికలకు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికమైనవిగా పరిగణిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 1990 నుండి 2000 సంవత్సరం వరకు 3,84,000 హెక్టార్ల అడవులను దేశంలో నరికివేయగా, 2015-2020 నాటికి 6,68,400 హెక్టార్లకు అడవుల నరికివేత కొనసాగింది. ఈ కాలమంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ పేరిట పెద్దఎత్తున ప్రచారం చేస్తుండగానే ఈ విధ్వంసకాండ జరగడం గమనార్హం. అడవుల నరికివేత ప్రభావం జీవజాలంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. దేశంలో నాలుగు ప్రధాన జీవవైవిధ్య కేంద్రాలుండగా, అవి 90 శాతం అటవీ భూమిని కోల్పోయినట్లు ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత పర్యావరణ సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సిఎస్‌ఇ) తేల్చింది. ఆ సంస్థ ప్రచురించిన 'స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇన్‌ ఫిగర్స్‌-2021' లో ఈ మేరకు గణాంకాలతో సహా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ఇండో - బర్మా జీవవైవిధ్య కేంద్రంలో భారీ ఎత్తున అటవీ విధ్వంసం కొనసాగింది. ఒక దశాబ్దం క్రితం ఇక్కడ 23.73 లక్షల చదరపు కిలోమీటర్ల అటవీ భూమి ఉండగా, 2020 సంవత్సరం చివరకు 1.18 లక్షల చదరపు కిలోమీటర్ల అటవీ భూమి మాత్రమే మిగిలింది. ఇంకా ఆందోళన కలిగించే సంగతి ఏమిటంటే ఈ జీవవైవిధ్య కేంద్రంలోని 25 జీవజాతులు పూర్తిగా అంతరించిపోయాయి. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయుసిఎన్‌) ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవ జాతులను రెడ్‌ లిస్ట్‌ పేరుతో ప్రకటించింది. వాటి మనుగడను ఇది పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ తాజాగా ప్రచురించిన రెడ్‌లిస్ట్‌లో మన దేశంలోనే 1212 జంతుజాతులను చేర్చింది. వీటిలో 12 శాతం (148 జంతుజాతులు) అంతరించిపోతున్నాయని హెచ్చరించింది. ఈ జాబితాలో 69 క్షీరదాలు, 23 సరీసృపాలు, 56 ఉభయచరాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ వీటి మనుగడను పరిరక్షించడానికి దేశంలో తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రమే !.

స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో సాగుతున్న ఈ విధ్వంసాన్ని ఏమాత్రం పట్టించుకోని అధికారులు రోజువారీ అవసరాలకి పుల్లలు ఏరుకునే పేదప్రజలపై మాత్రం ఆంక్షలు పెడుతున్నారు. బయోడైవర్సిటీ (జీవ వైవిధ్య) బోర్డు గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో 65 రకాల జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. వీటిలో 22 మొక్క జాతులు, 19 పక్షి, 10 క్షీరదాలు, 12 రకాల చేపలు, రెండు రకాల సరీసృపాల జాతులు ఉన్నాయి. ఈ అధికారిక లెక్కలు కన్నా, క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి.

88


                                                                      జీవవైవిధ్య కేంద్రంగా నల్లమల

తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవులు జీవవైవిధ్యానికి కేంద్రం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించి ఉన్న ఈ అడవుల్లో అనేక రకాల వృక్ష, జంతు జీవ రాశులున్నాయి. ప్రతిష్టాత్మకమైన పులుల సంరక్షణ కేంద్రం ఈ ప్రాంతంలోనే ఉంది. నల్లమల అడవుల్లో 2001 నుండి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాల నుండి ప్రోత్సాహం లేదన్న విమర్శ ఉంది. ఈ పరిశోధనల ఫలితంగా నల్లమలలో 50 రకాల క్షీరదాలు, 200 రకాల పక్షి జాతులు, 89 రకాల సీతాకోక చిలుకలు, 54 రకాల ఉభయచరాలు, చిమ్మట జాతికి చెందినవి 57 రకాలు, 50కిపైగా కీటకజాతులను కనుగొన్నారు. శేషాచల కొండలతో పాటు, తూర్పు కనుమలంతా ఈ తరహా పరిశోధనలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ జీవరాశిని పరిరక్షించడంలో స్థానిక తెగల ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేయాల్సి ఉంది. పశ్చిమ కనుమల పరిరక్షణకు జరుగుతున్న కృషిలో కొంతైనా తూర్పుకనుమల విషయంలో జరగాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడక్కడా జరుగుతున్న కృషి వ్యక్తిగత స్థాయిలోనో, ఒకటి, రెండు సమూహాల స్థాయిలోనో మాత్రమే కొనసాగుతోంది. ఈ పరిస్థితి మారాలి. తూర్పుకనుమలు, తూర్పు తీరప్రాంతాల పరిరక్షణకు సామాజిక బాధ్యత కావాలి. స్థానిక తెగలను, ప్రజలను పెద్దఎత్తున భాగస్వాముల్ని చేయాలి. అప్పుడే ప్రకృతి పరిరక్షణ ఆచరణలో సాధ్యమవుతుంది. కొందరు మేధావులు, నిపుణులు ఇప్పటికే ఈ దిశలో చేస్తున్న కృషికి ప్రభుత్వాలు సహకరించాలి.

