Aug 13,2023 08:37

'ఈ దుర్యోధన, దుశ్శాసన దుర్వినీతి లోకంలో.. రక్తాశ్రువులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. మరో మహాభారతం.. ఆరవ వేదం.. శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే.. మానవరూపంలోనే దానవులై పెరిగితే.. సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే.. కన్నులుండి చూడలేని దృతరాష్ట్రుల పాలనలో.. భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో.. నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే.. ఏమైపోతుందీ సభ్యసమాజం.. ఏమైపోతుందీ మానవధర్మం.. ఏమైపోతుందీ ఈ భారతదేశం?' అన్న కవి అక్షర ఆవేదన నేటి దేశ పరిస్థితికి అద్దంపడుతోంది. నాడు గుజరాత్‌ మంటలు ఆరకముందే మణిపూర్‌, హర్యానాలోని నుహ్ మెవాట్‌లో చిచ్చు రగిలించారు. 'పదవీ వ్యామోహాలూ కుల మత భేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ'.. అంటూ మహాకవి శ్రీశ్రీ ఉదహరించిన పరిస్థితి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు నిండిన సమయాన ప్రాప్తించడం చారిత్రక విషాదం. పంద్రాగస్టు అనగానే ఠక్కున మనసులో మెదిలేది ఢిల్లీ ఎర్రకోటపై ఠీవిగా రెపరెపలాడే మువ్వన్నెల జెండా.. గాంధీ, నెహ్రూ, పటేల్‌, బోసు, భగత్‌సింగ్‌.. సంపూర్ణ స్వరాజ్యం నినాదంతో స్వాతంత్య్రోద్యమంలోకి ఉరికిన కమ్యూనిస్టుల అసమాన త్యాగ నిరతి. జాతి, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎగసిన వీరుల త్యాగఫలం మన స్వాతంత్య్రం. ప్రస్తుతం ఈ చరిత్ర మసకబారుతోంది. కొత్తగా విద్వేష చరిత్ర పుట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.

రిత్ర అనేది వాస్తవాల పునాదులపై అక్షరబద్ధమవుతుంది.. అయితే విద్వేష 'హిస్టీరియా' కు అవాస్తవాలు, అబద్ధాలే ఆధారం. అసత్య చరిత్రను వండి వారుస్తున్నది స్వాతంత్య్రోద్యమంతో ఇసుమంతైనా సంబంధం లేని శక్తులు. మన దేశాన్ని శతాబ్దాలపాటు తమ ఆధీనంలో పెట్టుకొని, ఇక్కడి వనరులను దోచుకెళ్లి ప్రజలను పీడించిన బ్రిటిష్‌ వలస వాదులతో చేతులు కలిపి.. జాతీయోద్య మానికి ద్రోహం చేసిన ఘనాపాఠీల వారసులు. హిందూ దేశం స్థాపనకు శక్తివంచన లేకుండా పని చేసి, విఫలమైన వారి నానా గోత్రీకులు.. కేంద్రంలో తిరిగి అధికారంలోకొస్తే తమ ఎజెండాకి అనుగుణంగానే అన్నీ చేస్తారు.. కాదు చేస్తున్నారు..
 

                                                                       రాజ్యాంగానికి ద్రోహం..

