''కవిత్వం ప్రేరకశక్తే కానీ, చోదక శక్తి కాదు. కవిత్వంలో పద, భావ చిత్రాలు, ఊహలతో పాటు ఒక తాత్వికమైన సారాంశం ఆవిష్కరించాల. అదే సృజన అంటే ..!'' ఈమాట ఏ కవి అయితే చెప్పాడో, ఈ పదాలను ఏ కవి అయితే అనుకున్నాడో, ఆ కవి రాసిన అన్ని కవితల్ని చదివాక, పరిశీలించాక అతను ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకి కట్టుబడి కవిత్వం రాస్తున్న వ్యక్తిగా నాకు కనిపించాడు.
2006లో కవిత్వ ప్రయాణం మొదలుపెట్టిన ఈ కవి ఈ క్షణం వరకు పుస్తకం తీసుకురాలేదు. ఒకటి, రెండుసార్లు కవిత్వ సంకలనం పేరు ప్రకటించినప్పటికీ ఎందుకో అతను పుస్తకరూపంలో పలకరించలేదు. రూపాయి తలమీద రాజై కూర్చునే మనిషిని అసహ్యించుకుంటాడు. వరద గుడి తాకి, సంబరపడే మనుషుల్ని కోరుకుంటున్నాడు. జీవించడం మర్చిపోయిన మనుషుల సమూహానికి ఓ దారి చూపే కవిత్వం రాస్తున్నాడు. వెన్నెల తోటల వనమాలి కావలసిన మనిషి, వసంత మేఘం కావాల్సిన మనిషి, జనం మనిషి కావాల్సిన మనిషీ, దేహమంతా మట్టి పూలుముకున్న మనిషి కోసం ఆరాటపడుతున్నాడు. మూడు ముక్కల్లో చెప్పాలంటే అతని కవిత్వం రూపాయిని ప్రేమించని మనుషులు చుట్టూ తిరుగుతుంది. మనుషుల్ని ప్రేమించే, మనుషులను గౌరవించే, మనుషుల్ని దీవించే భావనల చుట్టూ అల్లుకుంటుంది. వ్యాపారాన్ని అసహ్యించు కుంటుంది. రైతుని హత్తుకుంటుంది. అతని వాక్యాలు మెలకువ కిరణాలు. చీమలపాటల పల్లవి ఈ కవిత్వం.
2006 మార్చి 12వ తేదీన ఇరాక్ యుద్ధ ఖైదీల విషాదాన్ని 'ప్రతి చర్య' అనే కవిత ద్వారా మొట్టమొదటిగా ఆవిష్కరించాడు. అయితే అప్పటివరకు అతని లోపల అనేక సంఘర్షణలు ఉండి ఉండొచ్చు. అతను ఇదివరకు చదివిన సాహిత్యం అతన్ని కదిలిస్తూ ఉంటుంది. ఆ కదలికలో నుంచి, ఆ చలనాల నుంచి ఈ కవి విస్పోటనం చెందాడు. 2007లో వస్తు వినిమయ సంస్క ృతి మీద అతను రాసిన 'మాయ' అనే కవిత చాలా ప్రసిద్ధి పొందింది. ప్రపంచీకరణ, దాని పర్యవసనాలు మీద ఏ సదస్సు జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా ఈ కవితని కచ్చితంగా ఉటంకించాల్సిందే!
''అందాల పోటీలు నిర్వహించబడతాయి
ఒక ఆసియా సుందరి కిరీటం ధరిస్తుంది
నా దేశ సంపద ఏడేడు సముద్రాలు దాటుతుంది
క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించబడతాయి
ఒక పొట్టివాడో, పొడుగువాడో
సెంచరీ కొడతాడు
నా దేశ సంపద ఏడేడు సముద్రాలు దాటుతుంది
మెగా బంగారం
మీకోసం క్విజ్‌లు నిర్వహించబడతాయి
ఒక ఆరేళ్ల పాప అసాధారణ ప్రతిభ ప్రదర్శిస్తుంది
నా దేశ సంపద ఏడేడు సముద్రాలు దాటుతుంది
అంతటా మాటల మాయ
ఒక ఖరీదు భాష
వినోద దృశ్యాల వెనక విస్తరించిన మోసం
వినియోగ సంస్క ృతి వెనక విలువల విధ్వంసం
మనిషి వస్తువు కింద పడి మరణించాడు ...''
ఇవాళ వస్తు వ్యామోహం ఏ స్థాయికి వెళ్ళిందో, వస్తు వ్యామోహాన్ని బహుళ జాతి సంస్థలు ఎలా ఉపయోగించుకుని ప్రపంచాన్ని శాసిస్తున్నాయో- ఈ 14 వాక్యాల ద్వారా ఈ కవి అసాధారణమైన ముగింపుతో ఒక విస్మయానికి గురి చేస్తాడు.
