Jul 20,2023 21:55

ప్రజాశక్తి - వి.కోట (చిత్తూరు జిల్లా):చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని ఎంఎంకుంట ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పాఠశాలకు తాళం వేశారు. స్థానికుల కథనం మేరకు...యాలకల్లు పంచాయతీ ఎంఎం కుంటలో ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో దాదాపు 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి అరకొర ఉపాధ్యాయులతో నడుస్తున్న పాఠశాల ప్రస్తుతం ఉపాధ్యాయుల కొరతతో మూసివేసే పరిస్థితి నెలకొంది. దీన్ని అధిగమించేందుకు మండల విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడికి ఈ పాఠశాల అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉపాధ్యాయులను కేటాయించే వరకూ పాఠశాలను తెరిచేది లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నగరి నుంచి ఎంఎం కుంటకు ఉపాధ్యాయులను బదిలీ చేయగా వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఎంఇఒ చంద్రశేఖర్‌ తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులతో ఎంపిపి సభ్యులు యువరాజ్‌ చర్చించి గ్రామస్తులకు సర్దిచెప్పి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం పాఠశాలను తెరిచారు.