Jun 03,2023 09:39

ఎన్నో ముళ్ల కంచెలు ... కేరళలో ఓ సినిమా షూటింగు జరుగుతోంది. హీరోయిన్‌ కాస్టూమ్స్‌ డిజైనర్‌గా ఓ వృద్ధమహిళ పనిచేస్తున్నారు. అది ఆమె తొలి సినిమా. డైరెక్టర్‌తో ఉన్న చిరకాల పరిచయం కారణంగా ఆమెకు ఈ అవకాశం వచ్చింది. అలా 69 ఏళ్ల వయసులో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మారిన ఆమె పేరు నళినీ జమీల. మొదటి సినిమాకే రాష్ట్ర జ్యూరీ అవార్డు అందుకున్న ఆమె అంతకు ముందే అంటే 15 ఏళ్ల క్రితమే తన ఆటోబయోగ్రఫీ రచించి తొలిసారి వార్తల్లో నిలిచారు. అప్పట్లో అదో పెద్ద సెన్షేషన్‌. పితృస్వామ్య సమాజం ఆ పుస్తకాన్ని బహిష్కరించింది. ఆమె బరితెగించిన ఆడది అంది. కారణం.. ఆమె సెక్స్‌ వర్కర్‌. ఆ వృత్తిలో తన అనుభవాలు.. తనకెదురైన వ్యక్తుల గురించే పుస్తకాలు రచించి రచయితగా మారింది. ఆ పుస్తకాలు పలు భాషల్లో అనువాదమయ్యాయి కూడా. ఆమె ప్రయాణం అక్కడితో ఆగలేదు.. సామాజికవేత్తగా పలు కార్యక్రమాలు న్విహించింది. ఎయిడ్స్‌ అవగాహనకై దేశవిదేశాలు తిరిగింది. సెక్స్‌ వర్కర్ల జీవితాలతో రూపొందిన పలు డాక్యుమెంటరీల్లో నటించింది.
 

                                                                 బతుకుదెరువు కోసం.. బలవంతంగా ...

మూడో తరగతికే చదువుకు స్వస్తి చెప్పిన నళినీకి చిన్న వయసులోనే వివాహమైంది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక క్యాన్సర్‌ వ్యాధితో భర్త చనిపోయాడు. పుట్టింటికి వెళ్లే దారి లేదు. తోడబుట్టిన అన్న తన కంటే పెద్దదైన ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి అతనికి మద్దతు ఇచ్చినందుకు ఇంటి నుండి గెంటివేయబడింది. తనకు తోడుగా ఉంటాడనుకున్న భర్త అర్ధంతరంగా వెళ్లిపోయాడు. పిల్లల పోషణ కోసం ఇటుకబట్టీల్లో పనిచేసింది. రోజుకు రెండున్నర రూపాయల కూలితో పిల్లలనెలా పోషిస్తావన్న అత్తింటి వేధింపులు భరించింది. ఈ పరిస్థితుల్లో పిల్లలను ఏదైనా అనాథాశ్రమంలోకి చేర్పించాలని చూసింది. కాని ఆమె స్నేహితురాలు ఆ ప్రయత్నాన్ని వారించి తనకు సాయం చేస్తానని చెప్పింది. మాయమాటలు చెప్పి సెక్స్‌ వర్క్‌లోకి దింపింది.
 

                                                                   నాకు ఎప్పటికీ అర్థం కాదు..