స్వానుభవం నుంచి సార్వజనీన అనుభవంగా మార్చగలడం, అన్వేషణ నుంచి వాక్యాలను పట్టుకోవడం, కవిత్వం పట్ల విధేయత కలిగి ఉండడం ఈ లక్షణాలు ఈ కవిలో కనిపిస్తాయి. కవిత, కవితో రహస్యం మాట్లాడుతుంది. అది కవి వినాలి. సంభాషించాలి. ఆ మాటల్లోంచి పుట్టిన కవిత పాఠకుడిని కవిత్వంలో పడేస్తుంది. ప్రేమించేలా చేస్తుంది .కవిత్వం, కవి, పాఠకుడు ఈ మూడు ఒక త్రిభుజం.
పాత మూసలను బద్దలు కొట్టడం, చైతన్యపూరిత ఆలోచనలు కలిగి ఉండడం, అక్షరాలను మట్టి ముద్దలుగా చేసి కొత్త బొమ్మలు తయారు చేయగలగడం ... ఇవన్నీ కవిత్వ మాధ్యమాన్ని సృష్టిస్తాయి. కవిత్వ మాధ్యమం ద్వారా కవి పాఠకుడితో మాట్లాడగలగాలి. ఆ మాధ్యమాన్ని కొనసాగించగలగాలి. వస్తువుకి అవసరమైన భాష, కవిత్వ లయను ధ్వంసం చేయని వ్యర్థపదాలు కవిత్వ మాధ్యమంలో భాగంగా ఉంటాయి.
ఈ కవికి మనిషి పట్ల విపరీతమైన ప్రేమ. మానవ సంబంధాల పట్ల గొప్ప ఆరాధన. ఆసరాగా ఉన్న మనిషి దేహం దేవుడు కంటే గొప్పది అని తీర్మానిస్తాడు. కరోనా కాలంలో రాసిన ఓ కవితలో ...
''విషక్రిమిని యుద్ధ క్రిమిని
జయించే
మానవుడే మహౌన్నత జీవి
అతడు భూగోళం చుట్టూ అల్లుకున్న
రెండు చేతుల పూల తీగ
ఆమె వెన్నెల విడిచిన శాంతి చంద్రిక..'' (ఆయుధం లేని - పాలపిట్ట, ఏప్రిల్ -20,)
అతను రాసిన 'మమేకం' కవిత అతని కవిత్వానికి కేంద్రకంగా అనిపిస్తుంది. తన కవిత్వం ద్వారా ఈ కవి ఏర్పరచుకున్న లక్ష్యాలు, స్పష్టీకరణలు మనకు ఈ కవితలో దొరుకుతాయి. మనిషికి పువ్వు లక్షణం ఉండాలని చెప్తాడు. బీడు భూముల్ని చిరునవ్వించాలని పిలుపు ఇస్తాడు. జీవితంలో కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు ఉంటాయి. పశ్చాత్తాపపడాల్సిన తొందరపాట్లు ఉంటాయి. ఒక దయ నుంచి, ఒక క్షమ నుంచి హృదయాలు ఉన్నత స్థితికి చేరతాయని ఆకాంక్షిస్తాడు. ఈ కవితలోనే కుర్చీలన్నీ ఒకటే జాతి అని నిర్ధారిస్తాడు. మనిషి కలవడం కోసమే పుట్టాలని, విడిపోవడం పెద్ద సంగతి ఏమీ కాదని తేల్చి చెప్తాడు. మనిషికి మనిషి దూరం కావడం భారీ తప్పిదమని, ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక సముదాయంగా గుర్తించాలని, సామాజిక గమన సూత్రాలకు ఉదాహరణగా ఇతని కవిత్వం నిలుస్తుంది.
మనిషి బతుకంటేనే విడిపోయిన దేహాలు, హృదయాలు హృదయాలై కలిసిపోవడమే అని 'మనం' అనే కవిత ద్వారా తెలుపుతాడు. ఆ కవిత ముగింపు ఇలా ఉంటుంది.
''అంత తేలిగ్గా మనిషిని వదిలి పోతే ఎట్లా
ఒక దయామయి
ద్వేషరాహిత్య ప్రపంచంలో
మనుషులు ప్రేమ పూలై
గుబాళించకపోతే ఎట్లా
అనుమానపు చీకటికి
సందేహ కిరణాలకి భేదం
ఎరక్కపోతే ఎట్లా
మనిషి అంటేనే మరో మనిషిని వెతుక్కోవటం
వెళ్ళిపోతున్న మనిషిని వెనక్కి పిలవటం''
(కవిత్వం-2018)
అలాగే లోయలోకి, మనుషుల మధ్య, పునర్జీవం, ఖండిత మానవుడు, ఆసరా ... ఇలా అనేక కవితల్లో మానవత్వం, మానవ సంబంధాల పట్ల గొప్ప భావన కనిపిస్తోంది.