ఆంగ్లేయుల చెర నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరుకున్న నాటి ప్రజల ఆకాంక్షాలను కొంతలో కొంతైనా మన రాజ్యాంగం ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, స్వావలంబన అనే లక్ష్యాలను రాజ్యాంగం స్వీకరిస్తుంది. కేంద్ర బిజెపి సర్కారు రాజ్యాంగాన్ని ఏ రకంగా దెబ్బతీస్తోందో తెలపడానికి కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభ క్రతువు సరిపోతుంది. రాజ్యాంగ పరిరక్షణ గావించేది రాష్ట్రపతి. పార్లమెంట్‌ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి. కానీ రాష్ట్రపతిని పక్కనపెట్టి ప్రధానమంత్రి ప్రారంభించడం ఒక పథకం. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు ప్రతీక అయిన పార్లమెంట్‌ను ఒక్క హిందూ మత సంప్రదాయాలతో శాస్త్రోక్తంగా ప్రారంభించడం, రాచరికంలో మాదిరి రాజదండాలను నెత్తికెత్తుకోవడం, హిందూ మతాచార్యులు, పీఠాధిపతులు, సాధుసంతు లను ప్రధాని మోడీ వెంటేసుకోవడం, వారి పాదాలకు మోకరిల్లడం.. ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్‌ భవనాన్ని ఈ విధంగా ప్రారంభించడం సరికొత్త చరిత్ర కాక మరేమిటి ?
             ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ను ఆధునిక దేవాలయంగా పేర్కొంటారు. సదరు భవనాన్ని స్వాతంత్య్రదినం రోజునో, రాజ్యాంగాన్ని మనకు మనం సమర్పించుకున్న గణతంత్ర దినం నాడో ప్రారంభిస్తే ప్రజలందరూ హర్షిస్తారు. కానీ మోడీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్‌ 140వ జయంతి మే 28న కొత్త పార్లమెంట్‌కు రిబ్బన్‌ కట్‌ చేసింది. పార్లమెంట్‌ భవనంలో నిలువెత్తు సావర్కర్‌ చిత్రపటాన్ని ప్రతిష్టించి.. ప్రధాని, మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. అసలు సావర్కర్‌కు స్వాతంత్య్రానికి, పార్లమెంట్‌కు ఏమైనా సంబంధం ఉందా? తమ సైద్ధాంతిక ఆది గురువుగా, ఆరాధ్య దైవంగా సావర్కర్‌ను కొలుస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి అంతటితో ఆగకుండా స్వాతంత్య్రోద్యమ వీరునిగా చిత్రించేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. మాటిమాటికీ సావర్కర్‌ను ఆకాశానికెత్తడమే పనిగా పెట్టుకున్నారు బిజెపి, పరివార నేతలు. అండమాన్‌ జైలులో సావర్కర్‌ కొంతకాలం ఉన్నాడని కీర్తిస్తూ.. ఏకంగా అక్కడి పోర్టుబ్లెయిర్‌ ఎయిర్‌పోర్టుకు 'సావర్కర్‌ ఎయిర్‌పోర్టు' గా నామకరణం చేసేసింది మోడీ సర్కారు.

11


                                                                        తిరగబడుతోన్న చరిత్ర..