'ఆ రోజు రాత్రంతా ఓ పోలీసుతో ఉన్న నన్ను తెల్లవారుజామున మరో పోలీసు అరెస్టు చేశాడు. సెక్స్‌ వర్క్‌ చేస్తున్నానని నిర్ధారణ అయ్యాక దారుణంగా హింసించారు. అరికాళ్ల మీద కొట్టారు. అంతటి బాధలోనూ నేను ఏడ్వలేదు. అది వారికి మరింత కోపం తెప్పించింది. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమేంటంటే.. ఆ రోజు తెల్లవారుజామున వీధిలో నడుస్తున్న నాపై ఓ పోలీసు చాలా దారుణంగా దాడి చేశాడు. నా రెండు చేతులు వెనక్కి గుంజి, గట్టిగా పట్టేసుకున్నాడు. విడిపించుకునే అవకాశమే ఇవ్వలేదు. నేను తప్పుచేశాను అన్న ఆ పోలీసు రాత్రంతా నాతో ఉన్న పోలీసును మాత్రం అరెస్టు చేయలేదు. విచిత్రమేమంటే.. నాతో ఉన్న పోలీసే వీధుల్లో తిరుగుతున్న సెక్స్‌వర్కర్లను వెంటనే పట్టుకుని స్టేషనుకు తీసుకురమ్మని చెప్పాడంట.. ఎంత దారుణం! ఏ పరిస్థితుల్లో ఈ కూపంలోకి వచ్చామో ఎవరికీ తెలియదు. ఫలానా పని చేస్తున్నామని చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడతాం. దీన్నుండి బయటపడే దారుండదు. ధైర్యం చేసి వచ్చినా ఉండేందుకు ఎవరూ ఇల్లు ఇవ్వరు. సాయం చేసే వారు కనిపించరు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో బతికిన నేను ఈ స్థితికి వచ్చినా ఇప్పటికీ ఏదో ఒక మూల ఓ అనుమానపు చూపు నాకు తగులుతూనే ఉంటుంది'.
 

                                                                  రెండు పుస్తకాలే.. పెద్ద సంచలనం..

'నా జీవితంలో ఎదురైన మంచి, చెడు అనుభవాలతో రెండు పుస్తకాలు రాశాను. అయితే సాహిత్యలోకం నన్ను అంగీకరించలేదు. నా పుస్తకాలు చదవదగ్గవి కాదన్నారు. అలాంటివి రాయడమే పెద్ద తప్పన్నారు. 2015లో 'నా ఆటో బయోగ్రఫీ' పేరుతో తొలి పుస్తకం రాసిన నేను 2018లో వృత్తిలో నా అనుభవాలు చెబుతూ నాకు తారసపడిన వ్యక్తులు.. వారితో నాకు ఏర్పడిన అనుబంధం గురించి మరో పుస్తకం రచించాను. ఆ పుస్తకం పెద్ద సంచలనమైంది. అది చాలామందికి రుచించలేదు. నాపై నిందలు వేశారు. ఇవన్నీ నేను ఊహించినవే.. కాబట్టి భయపడలేదు. అవి నా ఒక్కదాని అనుభవాలే కావు.. నాలాంటి వారందరవీ' అంటారు ఆమె.
 

                                                                        కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ...

దర్శకుడు మనీలాల్‌తో నాకు చిరకాల స్నేహం ఉంది. అతను తెరకెక్కిస్తోన్న 'భరతపూజ' చిత్రంలో హీరోయిన్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా నన్ను తీసుకున్నాడు. ఆ పాత్ర ఓ వేశ్యది. ఆ పాత్రకు దుస్తులు డిజైన్‌ చేస్తున్నప్పుడు నా గతం గుర్తుచేసుకున్నాను. అప్పుడు నేను వాడిన బట్టలనే సెలక్ట్‌ చేశాను. అవి చాలా సాదాసీదావి. వేశ్యల బతుకులు చీకట్లో మగ్గుతాయనే అందరూ అనుకుంటారు. కానీ, మా బతుకులు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తాయి. అవి తెలిసిన వారు చాలా తక్కువ. అందుకే ఆ పాత్రలో వారి స్థితి కనిపించాలనుకున్నాను. హంగు, ఆర్భాటం లేకుండా సహజంగా వాడే బట్టలనే కట్టించాను. అదే నాకు అవార్డు వచ్చేలా చేసింది. 2021లో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ అవార్డు రావడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలో ఎదురైన అరుదైన అనుభవం ఇది. ఆ సినిమా తరువాత నాకు మరో అవకాశం రాలేదు. ఎందుకంటే నాలాంటి వారితో పనిచేయడం ఎవరికీ ఇష్టం ఉండదు' అంటున్న ఆమె 2001 నుండి కేరళ సెక్స్‌ వర్కర్‌ ఫోరమ్‌ కన్వీనర్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం వృత్తి నుంచి బయటికి వచ్చి, యాచకం చేసుకుంటున్న వృద్ధ మహిళలకు వసతి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యం కోసం పనిచేస్తున్నారు.