Oct 20,2023 21:02

అహార ద్రవ్యోల్బణంలో అనిశ్చిత్తి
ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌
న్యూఢిల్లీ / వాషింగ్టన్‌ : రుణ గ్రహీతలు హెచ్చు వడ్డీ రేట్లను మరికొంతకాలం భరించాల్సిందే. అధిక వడ్డీ రేట్లు ఎంత కాలం కొనసాగుతాయో చెప్పలేమని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో దాస్‌ మాట్లాడుతూ.. కొంతకాలం వడ్డీ రేట్లు ఇదే స్థాయిలో కొనసాగుతాయన్నారు. ప్రస్తుత ఆర్థిక విధాన రూపకల్పన సంక్లిష్టంగా మారిందన్నారు. 2023లో ఇప్పటివరకు పాలసీ రేట్లపై ఆర్‌బిఐ విరామం కొనసాగించిందన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచాయన్నారు. ఈ క్రమంలో ఆర్‌బిఐ సైతం 2022 మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ రెపోరేటును దాదాపు 250 బేసిస్‌ పాయింట్ల (2.5 శాతం) మేర హెచ్చించింది. ఇప్పటికే రెపో రేటు 6.50 శాతానికి చేరింది. ఈ రుణ రేట్లు ఎంతకాలం స్థిరంగా ఉంటాయో అప్పుడే చెప్పలేమని, కాలమే దానికి సమాధానం చెప్పొచ్చని శక్తికాంత అన్నారు.
ప్రపంచ వఅద్ధిలో మందగమనం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణంలో అనిశ్చితి నెలకొందన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్‌బిఐతో సహా సెంట్రల్‌ బ్యాంకులు ఆర్థిక స్థిరత్వాని కాపాడుకోవడంలో బాధ్యత వహించాలన్నారు. ముడి చమురు ధర పెరుగుదల, బాండ్ల రాబడి పెరగడం వంటి తాజా సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయని దాస్‌ అన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా బ్యాంకులు కనీస మూలధన అవసరాలను తీర్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్థి చోటు చేసుకోవచ్చని అంచనా వేశారు. రూ.10వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం 19 ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లను స్వీకరిస్తున్నారు.
రేట్ల పెంపు తప్పదు : యుఎస్‌ ఫెడ్‌ ఛైర్మన్‌
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో వడ్డీ రేట్లను మరింత పెంచాల్సి ఉంటుందని అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు రేట్ల పెంపు ఉంటుందన్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణ కట్టడికి ఈ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు.
ఇందుకోసం భవిష్యత్తులో వడ్డీరేట్లు పెంచక తప్పదన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతుందన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు.