- బీమా, ఆటో, వైద్య రంగాల్లోనూ పతనం
- ఆగస్ట్‌లో 6 శాతం క్షీణత
- నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ఉపాధి అవకాశాలు ఆవిరైపోతున్నాయి. డిమాండ్ ఉండే ఐటి రంగంలోనూ ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గిపోతున్నాయి. బీమా, ఆటోమొబైల్, వైద్య రంగాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ సంస్థ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆయా రంగాల నియామకాల్లో ఏకంగా 6 శాతం తగ్గుదల చోటు చేసుకుందని తెలిపింది. గతేడాది ఇదే నెలలోని ఐటి నియామకాలతో పోల్చితే.. గడిచిన ఆగస్ట్‌లో ఏకంగా 33 శాతం పడిపోయాయని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్‌లో వెల్లడించింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. ''ఆయా రంగాల్లో గతేడాది ఆగస్ట్‌లో 2,828 ఉద్యోగాలు రాగా.. 2023 ఆగస్టులో ఈ సంఖ్య 2,666కు పడిపోయింది. జులైతో పోల్చితే 4 శాతం పెరిగాయి. ఐటి పరిశ్రమలో కొత్త ఉద్యోగాలు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 33 శాతం తగ్గాయి. బీమా, ఆటో, వైద్యం, బిపిఒ రంగాల్లో ఉద్యోగ కల్పన వరుసగా వరుసగా 19 శాతం, 14 శాతం, 12 శాతం, 10 శాతం క్షీణించింది. మరోవైపు నాన్‌టెక్నలాజీ రంగంలోని ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా విభాగాల నియామకాల్లో వరుసగా 17 శాతం, 14 శాతం, 12 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. కాగా చమురు, గ్యాస్ రంగంలో అహ్మాదాబాద్, ముంబయి, చెన్నరు, హైదరాబాద్ నగరాల్లో ఉద్యోగాల కల్పన నిలకడగా ఉంది. ఐటి రంగంలో నియామకాలు తక్కువగా చోటు చేసుకున్నప్పటికీ కృత్రిమ మేధా (ఎఐ) నైపుణ్యాలు కలిగినవారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని నౌకరీ.కమ్ పేర్కొంది.










