Mar 27,2023 07:53

అద్దంతో మొరపెట్టుకున్నా
తను వచ్చినపుడు
మౌనంగా వుండమని !
ఎవరు పట్టించుకున్నారని
ఇద్దరి మధ్యా తుంపరలాంటి
తడితడి గుసగుసలే
ముసిముసినవ్వుల సెలయేర్లు
గుండెలపై ఎన్ని ప్రవహించాయో
తనువంతా ప్రేమ మొలకల పులకలే
అద్దానికైనా వుండొద్దూ
దయలేని అద్దానికైనా వుండొద్దూ
నా వొంటరితనం తనకు పరిచయమే కదా
వినిపించుకున్న దెప్పుడని?
స్వచ్ఛమైన నీలాకాశంలా
ఎప్పుడెప్పుడు తనొస్తుందా అని
విరబోసుకుని నిలువుకాళ్ళ జీతగాడిలా
కళ్ళలో వత్తులేసుకొంటుంది
ఈమారు తను రాకముందే
తనివితీరా అద్దాన్ని ముద్దాడుతాను
అంత ప్రేమగా జీవితాన్ని ఎవరూ
ప్రతిబింబించలేరు కదా ?
 

- డాక్టర్‌ పెరుగు రామకృష్ణ
98492 30443