అమరావతి: ఎగువన కురిసిన వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 80 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన మున్నేరులోకి 1.38లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. సాయంత్రానికి ఆ ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకునే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజ్ రెండు గేట్లు ఎత్తి 9 టీఏంసీల వరదను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 14 అడుగులు దాటింది. పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయం వద్ద కేశఖండశాల దుకాణ సముదాయాల్లోకి వరద నీరు చేరింది. లింగాల వంతెన నీట మునిగింది. నందిగామ వద్ద మునేరు ఉద్ద్రుతంగా ప్రవహిస్తోంది. మున్నేరు, కట్టలేరు, వైరా ఏరు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ అటువైపు వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు.ఎగువ ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరానికి భారీగా వరద ప్రవాహం తరలి వస్తోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆనకట్ట వద్ద నీటి మట్టం 12.9 అడుగులకు చేరింది. డెల్టా కాల్వలకు 4 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సముద్రంలోకి 11 లక్షల 44 వేల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో తీరం ప్రమాదకరంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.










