
ప్రజాశక్తి-కపిలేశ్వరపురం (కోనసీమ) : బోడిపాలెం వంతెన శిధిలావస్థలో ఉందని తెలిసినా ప్రతి నిత్యం వందలాది లారీలు 40-50 టన్నుల మట్టి లోడ్ తో ఇటుక బట్టిలకు వెళుతూ వుంటాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ప్రజాశక్తితో గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కపిలేశ్వరపురం మండలం లంక గ్రామాల సమీపంలో ఉన్న బోడిపాలెం వంతెన శిధిలావస్థకు చేరుకుంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన గతకాలం నుండి పాలకులు, అధికారులు శిధిలావస్థలో ఉన్న వంతెన నిర్మిస్తామని అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప సంబంధిత అధికారులు ఇంతవరకు వంతెన నిర్మాణ పనులు చేపట్టలేదు. కేదార్ లంక, వీధి వారిలంక , నారాయణ లంక గ్రామస్థులు ప్రతి నిత్యం ఏ చిన్న పనికైనా కొత్తపేట , రావులపాలెం, అమలాపురం వంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ వంతెనే ఆధారం. ఈ వంతెన కాస్తా కూలిపోతే తమ పరిస్థితి ఏంటని లంక గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారుల పై అతి వేగం తో భారీ వాహనాలు వెళ్ళడం వల్ల వృద్దులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని , ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ రెవెన్యూ అధికారులు దీనిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.