Jan 07,2023 11:01
  • భారీ ఎత్తున కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
  • పర్యావరణ పరిరక్షణ గాలికి
  • ఆందోళనలో ప్రజానీకం

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లాలో నిక్షిప్తమై ఉన్న మాంగనీస్‌ గనులను కారుచౌకగా ప్రయివేటు సంస్థలకు భారీ ఎత్తున కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ గనులను ఉపయోగించుకుని ప్రభుత్వ రంగంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను లెక్కచేయలేదు. పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతాయన్న ప్రజల ఆందోళనలు కూడా పట్టించుకోవడం లేదు. విజయనగరం జిల్లా గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, తెర్లాం మండలాలు మాంగనీస్‌ గనులకు పెట్టింది పేరు. ఇక్కడి భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న ఈ ఖనిజానికి ప్రపంచ స్థాయిలో మంచి డిమాండ్‌ ఉంది. 30 బ్లాకుల్లో మంగనీస్‌ తవ్వకాలను గతంలోనే అనుమతులు ఉండేవి. ప్రస్తుతం వీటిలో కొన్నింటిలో మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇనుము, కాపర్‌ వంటి రకరకాల లోహాలను కరిగించడంతోపాటు వివిధ రకాల తయారీకి మాంగనీస్‌ ఎంతో దోహదపడుతోంది. ఈ ప్రాంతంలోని మాంగనీస్‌ అత్యంత నాణ్యతగా ఉండడంతో సెయిల్‌, గెయిల్‌ వంటి ప్రభుత్వరంగ స్టీల్‌ప్లాంటులకు కేటాయించాలన్న ఉద్దేశంతో సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇక్కడి మాంగనీస్‌ గనులను కొత్తగా లీజుకు ఇవ్వకుండా నిలిపివేశారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం సహజ వనరుల లీజు పద్ధతిని పెట్టుబడిదారులకు మరింత సులభతరం చేసి ఓపెన్‌ బిడ్‌ రూపంలో కేటాయిస్తోంది. ఈ క్రమంలో ఎపి ఎంఎంసి (ఆంధ్రప్రదేశ్‌ మైనర్‌ మినరల్‌ కనస్ట్రక్షన్‌) 1966 నిబంధనలను సరళతరం చేసి 2022 మార్చి 14న ఎపి ఎంఎంఎఆర్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జిఒ నెంబర్‌ 30, 14లను తీసుకొచ్చింది. విజయనగరం జిల్లాలో వివిధ మండలాల్లోని మాంగనీస్‌ గనులను భారీ స్థాయిలో వివిధ ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టింది. 56 లక్షల మెట్రిక్‌ టన్నుల మాంగనీస్‌ నిల్వలు ఉన్న గిరివిడి మండలం దేవాడ బ్లాక్‌ను మహాలక్ష్మీ మినరల్స్‌ అనే ప్రయివేట్‌ కంపెనీ, జిల్లాలోని సుమారు 19 మాంగనీస్‌ బ్లాకులను ఆర్‌బిఎస్‌ఎస్‌డి-2, మోర్‌ ఎల్లాయీస్‌ వంటి కంపెనీలు దక్కించుకున్నట్టు సమాచారం. గరివిడి మండలం దేవాడ బ్లాక్‌లో తవ్వకాలకు గతేడాది నవంబర్‌ 22న, కొండపాలెం బ్లాక్‌లో తవ్వకాలకు గత నెల 21న అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. జిల్లా అత్యంత వెనుకబడి ఉన్నందున స్టీల్‌, ఫెర్రో ఎల్లాయీస్‌ వంటి పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని, వాటికి స్థానికంగా ఉన్న మాంగనీస్‌ గనులను కేటాయించాలని ఈ గ్రామాల్లోని ప్రజలు, కార్మికులు డిమాండ్‌ చేశారు. నివాసాలకు కేవలం 500 మీటర్ల దూరంలో తవ్వకాలు చేపడితే కాలుష్య సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని అధికారులు చెప్పినప్పటికీ ఆచరణలో అటువంటి చర్యలేవీ కనిపించడం లేదు. తవ్వకాలకు అనుమతులు చకచకా ఇచ్చేస్తున్నారు. దీంతో, ప్రజల్లో ఆందోళన మొదలైంది. మాంగనీస్‌ గనులు ప్రయివేటుపరం కావడంతో ఉపాధి మార్గాలు కనిపించడం లేదు.
 

                                               మాంగనీస్‌ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

అత్యంత విలువైన, నాణ్యమైన మాంగనీస్‌ గనులు నిక్షిప్తమై ఉన్న చీపురుపల్లి నియోజకవర్గంలో స్టీల్‌, ఫెర్రోఎల్లాయీస్‌ తదితర మాంగనీస్‌ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. తద్వారా విజయనగరం జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. వలసలు నివారించవచ్చు. ఇక్కడి విలువైన గనులను ప్రయివేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఈ ప్రాంతం మరింత దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
                                     -అంబళ్ల గౌరినాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి

మాంగనీస్‌ నిక్షిప్తమై ఉన్న గ్రామాలు ఇవే : 
గరివిడి మండలం దేవాడ, కొండపాలెం, కోనూరు, దువ్వాం
చీపురుపల్లి మండలం కర్లాం
మెరకముడిదాం మండలం కొత్త కర్లాం
నెల్లిమర్ల మండలం గరికిపేట, తంగుడుబిల్లి
తెర్లాం మండలం గదబవలస
రాజాం మండలం దార చీపురుపల్లి