997

                                                                        విధ్వంసం ఏ స్థాయిలో..?

ప్రస్తుతం జరుగుతున్న వనరుల వెలికితీత యథావిధిగా కొనసాగిస్తూ, పర్యావరణ పతనాన్ని అడ్డుకోవాలంటే ఇప్పుడున్న భూగోళానికి అదనంగా మరో 1.75 రెట్ల భూమి కావాలనేది ఒక అంచనా. అంటే మానవాళికి మరో భూగోళంతో పాటు అదనంగా మరికొంత భూమి అందుబాటులో ఉండాలన్న మాట. అప్పుడూ ప్రస్తుత స్థాయిలో మాత్రమే వనరుల్ని వినియోగించుకోగలం. అంతకన్నా వినియోగం పెరిగితే ఇంకా ఎక్కువ భూమి కావాలి. ఇది ఆచరణ సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసినా ప్రకృతి వనరుల విధ్వంసం మాత్రం ఆగడం లేదు. కార్పొరేట్‌ సంస్థల మితిమీరిన లాభార్జనే దీనికి ప్రధానకారణం. ఇది ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ఒక అంచనా ప్రకారం 1700 సంవత్సరం నుండి ఇప్పటివరకు భూగోళం మీది 90 శాతం చిత్తడి నేలలు మాయమైపోయాయి. ఇప్పటివరకు 1970 నుండి వివిధ రకాల జంతుజాలం సంఖ్య 68 శాతం తగ్గిపోయింది. కొన్ని రకాల జంతుజాతులు పూర్తిగా అంతరించిపోయాయి. 21 వేల జంతుజాతుల మీద 1970 నుండి పరిశీలిస్తున్న 'లివింగ్‌ ప్లానెట్‌' విడుదల చేసిన తాజా నివేదికలో క్షీరదాలు, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు, చేపలు 68 శాతం తగ్గిపోయాయని నమోదైంది. ఈ తగ్గుదల ఏటికేడాది పెరుగుతోందని నివేదికలో పేర్కొనడం ఆందోళన కలిగించే అంశం. అమెరికాలోని ఉష్టమండల ఉప ప్రాంతాల్లో జీవరాశుల క్షీణత అత్యధికంగా ఉంది. భూగోళం మీద పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి అత్యంత కీలకంగా భావించే అమెజాన్‌ అడవుల వైశాల్యం గత శతాబ్ద కాలంలో 20 శాతం తగ్గింది. ఖనిజాలు, శిలాజ ఇంధనాల వెలికితీత కోసం ఈ అడవులను విచ్చలవిడిగా విధ్వంసం చేశారు. యంత్రాలతో తవ్వడం, బాంబులతో పేల్చడం వంటి విచ్చలవిడి చర్యలు చేపట్టారు. ఫలితంగా ఇక్కడి జీవజాలం నామరూపాలు లేకుండా పోయింది. కార్పొరేట్‌ సంస్థలు చేసిన ఈ వినాశనాన్ని స్థానిక ప్రజలపై మోపడానికి పెద్దఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. పశువుల మేత కోసం ఎంతో జీవవైవిధ్యమున్న అడవులు తగలబెట్టారని ప్రచారం చేస్తున్నాయి. భూ గోళానికి ఊపిరితిత్తులుగా ప్రసిద్ధి కెక్కిన అమెజాన్‌ అడవుల్లో 30 లక్షల రకాల జంతు జాతులు, 2,500 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. భూమి మీద ఉన్న కీలకమైన వృక్ష జాతుల్లో మూడో వంతు ఈ అడవుల్లోనే ఉన్నాయి. విచ్చలవిడిగా సాగుతున్న విధ్వంసం ఫలితంగా ఇక్కడి జీవ, వృక్ష జాతుల మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారింది. 'ఇంటర్‌ గవర్నమెంటల్‌ సైన్స్‌ - పాలసీ ప్లాట్‌ఫామ్‌ ఆన్‌ బయో డైవర్సిటీ అండ్‌ ఎకో సిస్టమ్‌ సర్వీసెస్‌ -ఐపిబిఇఎస్‌' నివేదిక ప్రకారం పది లక్షల జంతుజాతుల ఉనికి ప్రమాదంలో పడింది. వీటిలో కొన్ని ఇప్పటికే అంతరించిపోయాయి. ఏడాదికి సగటున 3,800 చదరపు మైళ్ల అమెజాన్‌ అడవి విధ్వంసానికి గురవుతోంది. అమెజాన్‌ పరిరక్షణకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ఈ విధ్వంసకాండ మాత్రం ఆగడం లేదు. ఫలితంగా స్థానిక తెగల ప్రజల ఉనికి సైతం ప్రశ్నార్థకంగా మారింది. మన రాష్ట్రంలో.. మన రాష్ట్రంలోనూ ఘనమైన జీవవైవిధ్యమే ఉంది. తూర్పు కనుమలు అపూర్వమైన జీవరాశికి నిలయం. విశాలమైన సముద్ర తీరం, మత్స్య సంపద మన ప్రత్యేకత. రాష్ట్రంలో 1,60,205 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పర్యావరణ వ్యవస్థ విస్తరించి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రత్యేకతలను గుర్తిస్తూ అటవీశాఖ జీవవైవిధ్య మ్యాప్‌ను రూపొందించింది. వివిధ రకాల అటవీ భూములతో పాటు, వేలాది హెక్టార్లలో విస్తరించి ఉన్న మడ అడవులనూ అటవీశాఖ గుర్తించింది. గుర్తించినా పరిరక్షణ ఎలా అన్నది కీలకమైన అంశం. తీర ప్రాంత పరిరక్షణకు అత్యంత కీలకమైన మడ అడవులు వేగంగా క్షీణిస్తున్నాయన్నది వాస్తవం. పారిశ్రామిక కాలుష్యం మడ అడవులను కాటేస్తుంది. కాలుష్య నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. అయితే ఆ దిశలో కార్యాచరణ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. వివిధ ఇతర అవసరాల పేరుతోనూ పర్యావరణ పరంగా అత్యంత కీలకమైన ఈ అడవుల విధ్వంసం కొనసాగుతోంది.

