Aug 09,2023 08:21

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ (బి కేటగిరి 35 శాతం), ఎన్‌ఆర్‌ఐ (సి కేటగిరి 15 శాతం) కోటా సీట్లను భర్తీ తాము వెలువరించే తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. భర్తీ ప్రక్రియ నిలుపుదలకు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. భర్తీ ప్రక్రియ పూర్తి చేయవచ్చునంది. సీట్ల భర్తీ మాత్రం తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయంది. ప్రతివాదులైన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసి) కార్యదర్శి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎవి శేషసాయితో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ప్రకటించింది. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వైద్య కళాశాల కంటే సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నంలో భాగంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లాల్లో ఏర్పాటుచేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లను జనరల్‌, సెల్ఫ్‌ఫైనాన్స్‌, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లుగా విభజిస్తూ ప్రభుత్వం గత నెలలో జిఓలు 107, 108 ఇచ్చింది. వీటిని సవాల్‌ చేస్తూ.. కోయ శిరీష (గుంటూరు) జతిన్‌ రారు (ఏలూరు) వీణా జ్యోతిక (ఆత్మకూరు) దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు విచారణ జరిపింది.