Aug 05,2023 21:02
  • తగ్గిన చిన్న మొత్తాల నికర వసూళ్లు
  • 11 ఏళ్లలో తొలిసారి పతనం

న్యూఢిల్లీ : దేశంలోని అధిక ధరలు పొదుపు శక్తిని దెబ్బతీస్తున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో నికర వసూళ్లు తగ్గడమే ఇందుకు నిదర్శనం. పేద, మధ్య తరగతి వారు అత్యధికంగా పొదుపు చేసే పథకాల్లో దశాబ్దం కాలంలో ఎప్పుడూ లేని విధంగా డిపాజిట్లు పడిపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సి), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పిపిఎఫ్‌) వంటి చిన్న పొదుపు పథకాల నికర వసూళ్లు రూ.3.04 లక్షల కోట్లకు పడిపోయాయి. డిపాజిట్ల కంటే ఉపసంహరణలే ఎక్కువగా ఉండటం గమనార్హం. గత 11 ఏళ్లలో నికర వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకోవడం తొలిసారి. 2021-22లో రూ.3.33 లక్షల కోట్ల డిపాజిట్లు నమోదయ్యాయి.

2022-23లో పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు అత్యధిక నికర వసూళ్లు సాధించిన మొదటి 5 రాష్ట్రాలో ఉన్నాయి. బీహార్‌, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి, తెలంగాణ, మిజోరం, హిమాచల్‌ ప్రదేశ్‌ నికర వసూళ్లు పెరిగాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు అయినా దాద్రా, నగర్‌ హవేలీ మినహా అన్ని ఇతర రాష్ట్రాలు, యుటిలలో నికర వసూళ్లు పడిపోయాయి.
1999 నుంచి చిన్న పొదుపు పథకాల క్రింద వచ్చిన అన్ని డిపాజిట్లను నేషనల్‌ స్మాల్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో జమ చేస్తున్నారు. కరోనాకు ముందూ, తర్వాత కూడా కేంద్రం చాలా కాలం పాటు చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను తగ్గించడం, యథాతథంగా కొనసాగించింది. ఈ ప్రభావం చిన్న మొత్తాలపై తీవ్రంగా పడిందని నిపుణులు భావిస్తున్నారు. అనేక విమర్శల నేపథ్యంలో 2022-23 మార్చి త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేట్లను స్వ్పలంగా పెంచింది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వరుసగా 6.6 శాతం, 6.8 శాతం, 6.9 శాతం చొప్పున వడ్డీని అందించింది.