776

                                                            కార్పొరేట్‌ శక్తులు, భయం వలలో మత్స్యకారులు..

శ్రీకాకుళం నుండి తడ వరకు దాదాపు 974 కిలోమీటర్లు తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఒకప్పుడు మత్స్యకారులకు ఇది భద్రమైన జీవితాన్నిచ్చింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తీరప్రాంతం కార్పొరేట్‌ శక్తుల గుప్పెట్లో ఉంది. ఒకప్పుడు సముద్రంలోని చేపల మాదిరి తీరమంతా స్వేఛ్చగా తిరుగాడే మత్స్యకారులకు ఇప్పుడు ఊపిరాడని పరిస్థితి. వారి కదలికలపై తీవ్రమైన ఆంక్షలు. చివరకు మత్య్సకారులకు తీరప్రాంతం ఏమేరకు మిగులుతుందనేది ప్రశ్నార్ధకం. మరోవైపు కాలుష్యం సముద్ర జలాలను తీవ్రంగా కలుషితం చేస్తోంది. దీంతో సముద్ర జీవజాల ఉనికి కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. రెండొందల రకాల సముద్ర జీవజాలం కొన్నేళ్లుగా కనిపించడంలేదని రాష్ట్రంలోని మత్స్యకారులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువభాగం చేప జాతికి చెందినవి. కాలుష్యంతో పాటు, మెకానైజ్డ్‌ బోట్ల వినియోగం పెరగడమూ ఈ పరిస్థితికి కారణం. మరోవైపు గోదావరి జిల్లాలకే ప్రత్యేకమైన పులస చేప కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గోదావరిలో అమ్మోనియం నైట్రేట్‌ పెద్ద ఎత్తున కలుస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో నీటిలో జిడ్డు పెరుగుతోందని అంటున్నారు. ఈ పరిస్థితిలో సముద్రంలో చేపలు ఎదురీదలేక గుడ్లు తేలేస్తున్నాయి. ఇదే మాదిరి కాలుష్యం కొనసాగితే భవిష్యత్తులో పులస అంతరించిపోవచ్చు.

పొగడ దొరువు
7382168168