Jul 23,2023 12:02

రూపంలో ఘనం.. రుచిలో మహా ఘనం.. పోషక గని.. ఔషధ ఓషధి.. ఏంటీ పొగడ్తలని అనుకుంటున్నారా.. పసందైన పనస గురించి ఇవన్నీ ఒప్పుకుని తీరాల్సిందే కదా..! అంతటితో ఊరుకుంటుందా.. వీణ, మద్దెల, మదంగం, కంజీర వంటి సంగీత పరికరాలలో పదనిసలు పలికిస్తుంది. వివిధ రకాల గృహోపకరణాలలోనూ చోటు చేసుకుంది ఈ ఘనాపాటి. ఆహారంలో, ఔషధంలోనూ మేటి నేనంటుంది. అంతేనా.. జాతీయ పండుగగా వెలుగొందుతోంది.. ప్రాంతాల వారీగా వేరువేరు పేర్లతో మనగలుగుతోంది ఈ పనస. దీనిలో ఔషధీయ గుణాలూ ఉన్నాయి మరి.

pasand-panasa

 

        సరిగమలు పలికించే ఈ పనస సతతహరితం. అంటే ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. కాండంపై పుష్పవిన్యాసపు కంకికి తెలుపురంగు పుష్పాలుంటాయి. ఇది మల్బరీ కుటుంబానికి చెందినది. శాస్త్రీయ నామం ఆర్టోకార్పస్‌ హెటిరోఫిల్లస్‌. పుట్టింది మాత్రం తూర్పు ఆసియాలో. ప్రపంచంలోనే అతి పెద్ద పండు అనే ఘనత తెచ్చుకుంది. ఒక్కో పండు 90 సెం.మీ. పొడవు, 50 సెం.మీ. వ్యాసం కలిగి, 36 కేజీల వరకూ బరువుంటుంది. దీనిని సంస్కృతంలో స్కందఫలం, హిందీలో కటహక్‌-కటహర్‌-చక్కీ, బెంగాలీలో కాంటల్‌, మరాఠీÄలో పణస, ఆంగ్లంలో జాక్‌ఫ్రూట్‌ అని పిలుస్తారు. ఆయా సీజన్లలో ప్రకృతిసిద్ధంగా పండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయనేది ప్రకృతి వైద్యం చెబుతుంది. ఆ నమ్మకాన్ని మరింత పెంచుతుంది పనస. పండు మాత్రమే కాదు చెట్టులోని భాగాలన్నీ మనకు ఉపయోగపడేవే. దీనిలో మనకు దొరికేవే కాక మరికొన్ని రకాలున్నాయి.

                                                                                   రకాలు..

మనదేశంలో రెండు రకాల పనస పండుతుంది. ఒకటి కూజాచక్క. దీనిలో చిన్నచిన్న తొనలుంటాయి. అవి తియ్యని రుచితో, పీచును కలిగి ఉంటాయి. కాయ మృదువుగా ఉంటుంది. చాకు లేకుండానే తొనలు తేలిగ్గా తీయవచ్చు.
        రెండవది కూజా పాజమ్‌. దీనిలో తొనలు పెళుసుగా ఉంటాయి. వీటిని ఒలవడానికి చాకు తప్పనిసరి. పైపెచ్చును తీసేటప్పుడు జిగురు పదార్థం చేతులకు అంటకుండా నూనె రాసుకోవాలి. ఈ రకమే మనకు మార్కెట్‌లో దొరికేది. వీటి తొనలు ఫ్రిజ్‌లో అయితే నెలరోజుల పైగా నిల్వ ఉంటాయి. పచ్చివాటిని ముక్కలుగా కోసి బాగా ఎండబెట్టి, భద్రపరచుకొని సంవత్సరమంతా ఉపయోగించుకోవచ్చు. 
         కానీ రొట్టె పండు పూర్తిగా వేరే రకానికి చెందినది. దీన్ని ఇంగ్లీష్‌లో బ్రెడ్‌ఫ్రూట్‌ అంటారు. దీనిని ఎక్కువగా కూరలు చేసుకోవడానికే ఉపయోగిస్తారు. మల్బరీ రకానికి, మోరేసి కుటుంబానికి చెందినదే. ఇది పండిన తర్వాత ప్రధానమైన ఆహారంగా దక్షిణ పసిఫిక్‌ లాంటి ఉష్ణమండల ప్రాంతాలలో వాడతారు. ప్రత్యుత్పత్తి కారకాలైన మగ, ఆడ పువ్వులు రెండూ ఒకే చెట్టులో ఉంటాయి. మగ పువ్వులు కంటికి కనిపిస్తాయి.

pasand-panasa

                                                                              జాతీయ పండుగా..

