Oct 29,2023 12:03

జమ్ము కాశ్మీర్‌ : ' నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి ' తలచుకుంటే సాధ్యమిది..! అని ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌ ' ఓ చిత్రంలో రాసిన హిట్‌ సాంగ్‌ ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటుంది.. ఈ తరహాలో ఎంతోమంది వారికున్న లోపాలను సైతం అధిగమించి రికార్డులను సాధించి వాహ్వా..! అనిపించుకున్నారు. అదే కోవలో... 16 ఏళ్ల శీతల్‌ దేవి అసాధారణ ప్రతిభ కనబరిచింది.. ఎక్కడో జమ్మూకాశ్మీర్‌లో ఓ పేద కుటుంబంలో పుట్టిన శీతల్‌ దేవికి రెండు చేతులూ లేవు.. అయితేనేం.. తన రెండు కాళ్ళతో సంకల్పానికి ఊతమిచ్చింది. కాళ్లనే చేతులుగా చేసుకొని విలువిద్యపై సాధన చేసింది. పారా ఆసియా క్రీడల్లో తన ప్రతిభతో అదరగొట్టింది. ప్రపంచం మొత్తం ఆమె ప్రతిభను చూసి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ అభినందనల వర్షాన్ని కురిపిస్తోంది.. ఆమె సంకల్పానికి, సాధించిన ఘనతకు మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చలించిపోయారు. ' నీకు నచ్చిన కారు ఎంచుకో.. 'బంగారు' తల్లీ ' అంటూ... బహుమానాన్ని ప్రకటించారు.

11

                                                                  ఫొకోమేలియా అనే రుగ్మత...

పేద కుటుంబంలో పుట్టిన శీతల్‌కు ఫొకోమేలియా అనే రుగ్మత కారణంగా చేతులు ఎదగలేదు. అయినా కాళ్లతోనే పనులు చేసుకోవడం నేర్చుకుంది. తనకు ఆటలంటే ఎంతో ఇష్టం.. ఆర్చరీ అంటే మరీ ఇష్టం.. కానీ రెండు చేతులు లేవని వెనకడుగు వేయలేదు.. తనకున్న రెండు కాళ్లనే చేతులుగా చేసింది. సాధారణంగా విలువిద్య అంటే .. ఒక చేతితో విల్లును పట్టుకొని మరో చేతితో బాణాలను సంధించాలి. శీతల్‌ తనకున్న రెండు కాళ్లతో విలువిద్య సాధన చేసింది.. భారత సైన్యం పెట్టిన ఓ క్రీడా శిబిరంలో పాల్గొనడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె సంకల్పం పతకాలను కొల్లగొట్టింది. ప్రపంచంలో ప్రస్తుతం రెండు చేతులు లేకుండా పోటీపడుతున్న ఏకైక ఆర్చర్‌ శీతలే..!

22

                                                                           సాధన ఇలా ...

నెమ్మదిగా కాళ్లతో అన్ని పనులను చేయడం అభ్యసించిన శీతల్‌ ... కోచ్‌ కుల్‌దీప్‌ వేద్వాన్‌ శిక్షణలో విలువిద్యకు ఓనమాలు దిద్దింది. కాళ్లతోనే బాణాలు వేయడం సాధన చేసింది. నెమ్మదిగా సాధారణ ఆర్చర్లతో పోటీపడే స్థాయికి ఎదిగింది. గుజరాత్‌లో జరిగిన అండర్‌-18 టోర్నీలోనూ పాల్గని సత్తా చాటింది. చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన ఐరోపా పారా ఆర్చరీ కప్‌లో రజతం గెలవడం శీతల్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే జోష్‌తో పిల్సన్‌లో జరిగిన ప్రపంచ పారా ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది ఈ ఆర్చర్‌. 2012 పారాలింపిక్స్‌ ఆర్చరీలో రజతం నెగ్గిన మాట్‌ సుట్జ్‌మ్యాన్‌... శీతల్‌ టెక్నిక్‌ను మెరుగుపరిచింది. తాజాగా పారా ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలతో సహా మూడు పతకాలు నెగ్గి శీతల్‌ మరోసారి సత్తా చాటింది. 2024 పారిస్‌ పారాలింపిక్స్‌లోనూ అదరగొట్టి పతకం గెలవాలనేది శీతల్‌ లక్ష్యం.

                                   ఒకే క్రీడలో రెండు పసిడి పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా అథ్లెట్‌...

రెండు చేతులు లేని ఈ ఆర్చర్‌ ఈ క్రీడల్లో రెండు పసిడి పతకాలతో రికార్డు సృష్టించింది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అలీమ్‌ సహిదా (సింగపూర్‌)ను ఓడించి పసిడి సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ టీమ్‌లో స్వర్ణం గెలిచింది. ఈ జమ్ముకాశ్మీర్‌ ఆర్చర్‌ ఒకే క్రీడల్లో రెండు పసిడి పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా ఘనత సాధించింది. మహిళల డబుల్స్‌లోనూ శీతల్‌ రజతం గెలిచింది. మొత్తంగా హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించింది.

;