'గాంధి పుట్టిన దేశమా ఇది.. నెహ్రూ కోరిన సంఘమా ఇది.. సామ్యవాదం, రామరాజ్యం సంభవించే కాలమా..' స్థానంలో సావర్కర్‌, హెగ్డేవార్‌, గోల్వాల్కర్‌, హిందూస్థాన్‌ పదాలు చొప్పించబడు తున్నాయి. గొప్ప దేశభక్తుడు అని సావర్కర్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ కీర్తిస్తుంది. అతడి చరిత్ర ఏమిటి? తొలినాళ్ళలో హిందూ తీవ్రవాద సంస్థలు సాయుధ దళాలను తయారుచేసి, బలప్రయోగం ద్వారా ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని ప్రయత్నించాయి. ఆ విధమైన తీవ్రవాద కార్యకలాపాలకుగాను బాబారావ్‌ అనే హిందూ నాయకుడికి యావజ్జీవ శిక్ష విధించారు. శిక్ష విధించిన అధికారి విలియం కర్జన్‌ వైల్‌. అతనిని చంపి, ప్రతీకారం తీర్చుకోడానికి కుట్ర పన్నారు. దానికి సూత్రధారి సావర్కర్‌. ఆ హత్యపై విచారణకు ఆదేశించిన జాక్సన్‌ అనే అధికారిని కూడా హత్య చేయించిన కుట్ర సావర్కర్‌దే. 1909 డిసెంబర్‌లో జాక్సన్‌ హత్య జరిగింది. ఆ కేసులో సావర్కర్‌కు యావజ్జీవ శిక్ష పడింది. 1911, జులై 4న అండమాన్‌కు పంపారు. ఏడాది తిరగకుండానే సావర్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి పలుమార్లు క్షమాభిక్ష కోరుతూ అర్జీలు పెట్టుకున్నాడు. బ్రిటిష్‌ వారికి సాగిలపడ్డాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించాడు. హత్యలకు కుట్రలు పన్నడమే తప్ప, స్వాతంత్య్రోద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామి కాలేదు. శిక్షను తట్టుకోలేక వెంటనే లొంగుబాటు ప్రదర్శించాడు. ఇదీ సావర్కర్‌ వీరత్వం. 1948 జనవరి 30న గాంధీజీని హత్య చేసిన నాధూరాం గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. ఆ హత్యకు సూత్రధారి సావర్కర్‌. సాంకేతిక కారణాలతో సావర్కర్‌ తప్పించున్నాడు. హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతులని, రెండింటి ప్రయోజనాలూ పరస్పరం శత్రు పూరితమైనవని ద్విజాతి సిద్ధాంతం తెచ్చింది సావర్కర్‌. 1942లో కాంగ్రెస్‌ 'క్విట్‌ ఇండియా' తీర్మానం చేసినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగా వ్యతిరేకించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మొదటి నుంచీ జాతీయ జెండాను గుర్తించడానికి నిరాకరించింది. కాషాయ ధ్వజమే దేశానికి జెండాగా ఉండాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి. భారత రాజ్యాంగాన్ని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అంగీకరించదు. మనుధర్మ శాస్త్రమే మనదేశానికి రాజ్యాంగంగా ఉండాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ అభిలాష. మనుధర్మం అంటే సమాజంలో కుల దొంతరలు. కింది వర్ణాల వారిపై పైవర్ణాల వివక్ష, దోపిడీ. జాతీయోద్యమం పట్ల, అమరవీరుల త్యాగాల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు ఏమాత్రం గౌరవం, విలువ లేవు. 'బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకించడం అవివేకం. పెద్ద చేప చిన్న చేపను తింటుంది. అదే విధంగా బలవంతుడు బలహీనులను దోచుకుంటాడు. ఇది ప్రకృతి ధర్మం. దీనిని వ్యతిరేకించ డం తప్పు' అన్నారు హెగ్డేవార్‌.
            'వారిది వీర మరణం అనడంలో సందేహం లేదు. కానీ వాళ్లు మనకు ఎన్నటికీ ఆదర్శమూర్తులు కాజాలరు. ఎందుకంటే వాళ్లు లక్ష్యాన్ని సాధించడంలో విఫల మయ్యారు. అంటే వారిలో ఏదో తీవ్రమైన లోపం ఉన్నట్టే'నని భగత్‌సింగ్‌ సహా కయ్యూరు అమరవీరుల నుద్దేశించి గోల్వాల్కర్‌ ఉల్లేఖించారు. జాతీయోద్యమంతో బిజెపి పితృమూర్తులకు సంబంధం లేదని చెప్పడానికి ఇంతకంటే చారిత్రక ఆధారాలేం కావాలి? గాంధీని హత్య చేసిన గాడ్సేని అపర దేశభక్తునిగా బిజెపి మంత్రులు, ఎంపిలు కొనియాడుతున్నారు.

22

                                                                        రాష్ట్రాల్లో విద్వేష కుంపట్లు..

