అఘాయిత్యయత్నం చేసారనీ ఆడపిల్ల
గల్లీలో కాదు; ఢిల్లీలో గొంతెత్తుతున్నది
సాక్ష్యం చూపించమన్నాడు కుపురుషుడొకడు
ఆ ఆడపిల్లలే వాడిపిల్లలైతే అదే కూత కూస్తాడా?
వాళ్లనోనాడు పలక ముట్టొద్దని నిషేధించాం
చదివే వోణిలు వాణివైపు నడిస్తే చెడిపోతామన్నాం
ఒక స్త్రీ బాలికాక్షరాలు నేర్పిస్తే పేడనీళ్లు పోశాం
ఛాందసాల్ని ఆధునిక మంటల్లో తగలేస్తూ
ఆడపిల్లలు అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నప్పుడు
బూడిదయ్యాక కూడా ఛాందసులు మాట్లాడుతున్నారు
దారిలో పోతుంటే అదోలా చూసేవాడొకడు
బస్సులో వెళ్తుంటే భుజాలపై చేతులేసి వేధించేవాడొకడు
నమ్మించి మోసగించేవాడొకడు
ప్రేమవుచ్చులోకి దింపి చచ్చు బతుకు చేసేవాడొకడు
ఆడలేడిపిల్లల చుట్టూ కబళించే మగపులులెన్నో..!
వలపుబువ్వ పెట్టలేదని సైకోలా మారి
సిగరెట్టు వాతల హింసకు పాల్పడతారు
అనుమానం వస్తే చాలు, విడాకులిచ్చి
ఒంటరి వెతలవూబిలోకి దింపేస్తుంటారు
వేరొకడితో మాట్లాడిందనీ నలభై ముక్కలుగా
పడతిని పడగొట్టి నరికేసేవాళ్లున్నారెందరో...
అర్ధరాత్రి ఆడవాళ్లు తిరిగే స్వేచ్ఛా!?
పగలే నట్టనడివీథిలో ఆమెల్ని చెరబట్టే కాలమిది
చెరబడుతుంటే చోద్యం చూసే లోకం యిది
చెరబట్టారనీ ఆవేదన పడినా హక్కుల్లేవు
ధనికుల నేరాలకు కాపుగాసే చట్టాలున్న ఈ మట్టిపై
బీదబిక్కీ స్త్రీబిడ్డల కన్నీటిని తుడిచే చట్టమేదీ!?
దేశం నా భరతమాత ఒక ఉవిదే
న్యాయదేవత ధర్మదేవత మహిళలే అయినా
పురుషులదే ఆధిపత్యం
పీడితుల పక్షం నిలవని దేశం దేశమా!?
పతకాలు తెచ్చినపుడు దేశం గొప్పన్నావు
వాళ్లు ధైర్యం చేసి లోపల గాయాల్ని బట్టబయలు చేసి
దోషులను పట్టుకుని శిక్షించమని అడిగితే
ఆడవాళ్లు కదా లాఠీలతో అణచివేస్తున్నావూ!?
గద్దెనెక్కిన ఏలికా!?
అమ్మ పాదాలు తడుతుంటావు గదా
వాళ్లూ కాబోయే అమ్మలు
మీ అమ్మనే అయితే ఏం చేస్తావూ!?
తొక్కి పడతావా!? మొక్కి వాళ్లకు సాయపడతావా!?
అబలల గోడు వైపు చెవియొగ్గినపుడే నీది రాజసం!
- మెట్టా నాగేశ్వరరావు










