Jun 02,2023 08:52

'చదువుకునేందుకు కావాల్సిన పుస్తకాలు కొనలేకపోతున్నాను. పెన్నుతో రాస్తే కాగితాలు త్వరగా అయిపోతాయని పెన్సిల్‌తో రాసుకునేదాన్ని. అలా ఒకసారి రాసిన తరువాత ఆ అక్షరాలను చెరిపేసి మళ్లీ మళ్లీ రాసేదాన్ని. ఇన్ని కష్టాలు పడుతున్నా చదువును అశ్రద్ధ చేయలేదు. ఎప్పటికైనా సివిల్స్‌ సాధించాలన్నదే నా కల. అది నెరవేరేందుకు ఎంత కష్టమైనా పడతాను' అని గతేడాది 12వ తరగతి సిబిఎస్‌ఇ పరీక్షల్లో ఒరిస్సా మల్కన్‌గిరి జిల్లా టాపర్‌గా నిలిచిన కరమా ముదులి చెప్పింది. పేదరికంలో పుట్టిన ముదులి సాధించిన ఘనత గురించి అప్పుడు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు రోడ్డుపక్కన, మిట్టమధ్యాహ్నం మండుటెండలో కంకరదిబ్బ నుండి రాళ్లను వేరుచేసి తట్టలో వేసుకుంటూ కూలి పనులు చేస్తున్న ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు.

           'కొన్ని రోజులుగా నేను ఇక్కడ దినసరి కూలీగా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చిన డబ్బులతోనే నా చదువు కొనసాగించాలి. ఇది తప్ప నాకు వేరే మార్గం లేదు. దినసరి కూలీలుగా పనిచేసే మా అమ్మానాన్నకు నా ఉన్నత చదువులు చదివించే స్థోమత లేదు. ప్రభుత్వం నుండి అందే పెన్షన్‌ డబ్బులే వారికి ఆధారం' అని చెబుతున్న ముదులిని సివిల్స్‌ రాయాలన్న నీ కల ఏమైందని ప్రశ్నించినప్పుడు 'అది నిజం చేసుకోవాలనే ఇలా కష్టపడుతున్నాను' అంటూ ఏమాత్రం సంకోచం లేకుండా, సిగ్గుపడకుండా గర్వంగా చెబుతోంది. 'బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాక ఓ స్వచ్ఛంద సంస్థ నాకు సాయంగా నిలబడింది. భువనేశ్వర్‌లోని రమాదేవీ యూనివర్శిటీలో నాకు సీటు వచ్చేలా చేశారు. నెలకు రూ.వెయ్యి సహాయం చేస్తున్నారు. అయితే నా చదువుకు ఆ సొమ్ము సరిపోవడం లేదు. టాపర్‌గా నిలిచినప్పుడు చాలామంది ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. కాని ఇంతవరకు ఎవరూ సాయం చేయలేదు. ఈ పరిస్థితుల్లో నా చదువు ఖర్చులు భరించడం అమ్మానాన్న వల్లకాదన్నారు. దీంతో నేనే రోజుకూలీ అవతారం ఎత్తాను. డబ్బుల్లేకుండా నా కల నెరవేర్చుకోలేను. యూనివర్శిటీలోకి వెళ్లాక అక్కడ నా తోటి విద్యార్థులు తినే తిండి, కట్టుకునే బట్టలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. వారిలా నేను లేను. అది నన్ను వారి నుండి వేరుచేస్తోంది. వారి కంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చినా నా పేదరికం నన్ను వైవిధ్యంగా చూపిస్తోంది. నా పట్ల వాళ్లు చూపించే వైఖరి ఒక్కోసారి బాధ వేస్తుంది. అయినా తప్పదు' అంటూ నవ్వుతూ చెబుతున్నా ఆమె మాటల్లో విచారం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
            'నేను ఇప్పటికీ నా చదువుకు కావాల్సిన పుస్తకాలు కొనలేకపోతున్నాను. పెన్సిల్‌తోనే రాసుకుంటున్నాను. పదే పదే చెరుపుతూ ఒక్క పేజీలోనే రెండు, మూడుసార్లు రాస్తున్నాను. ఇంత కష్టపడుతున్నా నా లక్ష్యం నెరవేరుతుందని బలంగా నమ్ముతున్నాను' అని చెబుతున్న ముదులి మాటల్లో ఆత్మవిశ్వాసం నేటి యువతకు ఆదర్శం కావాలి. నలుగురు బిడ్డల్లో ఒకరైన ముదులి అన్న, అక్క పేదరికం కారణంగా చదువు అర్ధంతరంగా ఆపేశారు. చెల్లి ఒక్కత్తే చదువుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తన చదువుకోసం ఇంతలా కష్టపడుతున్న ఆమె కల నెరవేరాలని కోరుకుందాం.