'మానభంగ పర్వంలో.. మాతృహృదయ నిర్వేదం.. నిర్వేదం.. పుడుతూనే పాలకేడ్చి.. పుట్టీ జంపాలకేడ్చి, పెరిగి పెద్దకాగానే ముద్దూ మురిపాలకేడ్చి.. తనువంతా దోచుకున్న తనయులు మీరు.. మగసిరితో బతకలేక కీచకులై.. కుటిలకామ మేచకులై.. స్త్రీ జాతిని అవమానిస్తే.. మీ అమ్మల స్తన్యంతో.. మీ అక్కల రక్తంతో.. రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం మరో మహాభారతం.. శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే.. మానవరూపంలోనే దానవులై పెరిగితే.. సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే.. కన్నులుండి చూడలేని దృతరాష్ట్రుల పాలనలో.. భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో.. ఏమైపోతుందీ సభ్యసమాజం.. ఏమైపోతుందీ మానవధర్మం.. ఏమైపోతుందీ ఈ భారతదేశం!' అన్న కవి మాటలు అక్షరక్షరం నేడు దేశంలో జరుగుతున్న మారణహోమానికి నిదర్శనం.
             ఈశాన్యాన సున్నిత రాష్ట్రం మణిపూర్‌ మూడు నెలలుగా మంటల్లో కాలిపోతోంది. ఒకప్పుడు శ్రీలంక గొడవలను రావణకాష్టం అనే వాళ్లం. ఇప్పుడు మన మణిపూర్‌ ఆ విధంగా మారడం విషాదం. మతాల కుంపట్లో మహిళలు సమిధలు కావడం భీతికొల్పుతోంది. యావత్‌ జాతి కలత చెందుతోంది. ఈ విపత్తుకు సూత్రధారి, పాత్రధారి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న 'డబుల్‌ ఇంజన్‌' ప్రభుత్వం. డబుల్‌ ఇంజన్‌ అంటే రెండు చేతులా వికాసం కాదు. రెండు వైపులా విద్వేష విద్రోహం. ఒక తెగను భుజానికెత్తుకొని.. పాలక పార్టీయే దాడులకు, గృహ దహనాలకు, హత్యలకు, ప్రార్థనా స్థలాలపై దాడులకు, స్త్రీలపై హేయమైన రీతిలో అకృత్యాలకు తెగబడటం ఆందోళనకరం. ఈ ఘోరకలిపై కొన్ని మాసాల పాటు ప్రధాని నోరు మెదపలేదు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్‌పై చర్చకు ఒప్పుకోలేదు. పార్లమెంట్‌ వెలుపల కొన్ని సెకన్లు మాత్రమే ప్రధాని స్పందించారు. ప్రతి చిన్న అంశానికీ 'మన్‌కీ బాత్‌, చారుపె బాత్‌' అని గంటలు.. గంటలు ప్రవచనాలు దంచే మోడీకి మణిపూర్‌ మరణ మృదంగం వినిపించలేదో, కనిపించలేదో అర్థం కాదు. అల్లర్లను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తొలగించడానికీ సుతరాం ఇష్టపడట్లేదంటే మణిపూర్‌లో కిరాతకాలకు కేంద్ర బిజెపి మద్దతు ఉండబట్టేనని అవగతమవుతుంది. స్వయాన దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి రావడం కేంద్ర బాధ్యతా రాహిత్యాన్ని తెలుపుతుంది. కొన్నిరోజుల సభా వాయిదాల పర్వం అనంతరం ఎలాగైనా ప్రధానితో మాట్లాడించాలని ప్రతిపక్షాలు అవిశ్వాసం అస్త్రాన్ని సంధించాయి. ఏం చర్చ జరిగినా మణిపూర్‌లో శాంతిని స్థాపించే దిశగా కేంద్రం వైఖరి ఉంటుందని ఆశించలేం. ఘర్షణల్లో బిజెపి పాత్రను బట్టి ఈ అంచనా. రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న హర్యానాలో మత ఘర్షణలకూ బిజెపి, హిందుత్వ మూకలే కారణం. ముస్లింలపై భయంకర దాడులు భీతికొల్పుతున్నాయి. అక్కడా బిజెపి డబుల్‌ ఇంజన్‌ పాలనే. దాడులను నిరోధించడంలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం, అల్లర్లకు కారణమయ్యారనే నెపంతో ముస్లింల ఇళ్లను, దుకాణాలను కూల్చేయడం బిజెపి బుల్డోజర్‌ రాజకీయాలకు అద్దం పడుతోంది. జమ్మూకాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తికి గ్యారంటీ చేసిన రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి, నాలుగేళ్లయింది. ఈ కాలంలో అక్కడ ప్రజాస్వామ్యం, పౌరుల హక్కులు, ఇంటర్నెట్‌ సౌకర్యం ఏమీ లేవు. అసెంబ్లీ ఎన్నికలూ లేవు. లౌకిక ప్రభుత్వానికి సారధ్యం వహించే ప్రధాని అయోధ్యలో రామమందిర నిర్మాణంలో పాల్పంచుకున్నారు. అయోధ్య తరహాలో మధుర, వారణాసి వివాదాలను హిందుత్వ శక్తులు రాజేస్తున్నాయి. వారణాసి ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడి జ్ఞానవాపి మసీదులో పురావస్తు సర్వే పేరిట విద్వేషాలను ఉన్మాద శక్తులు రెచ్చగొడుతున్నాయి. 