అవును. బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలకు జాతీయ పండుగా వెలుగొందుతోంది జాక్‌ఫ్రూట్‌. అయితే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన పనసను, ఆయా దేశాల పేర్లను జోడించి సొంతం చేసుకున్నాయి. చైనాలో.. చీనా జాక్‌ఫ్రూట్‌, కొచ్చిన్‌లో.. కొచ్చిన్‌ జాక్‌ఫ్రూట్‌, థారులాండ్‌లో.. డాంగ్‌ రాసిమి జాక్‌ఫ్రూట్‌, గోల్డెన్‌ పిల్లో జాక్‌ఫ్రూట్‌, అంటుకట్టడం ద్వారా వచ్చిన రకం గోల్డెన్‌ నగెట్‌ జాక్‌ఫ్రూట్‌, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలో బ్లాక్‌ గోల్డ్‌ జాక్‌ఫ్రూట్‌ ఇలా రకరకాలుగా ఇతర దేశాలలోనూ ప్రీతిపాత్రమైంది పనస. అంతేకాదు.. ఆయా ప్రాంతాల వాతావరణాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో పక్వానికి వస్తుంది. కొన్నిచోట్ల మార్చి నుండి జూన్‌ మధ్యలో, మరికొన్నిచోట్ల ఏప్రిల్‌ నుండి సెప్టెంబరు మధ్యలో, ఇంకొన్ని చోట్ల జూన్‌ నుండి ఆగస్టు మధ్యలో కాపు కాస్తాయి. వెస్ట్‌ ఇండీస్‌లో జూన్‌లోనూ, ఫ్లోరిడాలో వేసవి చివరిలోనూ వస్తాయి.

                                                                           చెట్టునే పండితే..

సహజంగా చెట్టున పండిన కాయలేవైనా చాలా రుచిగా ఉంటాయి. కానీ పనస విషయంలో అలా కాదు. చెట్టున పండిన కాయను కోసిన వెంటనే తింటే, రుచిగా ఉండదు. తయారైన కాయను చెట్టునుండి కోసి, నిలువ ఉంచి, ఆ తర్వాత కోసుకుంటే తొనలు చాలా తియ్యగా ఉంటాయి.

pasand-panasa


                                                                             పోషకాల గని..

పనసలో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్‌-ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి, ఇ..తో పాటు క్యాల్షియం, ఐరన్‌, సోడియం, పొటాషియం, పాస్ఫరస్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
 

                                                                             ఔషధ ఓషధిగా..

జీర్ణశక్తిని మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారించే గుణం దీనిలో మెండు. పొటాషియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలోని ఫైటో న్యూట్రియంట్స్‌, ఐసోఫ్లేవిన్‌, కాన్సర్‌ నివారణకు సహాయపడతాయి. అజీర్తి, అల్సర్లను నయం చేస్తుంది. పనస ఆకులు, మొక్కజొన్న, కొబ్బరిచిప్పలను కాల్చి చేసిన పొడితో పుండ్లు నయమవుతాయి. పనస ఆకులను వేడిచేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మవ్యాధులు, ఆస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. పనస పాలను, ద్రాక్ష సారాతో నూరి పట్టు వేస్తే.. దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు.
 

                                                                             తినకూడదా..

అధిక బరువు, టెన్షన్‌, అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునొప్పి, అగ్నిమాంద్యం, క్షయ, శుక్రనష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఎక్కువగా తింటే అతిసారం కలుగుతుంది. ఆహారంలోనూ..
         పనస ఆవ పెట్టుకుంటారు. పైతొక్క తీసి, లోపలి పొర భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కూర చేస్తారు. దీన్ని పనసపొట్టు కూర అంటారు. నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం దేశాలవారు పనసను వంటల్లో విరివిగా వాడతారు. కొందరు దీన్ని ప్రధానమైన వంటగా భావించి, తప్పనిసరిగా చేసుకుంటారు. సరిగమలు పలికించే.. పనస చెట్టు మనసును మీటే వీణ, మద్దెల, మృదంగం, కంజీర వంటి సంగీత పరికరాల తయారీలోనూ పెద్దపీట వేసింది. అంతేకాదు.. పడవల తయారీలో, తలుపులు, కిటికీలు వంటి గృహోపకరణాల తయారీలోనూ చోటుచేసుకుంది. ఫిలిప్పైన్స్‌లో పనస కలపతో తయారైన కుతియాపి అనే పడవ భాగాలు మాత్రమే శ్రేష్టమైనవిగా భావిస్తారు. తీర ప్రాంత వాసులు పనస కర్రతో చిన్న చిన్న పడవలను తయారుచేస్తారు.

pasand-panasa


         మనదేశంలో పనసాకులను వంటల్లోనూ, విస్తరాకులు కుట్టడానికి ఉపయోగిస్తాం. పనస జిగురుతో పింగాణి వస్తువులకు, బకెట్‌లకు పడిన రంధ్రాలను అతుకుపెట్టి పూడ్చవచ్చు. వార్నిష్‌లలో కూడా ఉపయోగించేంత గమ్మీగా ఉంటుంది. చెట్టు వేర్లను చెక్కి, ఫొటో ఫ్రేములు తయారుచేస్తారు. అంతేకాదు.. కొన్ని ఉత్సవాల్లో ఎండిన పనస కొమ్మలను రాపిడి చేసి, నిప్పును పుట్టించడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. బౌద్ధ సన్యాసులు ధరించే దుస్తులకు వేసే డై ఈ పనస బెరడుతోనే వేస్తారు.

- టి. టాన్య
70958 58888