Jul 14,2023 08:19

పట్టణీకరణ నేపధ్యంలో మిద్దెతోటల పెంపకం ఒక మంచి వ్యాపకంగా మారుతోంది. తమ ఇళ్లపైనే రసాయనాలు లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవటం ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తోంది. పెంపకందారులకు ఇది చక్కని వ్యాయామం, మంచి అభిరుచి అవుతుంది. నేడు చాలా పట్టణాలు, నగరాల్లో మిద్దెలపై సాగు బహు బాగుగా సాగుతోంది. విజయవాడలో మిద్దె సాగు ప్రోత్సాహానికి 'ఒన్‌ ఎర్త్‌.. ఒన్‌ లైఫ్‌' టెర్రాస్‌ గార్డెన్‌ గ్రూపుకృషి చేస్తోంది.

           ఇంట్లో కిచెన్‌లో కూరగాయల వచ్చే వేస్ట్‌, ఎండిన ఆకులు, పశువుల ఎరువులను కంపోస్ట్‌గా వినియోగించటం ద్వారా మిద్దె సాగు నేడు ట్రెండింగ్‌గా మారింది. పట్టణీకరణ పచ్చని ప్రకృతిని మింగేస్తున్న క్రమంలో మళ్లీ ప్రకృతితో మమేకం కావడానికి మిద్దె తోటలు ఒక ప్రేరణగా నిలిచాయి. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, తిరుపతి వంటి పట్టణాల్లో కొందరు పర్యావరణ శ్రేయోభిలాషులు ఇలాంటి మిద్దెతోటలు (ఇంటి పంటలు) పండిస్తూ తమ కుటుంబ ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారు.
 

                                                                   'ఒన్‌ ఎర్త్‌.. ఒన్‌ లైఫ్‌'తో ప్రేరణ

విజయవాడకు చెందిన ఏలూరి లీలాకుమారి, పెనుమత్స శ్యామ్‌ప్రసాద్‌, అరకపూడి సురేష్‌కుమార్‌, వెలగా విజరు, పరుచూరి రవి ప్రకాష్‌ 'ఒన్‌ ఎర్త్‌..ఒన్‌ లైఫ్‌' పేరుతో టెర్రాస్‌ గార్డెన్‌ సంస్థను ఏర్పాటు చేశారు. వీరే అడ్మిన్లుగా ఉండి ఒక వాట్సాఫ్‌ గ్రూపు నిర్వహిస్తున్నారు. రెండు నెలల క్రితం ఐదుగురితో ప్రారంభమైన ఈ గ్రూపు ఇప్పుడు 500 మంది సభ్యులకు చేరుకుంది. సేంద్రియ ఎరువులను వినియోగించటం ద్వారా అతి తక్కువ ఖర్చుతో తమ మిద్దెలపై సాగు చేసిన విషయాలు, ఫొటోలు, వీడియోలను గ్రూపులో షేర్‌ చేస్తున్నారు. తద్వారా ప్రేరణ పొందిన మరికొందరు మిద్దె సాగును ఆచరిస్తూ తమ మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నారు. తమ ఇంటి మిద్దెపై వంగ, బెండ, బీర, సొర, దోస, మిర్చి, పసుపు, పొట్లకాయలు, ఆకుకూరలు, పండ్లు సైతం పెంచేస్తున్నారు. వారానికి కనీసం నాలుగు రోజులైనా ఇంటి పంటతో కూరలు వండుకోవొచ్చని ఒన్‌ ఎర్త్‌.. ఒన్‌ లైఫ్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

11

                                                                   ప్రజారోగ్య పరిరక్షణకు అడుగులు

సొంత లాభం కొంతమానుకు... పొరుగు వారికి తోడు పడవోరు అన్న గురజాడ మాటలను ఆదర్శంగా తీసుకున్నారు 'ఒన్‌ ఎర్త్‌... ఒన్‌ లైఫ్‌' ప్రతినిధులు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన సంరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా ముందుకు సాగుతున్నారు. తమ ఇంటి అవసరాలకు సరిపడే ఆకుకూరలను, కూరగాయలను తమ మేడ మీదనే పండిస్తున్నారు. మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటినీ ప్రకతి ఎరువుల ద్వారానే అందిస్తున్నారు. అందరికీ ఆరోగ్యం అది ఇంటి నుండే సాధ్యం అని నిరూపిస్తున్నారు.
 

