పక్షుల కిలకిలరావాలతో.. పిల్లల ఆటపాటలతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదంగా ఉంది. అక్కడే ఓ పెద్దాయన మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాడు. రంగు రంగుల పూలతో సువాసనలు వెదజల్లుతున్న ఓ పూలమొక్క పక్కన అప్పుడే భూమిని చీల్చుకుని వస్తున్న లేత మొక్కలకు నీళ్లు పోస్తూ.. ఆ పెద్దాయన కాసేపు మౌనంగా నిలబడ్డాడు. ఎందుకంటే అక్కడ అతని పెద్ద కొడుకును సమాధి ఉంది. అది పార్కో, తోటో కాదు; నందనవనం లాంటి శ్మశానవాటిక. తమిళనాడు కడలూరుకు సమీపంలో థిట్టకూడిని ఆనుకుని ఉన్న అరంగర్ గ్రామంలో ఉందా శ్మశానం. ఆ నీళ్లు పోసే పెద్దాయన 70 ఏళ్ల అర్జునన్. ముళ్ల కంపలతో, చెత్త చెదారంతో భీతిల్లే వాతావరణంతో ఉండే ఆ శ్మశానాన్ని అతడే నందనవనంలా మార్చాడు.

అర ఎకరా విస్తీర్ణంలో ఉన్న ఆ శ్మశాన వాటిక షెడ్యూల్ వర్గానికి చెందినది. చుట్టుపక్కల ఉన్న రెండు సెటిల్‌మెంట్లకు చెందిన 500 కుటుంబాల చివరి మజిలీ అది. అదే ప్రాంతానికి చెందిన అర్జునన్ పెద్ద కొడుకు 1990లో చనిపోయాడు. కొడుకు మృతి నుండి కోలుకోలేక రోజూ అక్కడికి వెళ్లి వచ్చేవాడు. కొన్నేళ్లపాటు అలా వెళ్లాడు. 'దట్టమైన ముళ్ల కంపలతో ఉన్న ఆ ప్రాంతంలో ముళ్లు గుచ్చుకోకుండా ఏ ఒక్క రోజూ వెళ్లలేదు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. 2007లో అతడికి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే అది అంత తేలికైన విషయం కాదు. పంచాయతీ పెద్దలతో పాటు నా కుటుంబం ఆమోదం పొందడం చాలా కష్టమైంది' అంటున్న అర్జునన్ ఆ తరువాత ఐదేళ్లపాటు పూర్తిగా శ్మశానానికే అంకితమయ్యాడు. దాన్ని శుభ్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీనికోసం అతనేమీ ప్రతిఫలం ఆశించలేదు. స్వచ్ఛంద సేవ చేశాడు. సొంతంగా ఖర్చు పెట్టాడు. శ్మశానం చుట్టూ కొబ్బరిచెట్లు, మామిడి చెట్లు, జామ, నిమ్మ, కొలంజి, సీతాఫలం, సపోటా, ఉసిరి వంటి పండ్ల చెట్లు, టేకు, ఎర్రచందనం, జామాయిల్ వంటి కలప మొక్కలను నాటాడు.
ఇన్నేళ్లలో వేల అరటిచెట్లను సాగు చేశాడు. వీటితో పాటు పూల మొక్కలను పెంచాడు. మూలికా మొక్కలను నాటాడు. 2012 నాటికి కొబ్బరి మొక్కలు కాపుకు వచ్చాయి. అప్పుడు ఊరందరికీ అక్కడ విందు భోజనం పెట్టాడు.
కుటుంబం దూరం పెట్టినా..
ఉద్యానవనంలా మారిన శ్మశానాన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అర్జునన్ నిస్వార్ధ సేవకు ప్రతిఫలంగా అతనిని సముచితంగా గౌరవించి సత్కరించారు. విందుకు హాజరైన గ్రామపెద్దలకు ఆ రోజు శ్మశాన బాధ్యతలను అప్పగించి బతుకుతెరువు కోసం పని వెతుక్కుంటూ కేరళ వెళ్లిపోయాడు అర్జునన్. కొన్ని నెలల తరువాత తిరిగివచ్చిన అతడికి ఆ శ్మశానం మళ్లీ యథాస్థితిలో కనబడింది. పూలమొక్కలు ఎండిపోయి, విచ్చలవిడిగా పిచ్చిమొక్కలు పెరిగి కనిపించాయి. ఎంతో అందంగా సిద్ధం చేసిన ప్రాంతాన్ని మళ్లీ అలా చూసేసరికి అర్జునన్ తట్టుకోలేకపోయాడు. చేస్తున్న పనికి స్వస్తి చెప్పి శ్మశాన పనిలోనే నిమగమవ్వాలనుకున్నాడు. అయితే ఈసారి అతని నిర్ణయాన్ని కుటుంబం వ్యతిరేకించింది. ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో కుటుంబం నుండి దూరంగా వచ్చేసి శ్మశానానికి దగ్గరగా ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
ఉద్యానవనంలా..
రోజూవారీ ఖర్చుల కోసం అడపాదడపా కూలిపనులకెళ్తూ మిగిలిన సమయమంతా శ్మశాన పనులకే కేటాయిస్తున్నాడు. 'నేను ఈ ప్రాంతంలో కూరగాయలు కూడా పండిస్తున్నాను. గ్రామస్తులు ఏ అభ్యంతరం లేకుండా వీటిని తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ పండిన పండ్లను దేవాలయానికి, ఇతర ఉత్సవాలకు ఇస్తుంటాను' అని చెబుతున్న అర్జునన్ కృషికి ఫలితంగా ఆ శ్మశానం క్రమంగా ఓ ఉద్యానవనంగా మారిపోయింది. పిల్లలు ఆ ప్రాంతాన్ని పార్కులా వినియోగిస్తున్నారు. స్కూలు ముగిసిన తరువాత అక్కడి చెట్ల కింద ఆడుకుంటున్నారు. కొంతమంది స్కూలు పిల్లలు వారాంతాల్లో బృందాలు బృందాలుగా వచ్చి అక్కడే వండుకుని తింటుంటారు. ఇటీవలె అర్జునన్ చేస్తున్న ఈ సేవను గుర్తించిన అధికారులు అతనిని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో రాష్ట్ర నలుమూలల నుండి ఆ శ్మశాన ఉద్యానవనాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. వయసు మీదపడుతున్నా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా అర్జునన్ చేస్తున్న సేవలో తమవంతుగా భాగమయ్యేందుకు ఇప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అతనితో చేయి కలుపుతున్నారు.