33

                                                                          అదను దొరికితే చాలు..

అవసరం చిక్కినప్పుడల్లా ప్రజల్లో చీలికలు పెట్టేందుకు, ఐక్యతను దెబ్బతీసేందుకు బిజెపి, సంఘ పరివారం చేయని కుట్ర లేదు. పన్నని పన్నాగం లేదు. కొన్నాళ్లు పౌరసత్వం అని నానా యాగీ చేశారు. వ్యతిరేకించిన వారిని ఢిల్లీలో ఏవిధంగా అణచివేశారో, మైనార్టీలపై ఎలాంటి అక్రమ నిర్బంధాన్ని అవలంబించారో చూశాం. ముస్లింలే టార్గెట్‌గా ఇళ్లపైకి, దుకాణాలపై బుల్డోజర్లు నడిపారు. ఉత్తరప్రదేశ్‌లో సంఫ్‌ు మానసపుత్రుడు యోగి ఆదిత్యనాథ్‌ ఏలుబడిలో ముస్లింలే లక్ష్యంగా రాజ్యహింస పెచ్చుమీరింది. మాఫియా అంతం పేరిట బూటకపు ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్లతో భవనాల కూల్చివేతలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. ఎన్నికల వేళ ఏకరూప పౌరస్మృతి (యుసిసి) ని ముందుకు తెచ్చారు. తెలంగాణాలో నైజాం విముక్తి దినం పాటించాలంటారు. చివరికి 'శాంతి దూతగా వెలసిన బాపూ, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ, విప్లవవీరులు వీర మాతలు ముద్దుబిడ్డలై మురిసే భూమి' అన్న జాతీయోద్యమ స్ఫూర్తికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా మోడీ ప్రభుత్వం 'ఆజాదీకా అమృత్‌ మహోత్సవం' నిర్వహించింది. తమకు జాతీయోద్యమంతో సంబంధం లేకపోయినా, నాడు భగత్‌సింగ్‌ను అసలు విప్లవ వీరుడే కాదని, ఇప్పుడు ఆయన్ని తమ ఖాతాలో వేసుకుంటోంది బిజెపి పదాతిదళం. తెలుగునాట గిరిజనుల హక్కుల కోసం వీరోచితంగా పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజునూ తమలో కలిపేసుకున్నారు. ఇదే సమయంలో గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా చట్టాలు చేసింది బిజెపి సర్కారు. కార్పొరేట్‌ మైనింగ్‌ కోసం అడవుల నుంచి లక్షలాది ఆదివాసీలను తరిమేస్తోంది. అల్లూరిని హిందూమత ప్రబోధకునిగా ఆపాదించడం మరింత దారుణం. విశ్వమానవ కల్యాణాన్ని ఆకాంక్షించిన స్వామి వివేకానందను తమ ఇలవేల్పు అంటోంది. పరమత సహనాన్ని పాటించిన ఛత్రపతి శివాజీని హిందూమత ఉద్ధారకుడిగా మార్చేస్తోంది. హిందువులను అణచివేసిన కర్కోటకునిగా టిప్పూసుల్తాన్‌ను చిత్రీకరించింది. మరీ ఘోరమేమింటంటే.. జనగణమన.. జాతీయ గీతాన్ని రాసిన విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ బ్రిటిష్‌ వారికి అనుకూలమని, వారిని స్తుతించేదే 'జనగణమన' అని వక్రభాష్యాలు అల్లుతున్నారు. 'ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌' దళపతి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణ వివాదాన్ని ఎల్లవేళలా కథా వస్తువుగా వాడుకుంటు న్నారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి బదులు పుక్కిటి పురాణాలకు జైకొడుతున్నారు. ఒక వైపు చంద్రయాన్‌ ప్రయోగాలను శ్లాఘిస్తూనే మరోవైపు జోతిష్యాన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనాంశం