మంచి కథలు ఎట్లా ఉంటాయి? అనే ప్రశ్న వేసుకుంటే అవి చదివాక మనసులో ఒక అలజడి రేగాలి, అనుభూతులు రేపాలి. జీవితం వాసన తగలాలి. వీలైతే కళ్ళు చెమ్మ కావాలి. పెదవులు సన్నగా విచ్చుకోవాలి. బాధ కలగాలి. కాసేపు ఊపిరి ఆగి మళ్ళీ ప్రవేశించాలి. తేరుకోవాలి. తేటపడాలి. ఇప్పటి కథలు సమకాలీన సమాజానికి దర్పణాలుగా ఉండాలి. జీవితం, కథ వేరు కాదు. కథే జీవితం, జీవితమే కథ. మొదటి వాక్యంలో చూపు పెట్టగానే ఆ చూపు అలా చివరి వాక్యం వరకు వెళ్లగలిగితే ఆ కథకుడు విజయం పొందినట్టు. ఆ పాఠకుడు తృప్తి చెందినట్టు.
పాఠకుడికి తృప్తి ఎప్పుడు కలుగుతుంది? ఆ కథలో ఉన్న పాత్రలతో పాఠకుడు మమేకం కావాలి. ఆ పాత్ర తాలూకు భావా వేశాలు మనస్తత్వాలు, ప్రవర్తన తీరును ఆవిష్కరించే బాధ్యతను రచయిత సరిగా చేసినప్పుడు పాఠకుడిలో జరగాల్సిన భౌతిక, మానసిక చర్యలు జరిగిపోతాయి. కథకుడు కేవలం సంఘటనకు పరిమితం కాకుండా కార్యకారణ సంబంధాలు విశ్లేషించగలగాలి. ఆల్టర్ ఈగో వేణుగోపాల్ మొదటి కథా సంపుటి. ఇందులో 13 కథలు ఉన్నాయి. ఈ కథల వయస్సు దాదాపు 5 సంవత్సరాలు. 10 కథల్లో సర్వసాక్షి కోణం కనిపిస్తుంది. రచయితకు అన్నీ తెలుసు. మనకు చూపిస్తూ ఉంటాడు. వెంట తీసుకుని వెళుతూ ఉంటాడు. తెలుగు కథ సర్వసాక్షి కోణంతోనే ప్రారంభమైంది. ఇందులో కథకుడికి మంచి సౌలభ్యం ఉంటుంది. వ్యాఖ్యానాలు చేయొచ్చు. సందేశాలు ఇవ్వచ్చు.
ఈ కథా సంపుటి కిరాయి కథతో ప్రారంభమవుతుంది. ఈ కథలో ఆటో డ్రైవర్ కథను నడిపిస్తాడు. అతనిలోకి ఆరోజు ఎలా బతకాలో దీర్ఘాలు తీసే భార్య ప్రవేశిస్తుంది. బతకడం నేర్చుకున్న అంబులెన్స్ డ్రైవర్ అరవింద్ దూరతాడు. చెరోవైపు చేరి ఆటో డ్రైవర్ని అమానవీయంగా మారుస్తారు. కథ చదివే పాఠకుడికి కోపం వస్తుంది. శవాన్ని ఒడిలో పెట్టుకున్న ముసలావిడని చూసి ద్ణుఖం వస్తుంది. పోలీసులు, డాక్టర్ల చర్యలను చూసి ఉద్రేకం కలుగుతుంది. ముసలావిడ అడివి మా సెడ్డది అంటుంది. నిజానికి మా చెడ్డది ఏదో రచయిత ఈ కథకు శీర్షిక ద్వారానే కొంత సూచన చేశాడు. కథ ద్వారా ఇంకాస్త చెప్పాడు.
ఈ కథకుడు సామాజిక గమన సూత్రాలను వదల్లేదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేయలేదు. సమాజాన్ని చాలా స్పష్టంగా పరిశీలించే గుణం మనకు అడుగడుగునా కనిపిస్తుంది. మానవ సంబంధాల విధ్వంసాన్ని పరిశీలిం చాడు. ఆ విధ్వంసాలను చాలా నేర్పుతో చెప్పాడు. లేకపోతే కథ కూలిపోతుంది, వ్యాఖ్యానంగా మిగిలిపోతుంది. తనకు తెలియంది ఏది రాయకపోవడం ఈ కథకుడి విజయానికి మూల సూత్రం.