ఈ కవిత్వం మొత్తంలో సున్నిత విషయాల పట్ల చలించిపోవడం, సామాన్యుల జీవితాల సంవేదనలను అక్షరీకరించడం గమనించవచ్చు. అంతర్లోకంతో కూడిన ఉద్వేగం, రాజ్యం స్వభావాన్ని, పాలక గణం గుణాల్ని ప్రశ్నించడం లాంటి అవగాహన నుంచి అతను కవిత్వాన్ని నిర్మిస్తున్నాడు. కవితా భావ ప్రసారాన్ని భగం చేసే అన్వయ రాహిత్యం ఈ కవిత్వంలో ఎక్కడా కనపడదు. తాను ఎంచుకున్న వస్తువు పట్ల స్పష్టమైన చూపు, చెబుతున్న వాక్యాల పట్ల నిజాయితీతో కూడిన దక్పథం, కవిత్వ నిర్మాణం పట్ల ఎరుక మనల్ని ఈ కవిత్వం వైపు నడిపిస్తాయి.
ఇతను కవిత్వంలో మరొక అంశం అన్నం పెట్టే రైతుని, ఆ రైతు జీవితాన్ని చిత్రీకరించడం. ఆ రైతు కేంద్రంగా రాసిన కవిత్వంలో అతను వాడిన పదాలు, కవిత్వ వాతావరణం చాలా సహజంగా మనని అల్లుకుంటుంది. మద్దతు, రైతు, గట్టెక్కని మనిషి, ఉసురు, కళాకారుడు, వెన్ను విరిగిన చప్పుడు మొదలైన కవితల్లో అన్నం ముద్దని ఆలింగనం చేసుకున్నాడు. రైతే రాజు మిక్కిలి మోసపూరితమైన శీర్షిక అని, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య అనే వాక్యం అతి చెడ్డ వాక్యం అని ప్రకటిస్తాడు.
ఈ కవికి ఉన్న గొప్ప బలం తీవ్రమైన అధ్యయనం. అధ్యయనం ఉన్న కవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాడు. ఆ తెలుసుకున్నతనం మనకు కనిపిస్తూ ఉంటుంది. పఠనానుభవం ఉన్న కవి రాసిన వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. పఠనానుభవంలేని కవి డొల్లతనం అతని వాక్యంలో తెలిసిపోతుంది. కవి దర్శనం, అతని పరిభాష కవిత్వ ఔన్నత్యానికి దారి చూపుతుంది.
'ఖండిత మానవుడు' చాలా గొప్ప కవిత. మానవ జీవిత తాత్వికత, మానవ సంబంధాలు, పతనమైన మనిషి గురించి ఈ కవిత సాగుతుంది. రెండు పాదాలు రెండు నేత్రాలు కావడం, కదిలే కొవ్వు కండ, సోమరి సర్పం, చాకిరిపిట్ట, ప్రశంసల గింజలు లాంటి పదబంధాలు కూడా ఈ కవిత్వంలో గమనించవచ్చు. మనిషి ఆనంద నిలయమైన త్యాగధనుడు, ప్రపంచానికి ప్రథమ మిత్రుడు అని ప్రగాఢంగా నమ్మిన కవి నన్నపనేని రవి. ఈ కవి ఫేస్బుక్ వాల్ మీద, విజయవాడ సాహితీ మిత్రులు ప్రచురించిన కవితా వార్షికల్లోనూ 80 వరకు కవితలు దొరుకుతున్నాయి. మానవ వేదన, భావుకత, సాంద్రత కలిగిన కవి రవి. వాడిన కొమ్మల మీద పూలను పూజించే వాక్యాలు రాశాడు. దప్పికగొన్న దేహం మీద నాలుగు భరోసా చినుకులు కురిపిస్తున్నాడు. సెవెంత్ కలర్ కవిత్వాన్ని అందించాడు.
''రాయడం ఒక పని
రాయడం ఒక బీజం
నూరు విత్తనాలవ్వడం
గింజలు వెతుక్కుంటూ
గూట్లో పెట్ట గగనంలోకి లేవడం
చీమలు పూడిపోయిన పుట్టని
మళ్లీ తొవ్వుకోవడం ..''
(ప్రక్రియ-15.10.2020)
అవును.. రాయడం చాలా ప్రేమ. అది ప్రపంచాన్ని ప్రేమించే ప్రక్రియ. రాయడం ఒక కళ. ఒక ఎడతెగని ప్రయాణం అని ప్రకటించుకున్న నన్నపనేని రవి కవిత్వ సంపుటి కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.
- డాక్టర్ సుంకర గోపాలయ్య
94926 38547










