
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో మతపరమైన హింసకు గురై దేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించాలని కోరుతూ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన 220 పిటిషన్లను అక్టోబరు 31న విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు సోమవారం తెలిపింది. ఈ అంశాన్ని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎస్‌ఆర్ భట్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్, జైన్, పార్సీకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన 2019 సవరించిన చట్టం ప్రతిపక్ష పార్టీలు, నాయకులు, ఇతర వ్యక్తుల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది. ముస్లిములను మినహాయించడంపై అందరూ విమర్శలు గుప్పించారు. విచారణ సందర్భంగా సోమవారం కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లలో పలు అంశాలు లేవనెత్తినట్లు తెలిపారు. 'కొన్ని సవరణలు, సవాలుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇప్పటికే దాఖలు చేయబడింది. కొన్ని విషయాల్లో ఇంకా దాఖలు చేయాల్సి ఉంది' అని అన్నారు. సమాధానం తయారు చేసేందకు కొంత సమయం అవసరమని, అలాగే విచారణకు కూడా కొంత సమయం అవసరమని అన్నారు.సొలిసిటర్ జనరల్ కార్యాలయం పిటిషన్లలో లేవనెత్తిన సవాల్‌ను బట్టి వివిధ విభాగాల్లో ఉంచే విషయాల పూర్తి జాబితాను సిద్ధం చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. 'ఈ సవాళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తగిన సమాధానాన్ని దాఖలు చేయాలి. నాలుగు వారాల్లోగా అవసరమైన వాటిని పూర్తి చేయాలి' అని ఆదేశించింది. 2020 జనవరి 22న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు తమ దృష్టికి వచ్చాయని, దీని ఆధారం గా అస్సాం, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే అంశాలను వేరు చేయాలని ఇప్పటికే ఆదేశించామని ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు ఇప్పటి వరకు నోటీసులు జారీ చేయని అందరికీ నోటీసులు చేసింది. ఈ కేసులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఇవి చాలా ముఖ్యమైన అంశాలని, వాటిని త్వరగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.