Jul 27,2023 16:01

తెలంగాణ : తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ పరిసరాల్లో కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్త వరకు కొనసాగుతుందని చెప్పారు.రుతుపవన ద్రోణి బికానర్‌, కోట, రైజన్‌, దుర్గ్‌, దక్షిణ ఒడిశాతో పాటు పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రా అల్పపీడన ప్రాంతం మీదుగా తూర్పు ఆగేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు. షీయర్‌ జోన్‌ వెంట సగటు సముద్రమట్టం 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ వైపు వంపుగా ఉందని పేర్కొన్నారు.దీని ప్రభావంతో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ మేరకు వాతావరణశాఖ ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.