Oct 02,2023 12:04

కాలానుగుణంగా సినిమా తన దిశ, దశను మార్చుకుంటూ నడవడం ఎప్పుడూ జరిగేదే. సినిమా పుట్టుక నుండి ఇప్పటివరకు ఎన్నో మార్పులు, చేర్పులు చూస్తున్నాం. జానపదాలు, పౌరాణికాలు దాటి కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమ, పెళ్లి, సమాజ చైతన్యం, సమకాలీన పరిస్థితులు, బయోపిక్‌లు ఇలా ఒకటేమిటి ఎన్నో వైవిధ్యాల కలబోతైన సినిమాని ఆస్వాదించాం. వేన్నోళ్ల కీర్తించాం. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు గమనిస్తే హీరో ఎలివేషన్‌ ఎక్కువగా కనపడుతోంది. మన తెలుగు సినిమాల్లో హీరో పాత్ర చుట్టూనే కథ తిరుగడం ఎప్పుడో మొదలైనా ప్రస్తుతం హీరోయిజం ఎక్కువైంది. 'ఫలానా సినిమాలో మా హీరో పరిచయ సన్నివేశం అదిరిపోయింది. అప్పుడు అతను వేసుకున్న డ్రస్‌, చెప్పులు, హెయిర్‌స్టైల్‌, నడిచిన తీరు అద్భుతంగా తెరకెక్కించారు' అంటూ అభిమానులు తమ హీరోల ఇంటర్‌డక్షన్‌ సీన్ల గురించి మాట్లాడుకోవడం పాత కథ. ఇప్పుడు.. 'మీ హీరో సినిమాలో ఎన్ని ఫైట్లు ఉన్నాయి? పవర్‌ ఫుల్‌ డైలాగులు ఎన్ని పెట్టారు? విలన్లు ఎంతమంది? హీరోయిన్‌ను ఎన్ని సార్లు ఏడిపించాడు? పాటలెన్ని? ఎక్కడ తీశారు?' వంటి ప్రశ్నలు కొత్తవి.

2

హీరో పాత్రను ప్రభావవంతంగా కంటే ప్రతిభావంతంగా చూపించడమే సినిమా లక్ష్యంగా మారిపోయింది. స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఇవ్వాలని, వివక్ష లేని సమాజం రావాలని కలలుకంటున్న సామాన్యజనంలో, స్త్రీ కంటే పురుషుడు ఒకింత ఎక్కువనే భావన వచ్చేలా సినిమాలు తీయడం వెనుక అర్థం ఏంటి ? ఈ భావజాలం ఎక్కడిది ?

5

హీరో ప్రతిభను అరిచి, గోల చేసి మరీ చూపించడాన్ని మొదలుపెట్టిన దర్శకుల్లో రాజమౌళి, వివి వినాయక్‌, బోయపాటి, కొరటాల వంటి దిగ్గజ దర్శకులు అగ్రభాగంలో నిలుస్తారు. వారు తీసిన సినిమాల్లో హీరో చాలా శక్తిమంతుడు. వందమందిని సైతం ఒక్కచేత్తో నరికేస్తాడు. తొలుత విలన్‌చేత చావుదెబ్బలు తిన్నా చివరికి హీరో ఒక్కడే విలన్‌ని హతమారుస్తాడు. హీరోకి ఎందుకంత ప్రాధాన్యత? ఆ తరహా హీరో పాత్రల ప్రభావం సమాజాన్ని ఏ వైపు నడిపిస్తుంది ?

3

హీరోల నడక, జుట్టు, చెప్పులు, దుస్తులు, నగలు ఎన్ని అనుకరించినా నష్టం లేదు. అదే ఆ హీరో సినిమాలో నడతను అనుకరిస్తే మాత్రం ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆడపిల్లలపై దాడులు పెరిగిపోవడానికి లక్ష కారణాలు ఉన్నా వాటన్నింటికీ మూలం దాడి చేసిన ఆయా వ్యక్తులు, నిందితులు తమకు తామే హీరోలమని అనుకోవడం కూడా ఒక కారణం. అందుకే తామేం చేసినా వినాలని, ఏం అడిగినా ఇవ్వాలని, తమ కంటే తక్కువని మహిళలపై చిన్నచూపు చూస్తున్నారు. విద్యలో, ఉపాధిలో, ఉన్నత శిఖరాలు అందుకోవడంలో పురుషులతో పోటీపడుతున్నారు నేటి మహిళలు. వారి అభివృద్ధి సమాజానికి దిక్సూచీలా నిలుస్తుంది. కానీ ఈ పరిణామాన్ని సమాజంలో ఓ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే తమ గొప్పతనాన్ని, శక్తిసామర్థ్యాలను, కోపాన్ని, అసూయని, ద్వేషాన్ని హీరో పాత్రల్లో చూడాలనుకుంటున్నారు. వారిని ఆనందింపజేయడం కోసమే హీరో ప్రతిభను తారాస్థాయిలో చూపించడం మొదలైంది.

3

వృత్తిదారుడు, చెప్పులు కుట్టేవాడు, వడ్రంగి, దర్జీ, గాయకుడు, నర్తకుడు, కళాకారుడు హీరో పాత్రల్లో కనిపించి చాలా రోజులైంది. పోకిరీ, రౌడీ, ఖైదీ, దొంగ, స్మగ్లర్‌, అండర్‌వరల్డ్‌ డాన్‌, మత్తుపదార్థాల బానిస, అమ్మాయిలను ఏడిపించే శాడిస్ట్‌లు హీరో పాత్రల్లో ప్రవేశించారు. ఇప్పుడు ఆ పాత్రలనే మరింత శక్తిమంతంగా, సమాజాన్ని శాసించే నియంతలుగా చూపిస్తున్నారు. 'సినిమాల్లో హీరో ఎలివేషన్‌ చూపించడం ఈ మధ్య ఎక్కువైంది. పురుషుల్లో ఆత్మనూన్యత పెరిగిపోవడమే దీనికి కారణమ'ని ఇటీవల విశేష ప్రజాదరణ పొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'పుష్ప' సినిమాలపై బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. భిన్న జాతులు, వర్గాలు, మతాల మధ్య ఎక్కువ, తక్కువ అనే వ్యత్యాసం రావడం సమాజానికి చేటు. సాధ్యమైనంత వరకు ఆ భావాన్ని పారద్రోలే ప్రయత్నాలు చేయాలి. అలా కాక ఆ వ్యత్యాసాన్ని మరింత ఎక్కువచేసి చూపించడం సర్వత్రా ఆమోదయోగ్యం కాదు.