Oct 10,2023 09:30
  • నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఆరోగ్యమే మహాభాగ్యం అని అప్పట్లో పెద్దలు అనేవారు..కానీ ప్రస్తుత రోజుల్లో మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కొందరు మానసిక వైద్య నిపుణులు. అప్పటి కాలాన్ని అన్వయించుకొని పెద్దలు చెప్పిన మాట వాస్తమే కానీ. ఇప్పటి పరిస్థితులు అర్థం చేసుకుని మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మానసిక ఆరోగ్యంపై ఆహారం, నిద్ర, హార్మోన్లు, సమాజం, శరీరం, కుటుంబం, వంశానుగతం, వ్యాయామం తదితర అంశాలు ప్రభావితం చేస్తాయంటున్నారు విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ సార్వత్రిక ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌, మానసిక వైద్య నిపుణులు వి.రాధికారెడ్డి. ఒత్తిడులను జయిస్తేనే ఆరోగ్యంగా ఉండొచ్చునని ఆమె సూచిస్తున్నారు. అక్టోబర్‌ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజాశక్తికి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే...

12

             ఏటేటా అక్టోబర్‌ 4 నుంచి 10వ తేదీ వరకూ ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుహెచ్‌ఒ) ఈ ఏడాది (2023)ని 'మానసిక ఆరోగ్యం ప్రజలందరి హక్కు'గా ఉండాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక విభిన్నమైన శైలి వుంటుంది. ఏ ఒక్కరి ప్రవర్తన, పనులు ఇంకొకరిమాదిరిగా ఉండవు. ఎవరి ప్రత్యేకత వారిదే. విదేశాల్లో పోలిస్తే మనదేశంలో ఇంకా మానసిక ఆరోగ్యంపై ఇంకా శ్రద్ధ పెరగటం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు 75 నుంచి 95 శాతం మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పరిస్థితి ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మానసిక ఆరోగ్య చికిత్సల్లో అంతరానికి కారణం సాధారణంగా ప్రజల్లో కూడా అవగాహన లేకపోవటమే. మానసిక సమస్యలు ఉండటం ఏదో ఒక లోపంగా భావించటం వల్ల బయటపడటానికి, చెప్పుకోవటానికి ఎవరైనా సమస్యలు ఉన్నా ముందుకు రావటంలేదు.
 

                                                                      అపోహలు..మూఢనమ్మకాలు

గ్రామీణ ప్రాంతాలతోపాటుగా నేటికీ పట్టణ ప్రాంతాల్లో కూడా మూఢనమ్మకాల ప్రభావం ఇంకా అధికంగానే ఉంటోంది. మానసిక సమస్యలపై అనేక అపోహలు ఉంటున్నాయి. సాధారణంగా జ్వరం, జలుబు, గుండె జబ్బులు, ఇతరత్రా సమస్యలు వస్తే వాటిని గుర్తించి నియంత్రించొచ్చు. కానీ మెదడు (బ్రెయిన్‌)లో వచ్చే మానసిక సమస్యలను తెలుసుకోవటం, గుర్తించటం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడేవారు మానసికంగా ఇబ్బందులకు గురౌతారు. సాధారణస్థాయి (నార్మల్‌) నుంచి అసాధారణ (అబ్‌నార్మల్‌)స్థాయికు ప్రవర్తనలో తేడాలు వస్తాయి. లావుగా ఉన్నామని, పెళ్లికాకపోవటం, పిల్లలు పుట్టకపోవటం, ఉద్యోగం రాకపోవటం, ఆశించిన మార్కులు రాలేదనీ, ర్యాంకు సాధించలేకపోయాననే బాధతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుందన్నారు. బయట ప్రపంచం తెలియనీయకుండా పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయటం, ఆటపాటల్లో కూడా పాల్గొనే అవకాశం కూడా లేకుండా చేయటం కూడా ఒత్తిడిని పెంచటమే అవుతుంది. ఏ వయస్సు వారైనా ఇలా ఒత్తిడి తీవ్రతలు పెరిగిపోతే డిప్రెషన్‌కు గురౌతారు. మరికొందరు ఉన్మాదులుగా మారిపోయి ఎదుటివారిని చంపేస్తుండటం, గాయపరుస్తుండటం, పిచ్చిగా ప్రవర్తించటం, దాడులు చేయటం, దుర్మార్గపు పూరితంగా వ్యవహరించటం వంటివి కూడా చేస్తుంటారు. ఈజీమనీ, క్రెడిట్‌కార్డులు (ఇఎంఐలు), సామాజిక మాధ్యమాలకు పూర్తిగా అలవాటుపడిపోవటం (ఎడిక్ట్‌) వంటివి కూడా కారణాలుగా ఉంటున్నాయి.