చేస్తున్నారు. సైన్స్‌ను వదిలేసి వేదాల్లోనే అన్నీ ఉన్నాయంటున్నారు. చివరికి కరోనా వేళలో ఆవు పేడ, ఆవు మూత్రం దివ్యౌషధంగా ప్రచారం చేశారు. కరోనా ఆపత్కాలంలోనూ మత విద్వేషాలు రేగ్గొట్టారు. దేశంలో ఒకనాడు 'జై జవాన్‌ జై కిసాన్‌' నినాదం మారుమోగింది. ఇటీవల పుల్వామాలో జవాన్ల పట్ల మోడీ ప్రభుత్వం పాటించిన కర్కోటకాన్ని అప్పటి కాశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ లోకానికి వెల్లడించి, బిజెపి ప్రభుత్వానికి జవాన్ల పట్ల ఉన్న కపటప్రేమను బట్టబయలు చేశారు.
             ఇక రైతుల పట్ల మోడీ ప్రభుత్వ పనితనమేమిటో ఈ తొమ్మిదేళ్లలో సంభవించిన రెండున్నర లక్షల రైతు ఆత్మహత్యలే చెబుతున్నాయి. ఢిల్లీ పాలనలో కేంద్ర జోక్యానికి చేసిన చట్టం బిజెపి ప్రభుత్వ సమాఖ్య వ్యతిరేకతకు నిలువుటద్దం వంటిది. బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం. దాన్నే మోడీ ప్రభుత్వం అమలుచేస్తోంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అప్రకటిత 356 ఆర్టికల్‌ నడుస్తోంది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్లు పెత్తనం చెలాయిస్తున్నారు. నూతన విద్యా విధానం, కార్పొరేటీకరణ, మతతత్వం మేళవింపు. న్యాయ, ఎన్నికల వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యం ప్రమాదకరం. న్యాయవ్యవస్థపై ప్రభుత్వ ప్రభావం అయోధ్య తీర్పుతో వెల్లడైంది. తీర్పు చెప్పిన జడ్జిలకు రాజ్యసభ సభ్వత్వం, గవర్నర్‌ పదవులు దక్కడం గమనార్హం. ఎన్నికల కమిషన్‌నూ ప్రభావితం చేస్తోంది. దేశాన్ని కొల్లగొడుతున్న అదానీ వంటి వారికి మోడీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఒకే దేశం, ఒకే భాష పేరుతో హిందీ భాషను బలవంతంగా రుద్దుతోంది. అమూల్‌ను సహకార వ్యవస్థపై ఎక్కుపెట్టింది. పౌరులు నచ్చిన దుస్తులు, నచ్చిన ఆహారం తినడాన్ని తిరస్కరిస్తోంది. కర్ణాటకలో బురఖా వివాదం లేవనెత్తారు. దేశంలో చాలా చోట్ల బీఫ్‌ అమ్మకాలపై నిషేధం విధించారు. గోరక్షణ అంటూ దళితులు, ముస్లింలపై పాశవిక దాడులు జరుగుతున్నాయి.

55


             జాతీయోద్యమానికి ద్రోహం చేసిన, త్రివర్ణ పతాకాన్ని ఈసడించిన హిందూత్వ శక్తులే నేడు అధికారంలో ఉంటూ ఆ జాతీయోద్యమ లక్ష్యాలకు, ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. రాజ్యాంగాన్ని తిరగరాస్తున్నాయి. మళ్లీ సామ్రాజ్యవాదుల తొత్తుగా దేశాన్ని దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. సహ జీవనము.. సహ భావనము.. సమతా వాదము.. మన వేదమిదే. ప్రజా క్షేమము, ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి మనది. 77వ స్వాతంత్య్ర దినాన ప్రజలందరూ ఏకతాటిపైకొచ్చి, దేశాన్ని కాపాడుకోడానికి ప్రతిన బూనాలి. ఆ ప్రేరణతో మరో జాతీయోద్యమ నిర్మాణం కావాలి. అదే నాటి స్వాతంత్య్ర వీరులకు అర్పించే అంజలి..

కెఎస్‌వి ప్రసాద్‌
9490099019