                                                                ఖర్చుతక్కువ... ఆరోగ్యం ఎక్కువ

బియ్యం బ్యాగులు, వాడేసిన పెయింట్‌ డబ్బాలు, వాటర్‌ బాటిళ్లు, పాడైన బకెట్లు, ప్లాస్టిక్‌ సంచులు, గ్రోబ్యాగులలో మొక్కలు సాగుచేస్తున్నారు. విత్తనాలకు తప్ప మరే దానికి పెద్దగా ఖర్చు పెట్టడంలేదంటున్నారు ఏలూరి లీలాకుమారి. మిద్దె తోటను సాగు చేయాలనుకునే వారు తొందరపడి అధికంగా ఖర్చు పెట్టి ఒకేసారి మొక్కలన్నింటిని పెంచడం కంటే మొదట తక్కువ ఖర్చుతో ఆకుకూరలతో సాగు ప్రారంభించి ఆ తరువాత మొక్కలపై అవగాహన పెంచుకుని నెమ్మదిగా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచిస్తున్నారు. మేడ మీద ఉన్న అతి తక్కువ స్థలాన్ని సద్వినియోగ పరుచుకుంటున్నారు ఆమె. తీగజాతి కూరగాయల సాగు కోసం పందిర్లను కూడా నిర్మించారు. కుండీల్లో స్థలం వథా కాకుండా అంతర పంటలను సైతం సాగు చేస్తున్నారు.
                                - యడవల్లి శ్రీనివాసరావు

223

                                                                 కాలుష్య రహిత సమాజానికి దోహదం

పర్యావరణ పరిరక్షణలో మిద్దె సాగుతో కూడా ఎంతో మేలు జరుగుతుంది. మిద్దె తోటలతో చెట్లు అంతరించిపోకుండా చూడొచ్చు. పక్షిజాతులను కాపాడొచ్చు. వాతావరణం పచ్చదనంతో ఆహ్లాదకరంగా, పక్షుల కిలకిలారావాలతో ఉల్లాసంగా వుంటుంది. కాలుష్యానికి దూరంగా, స్వచ్ఛమైన గాలికి దగ్గరగా జీవించొచ్చు.
                      - వెలగా విజయ్

33

                                                                             జీవవైవిధ్యానికి దోహదం

మిద్దెతోటలు మళ్లీ మట్టితో అనుబంధాన్ని పెంచుతున్నాయి. పక్షులు, తేనెటీగలు, ఇతర పరాగ సంపర్కాలకు ఆవాసాలుగా మారడంతో పాటు జీవవైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ పద్ధతిలో ఆకుకూరలు, కాయగూరలు, పూలు, పండ్లు సైతం పండించొచ్చు.
                                                                                                           - అరకపూడి సురేష్‌కుమార్‌

44

                                                                          ఆరోగ్యానికి పూదోట

కూరగాయలను మనమే సేంద్రియ పద్ధతిలో పండించుకుని తినడంలో ఎంతో సంతృప్తి ఉంది. రసాయనిక ఎరువుల వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వివిధ ప్రకృతి వైపరీత్యాలు, కృత్రిమ మార్కెట్‌ కొరత, విపపరీతమైన డిమాండ్‌ వంటి సందర్భాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంట్లో సాగు చేయడం వల్ల ఆ భారం మనపై పడదు. మిద్దె తోటల వల్ల భవనాల పైకప్పు జీవిత కాలం కూడా పెరుగుతుంది. మిద్దెతోటల పెంపకంతో శరీరానికి మంచి వ్యాయామం కూడా దక్కుతుంది. ఆరోగ్యకరమైన ఈ వ్యాపకం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
                     - ఏలూరి లీలాకుమారి

55

                                                                             కాలుష్యం నుంచి రక్షణ

మిద్దెతోటల సాగు ద్వారా వారంలో కనీసం నాలుగు రోజులైనా ఇంటి కూరలతో వంట చేసుకుని తినొచ్చు. తద్వారా మార్కెట్లోకి కల్తీ, అనారోగ్య పరిస్థితుల నుంచి కాపాడుకోవచ్చు. పూర్వకాలంలో మాదిరిగా కూరగాయలను ఇచ్చి పుచ్చుకుంటే ఇంటి కూరకూరలకు కొదవ ఉండదు. ఇంట్లో కూరగాయలు, ఇతర వేస్టు మెటీరియల్‌ను కంపోస్ట్‌ ఎరువుగా వినియోగిస్తే మొక్కలు ఏపుగా పెరిగి, మంచి దిగుబడిని ఇస్తాయి.
                                                                                                                                   - పెనుమత్స శ్యామ్‌ప్రసాద్‌

 

77

                                                                       ఇంటి పంటను నిల్వచేసుకోవచ్చు

మిద్దెతోటల సాగు ద్వారా వచ్చే ఆకుకూరలు, కూరగాయలు చాలారోజులు నిల్వవుంటాయి. అదే రసాయనాలు పిచికారీ చేసినవి అయితే, త్వరగా పాడైపోతాయి. వేస్ట్‌ మెటీరియల్‌ను కంపోస్ట్‌గా మార్చి ఎరువుగా వినియోగించటం ద్వారా చెత్త సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కార్పొరేషన్‌కు చెత్త సమస్యలు తగ్గుతాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ సమస్యల నుంచి బయట పడటానికి ఇంటిపంట దోహదం చేస్తుంది..
                                                                                                                              - పరుచూరి రవిప్రకాష్‌