పరువు హత్యలు అనే కథ ఉంటుంది. నిజానికి ఈ కథను చెప్పులు నడిపిస్తాయి. పచ్చ కాకి అనే కథ ఉంటుంది. చిట్టిమల్లు అనే కోడిపుంజు ఈ కథను ముందుకు తీసుకు పోతుంది. సహజాతం అనే కథ ఉంటుంది. ఈ కథకి చిరుత వేగాన్ని తెస్తుంది. జింక చుట్టూ తిరిగి ఆశ్చర్యపరిచే ముగింపుతో సాగుతుంది. చెప్పులు, కోడిపుంజు, చిరుత, జింక వీటికి సమాంతరంగా డేవిడ్ రాజు, చిట్టి పాత్రల చిత్రణ ద్వారా కథకుడి హృదయం దొరుకుతుంది. జంతువుల ద్వారా కథ నడపడం భారతీయ కథల్లో ఎప్పటినుంచో ఉంది. కానీ జీవులపై జరిగే హింసను వేణు ప్రభావవంతంగా ఆవిష్కరిస్తూనే మనుషుల కుటిల కర్కశ విధానాల్ని ప్రశ్నిం చాడు. వేణు తన కథల్లో స్థల, కాలాలను సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. వినియోగించడం కాదు గాని అలా రాయడమే పాఠకుడికి చేరువుగా చేస్తుంది. ఒక చిన్న సంఘటన ఆధారంగా రాసే కథల్లో మానవ జీవితంలోని వైరుధ్యాలను చూపగలిగే సంపత్తి వేణులో ఉందని ఈ కథలు నిరూపిస్తాయి. పానీ, రెమిడీసీవర్ .. కరోనా కాలపు విధ్వంసాలను కళ్ళకు కట్టిన కథలు. మనుషుల్లో ఉండాల్సిన అంత:సౌందర్యం గురించి పానీ కథ చర్చిస్తుంది. మెడికల్ మాఫియా, మత వ్యవహారాలు ఆ వెనక ఉండే తంతు ఈ రెండు అంశాలను జమిలీగా చర్చించిన కథ రెమిడీసీవర్. ఈ కథలో ముగింపు వాక్యం ఇలా ఉంటుంది : 'తిరిగి వచ్చిన వెంకయ్య నేలను తవ్వడం మొదలెట్టాడు.' ఇలాంటి తవ్వకం గురించే ఈ రచయిత వేదన చెందుతున్నాడు. జరగాల్సిన తవ్వకాలు ఎక్కడ జరగాలో ఆలోచించ మంటున్నాడు. సామాజిక వ్యక్తిగత జీవితాల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పుల్ని ఈ కథకుడు గుర్తించాడు. గుర్తించి ఊరుకోలేదు, తేరుకోమంటున్నాడు.
ఈ కథకుడి చూపు స్పష్టంగా ఉంది. తాజాగా ఉన్నాడు. ఎక్కడ ఏ దృశ్యం కనిపించినా దాన్ని కథను చేయగల నైపుణ్యం ఉంది. జీవన పోరాటంలో చివరి వరకు నిలబడ్డానికి ఆత్మ విశ్వాసం కావాలి. జానపద కళలు సంప్రదాయాలు అస్తమిస్తున్న వేళ ఇద్దరు జానపదులు బతుకుతూ ఆడే ఆటను బతకాటగా మలిచిన విధానం ఇతని కథా సంవిధాన సూత్రాన్ని పట్టి చూపుతుంది.
ఎద్దు గిట్టలు కథ ఈ సంపుటిలో విభిన్నమైంది. పరిణతి చెందిన కథకుడు అని నిరూపించిన కథ. ఇసుకరేణువు, నది, ఎద్దుగిట్టలు ఈ కథ లోని పాత్రలు. వాటితో కథ నడిపిన తీరు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ కథకి మూల సూత్రం పర్యావరణం. అభివృద్ధి, అత్యాశల పేరు మీద నాశనం అవుతున్న మన నేల తల్లి ఆవేదనను వేణు చక్కగా ఆవిష్కరిం చారు.
వేణుకి వాక్య నిర్మాణం మీద శ్రద్ధ ఉంది. భాషను సరిగా ఉపయోగించుకున్నాడు. భావ ప్రకటన బలంగా ఉంది. అసురవేదం కథలో మాండలిక భాషను ఉపయోగించడం ఆ కథకు వన్నె తెచ్చింది. పదాల నడకలో అశ్రద్ధ ఉంటే కథ ధ్వంసం అయిపోతుంది. ఈ కథకుడు భాష విషయంలో బాధ్యతగా కనిపిస్తున్నాడు. కొన్ని నీతి సూత్రాలు చెప్పేసి కథను అల్లే గుణం లేకపోవడం ఆరోగ్యకర పరిణామం.
''చెవి నుండి గడ్డం వరకు ఉన్న దవడ ఎముక రంజాన్ నెలవంకలా ఉండేది''
''సుబ్బారావుకి చీకటంతా చేతికంటుకున్నట్టు ఉంది.''
''ఆకలి కంటే గొప్ప శత్రువు డబ్బు కంటే గొప్ప మిత్రుడు లేరు.''
... ఇలాంటి వాక్యాలు కొత్తగా అనిపించాయి.
వేణు పాత్రల్ని బాగా డీల్ చేయగలడు. దశ్యాలను గుండెల్లోకి పంపగలడు. ముఖ్యంగా అతను కాలక్షేపం కోసం కథ రాయలేదు. కథలకు పెట్టిన శీర్షికలు అద్భుతంగా కుదిరాయి. ఆల్టర్ ఈగో కథ ముగింపులో శ్రీనివాస్‌కి ఆల్టర్ ఈగో ఉంది అని ప్రకటించకుండా ఉంటే బాగుండేది. కొన్ని కథల్లో మధ్య మధ్యలో రచయిత జోక్యం ఎక్కువ అయినట్టు అనిపించింది.
ఒక పాఠకుడిగా వేణు నుండి నేను ఇంకొన్ని ఆశిస్తున్నాను.
ఆ జాబితా ఇలా ఉంది ...
1. పాత వాసన ఉన్న వాక్యాలు వదిలేయాలి.
2. ముగింపుల దగ్గర పాఠకుణ్ణి గుర్తు పెట్టుకోవాలి.
3. అక్కడక్కడా పాఠకుడి ఆలోచనల్ని బద్దలు కొట్టాలి.
4. ప్రారంభాలు మరికాస్త పదునుగా ఉండాలి.
5. వేణు తనని తాను శోధించుకుంటూ, కథల స్థాయిని పెంచాలి.
- డాక్టర్ సుంకర గోపాల్
94926 38547