23

                                                                    ఆధునిక జీవనశైలితోనే ఒత్తిళ్లు

ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితాలను గడుపుతున్నారు. ప్రశాంత జీవనానికి దూరమవుతున్నారు. ఏదో ఒక గంట సమయం ఖాళీ దొరికితే ఇతర విషయాలపై వ్యాపకం పెడుతుండటంతో నిద్ర లేమి పెరిగిపోతోంది. ప్రని ప్రదేశంలోనూ, ఉద్యోగంలోనూ, వృత్తి పరమైన అంశాల్లోనూ ఎవరుగొప్ప అనే దానికి బదులుగా సమభావంతోనూ, పరసర్ప సహకారంతోనూ పనిచేస్తే ఒత్తిడులకు చాలావరకూ దూరంగా ఉండొచ్చు. అభద్రతాభావంతో కాకుండా సహృద్భావంతో పనిచేస్తుండటం వల్ల కూడా ప్రశాంతంగా విధి నిర్వహణలను పూర్తిచేయొచ్చు. మానసిక రోగం పేరు చెప్పే చాలు మనందరికీ భయం. మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేకపోడం ద్వారానే రుగ్మతలు వస్తాయి. కష్ట సమయంలో కృంగిపోకుండా ఉండగలిగితే మెదడు సక్రమంగా పనిచేస్తుంది. కెమికల్స్‌, హార్మోన్ల ప్రయాణాలు సరిగా జరగాలన్నా, ఆరోగ్య సమస్యలు సమసిపోవాలన్నా మెదడుకు తగినంత విశ్రాంతి అవసరం. మెదడులో రసాయన మార్పులు కలగటం, బాధాకరమైన బాల్య అనుభవాలు, కుటుంబ వాతావరణం, లైంగిక పరమైన కారణాలు, నిరుద్యోగం, అసమానతలు, ఆర్థికంగా నష్టపోయి కొంతమంది, కుటుంబ కలహాలవల్ల కొందరు, అనారోగ్య సమస్యల వల్ల కొందరు మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఇవన్నీ మానసిక వ్యాధులకు దారి తీస్తున్నాయి.
 

వ్యాధి లక్షణాలివే..
రోగుల ప్రవర్తనలో భారీగా మార్పులు సంభవిస్తాయి
సాధారణ ప్రవృత్తిని దాటి మరీ ఎక్కువగా మాట్లాడటం లేదా మౌనం పాటించటం
ఎల్లప్పుడూ అనుమానాలు వ్యక్తపర్చటం
గొప్పలు చెప్పుకోవడం
భ్రాంతులకు గురికావటం
కన్పించని వాటిని కన్పిస్తున్నాయని, వినిపించని మాటాలను వినిపిస్తున్నాయని భ్రాంతికి గురవ్వటం
నిద్రలో మార్పులు రావచ్చు
నిద్ర సక్రమంగా లేకపోవటం లేదా ఎక్కువగా నిద్రించటం
రోగికి ఆకలి ఉండకపోవచ్చు
అతిగా భోజనం చేయొచ్చు
జ్ఞాపకశక్తిలో కూడా మార్పులు
తదితర లక్షణాలు వీరిలో ప్రధానంగా కన్పిస్తాయి.
 

                                                                    పాటించాల్సిన జాగ్రత్తలివే...

సరిపడినంత నిద్రపోవటం
క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేయటం
మానసిక ప్రశాంతతకు యోగా చేయటం
కుటుంబం, స్నేహితులతో మంచి సంబంధాలతో ఉండటం
ఒత్తిడికి దూరంగా ఉండటం
కృంగుబాటు నుంచి బయటపడేందుకు ప్రయత్నించడం
ప్రతి చిన్న విషయానికీ భయపడకుండా ఉండటం
 

                                                                             చికిత్సా విధానాలు

మానసిక సమస్యకు సకాలంలో పరిష్కారం పొందాలి. అవసరమైతే చికిత్స చేయించుకోవాలి. లేదంటే నిద్రలేక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒత్తిడికి దూరం కావాలి. ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవాలి. వ్యాయామం, యోగా చేయటం అలవాటు చేసుకోవాలి. మందులు, కరెంట్‌ చికిత్స (షాక్‌ట్రీట్‌మెంట్‌), సైకో థెరపీ, రిహాబిలేషన్‌ విధానాల ద్వారా నయం చేయొచ్చు.

మానసిక వ్యాధులివే...

డిప్రెషన్‌
యాంగ్జయిటీ
యాంగ్జయిటీ న్యూరోసిస్‌
బైపోలార్‌ డిజార్డర్‌
పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌
కాండక్ట్‌ డిజార్డర్‌
ఫోబియా
మానియా
స్కిజోఫ్రీనియా
డిల్యూషనల్‌ డిజార్డర్‌
స్లీవ్‌ డిజార్డర్‌ (ఇన్‌సోమ్నియా)
ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌
సుపీరియారిటీకాంప్లెక్స్‌
ఇల్యూషన్‌
ఆడిక్షన్‌
ఆటిజం
ఎడిహెచ్‌డి (పిల్లల్లో)

- ఇంటర్వ్యూ : యడవల్లి శ్రీనివాసరావు