May 22,2023 07:55

              ''నవల పాఠకుడి ద్వితీయ జీవితం భయంకర పాప పుణ్యాల బంధం నుంచి విముక్తి పొందిన అనుభూతి.. నవల ఒక మారి జువానా, ఒక కొకెయిన్‌ పొగ మేఘాలు నిండిన మేఘాల లోయ.. నవల పాఠకుల చేత అజరామరత్వం అనుభవింపచేస్తుంది. పుస్తకాన్ని రచయిత రాయడు, పుస్తకం రచయిత చేత రాయిస్తుంది'' కామోత్సవ్‌ నవల ఆరంభంలో మనల్ని ఆహ్వానించే శేషేంద్ర పలుకులివి.
           గుంటూరు శేషేంద్ర శర్మ సనాతనుల్లో సనాతనుడు, ఆధునికుల్లో ఆధునికుడు, ఒక్క మాటలో చెప్పాలంటే నవ్యాధునికుడు. పండిత సాహిత్య కారుడే కాదు. విప్లవకారుడు కూడా. కార్మికుల్లో కార్మికుడు. ఉద్యోగం తొలి రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని ఐవి. సాంబశివరావుతో కలిసి ఏర్పాటు చేశాడు. కమ్యూనిస్టుగా ముద్ర పడడంతో ఆయనను నిర్బంధ పదవీ విరమణకు గురయ్యాడు.
           తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ తర్వాత అత్యంత ప్రభావ శీలురైన కవుల్లో శేషేంద్ర ఒకరు. పద్యం నుంచి గజల్‌ దాకా ఆయన సాగించిన ప్రస్థానం ఒక చరిత్ర. ఆయన భావుకతలో విలక్షణత ఉట్టిపడుతుంది. ఆయన కవిత్వం అజరామరం. రసాత్మకత, సామాజికత కలగలిపి ఆయన రచించిన ప్రతి కావ్యమూ మనకు అనేక కవితా దారులను తెరుస్తుంది. మే 30న 2007లో సెలవంటూ ఆయన మనల్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోయాడు. ఆయన లేకున్నా ఆయన సాహిత్యం ఉంది. కవిత ఎలా ఉండాలో 1973లో ఒక కావ్యానికి రాసిన ముందుమాటలో శేషేంద్ర సూటిగా వివరిస్తాడు.
''నేను చూడగలను/ నీ నేత్రాల రేవుల్లోÛ / నౌకల్లో తేలుతున్నాయి ! స్వప్నాలు''... భావుకతను ఇంతలా పండించిన కవి మళ్ళీ మనకి దొరుకుతాడా అనేది నన్ను నిరంతరం వేధిస్తున్న ప్రశ్న. శేషేంద్ర చేతుల్లోని వస్తువులో ప్రవాహశీలగుణం చూపించే చమత్కార గుణం అనితర సాధ్యమనే చెప్పాలి. ఎక్కడ అయితే కొత్త పదం రావాలో అక్కడ విరుద్ధమైన పదం వాడి మెరుపులు మెరిపించడంలో ఆయనకున్న ప్రజ్ఞ మనల్ని విచలితుడ్ని చేస్తుంది. పద్యం మీద ఉన్న పట్టు వల్ల వచన కళను పండించినా, దాని మీద గజల్‌ ఛాయలు పరిచి కలకాలం నిలబడే రస ఘోషతో మనల్ని తన్మయుల్ని చేసినా అది ఆయనకే చెల్లింది.
            'ఈ నగరం జాబిల్లి'' అనే గజల్‌ లక్ష్య లక్షణాలు వివరించిన గీతి కావ్యంలో గజల్‌ పట్ల తనకున్న వ్యామోహాన్ని ఒక ఆత్మకథగా చెప్పి తన కవిత్యం కొత్త దారులు పట్టడానికి గజల్‌ పై పట్టు తన చేత ఎన్ని అద్భుత పద్యాలు రాయించిందీ స్వయంగా కన్ఫెషన్‌ ఇచ్చాడు. ఇవాళ గజల్‌ రాసేకవులు శేషేంద్ర శర్మ యిచ్చిన ఈ సూచనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
'గజల్‌కు వాస్తవంగా తెలుగులో మొలకెత్తడానికి అనుకూలమైన నేల లేదు. రాసే వాడి సంస్కారం కూడా గజల్‌ జన్మకు అనువైన ఊహని శబ్దాన్ని సజించగల నాజూకు సంస్కారం అయి ఉండాలి ( పేజి 59 - ఈ నగరం జాబిల్లి).
          గజల్‌ రాయటానికి ఫైజ్‌ వంటి కవులు ప్రోత్సాహం ఇచ్చినా, గజల్‌ గొంతు నలిగిపోతుందేమోనని శేషేంద్ర భయపడ్డాడు. అందుకే ఆ ప్రయత్నం విరమించాడు. బాగున్నాయనుకున్న గజల్‌ పంక్తుల్ని ''నా దేశం నా ప్రజలు'' ''గొర్రిల్లా'' ఆది కావ్యాల్లో వాడు కున్నాడు. ఉదా- '' వేళ్ళు కాళ్ళయి నడిచే చెట్టు/ మనిషి చెట్టుగా ఉంటే ఏడాది కొక వసంతమన్నా దక్కేది, మనిషిపై అన్ని వసంతాలు కోల్పోయాను/'' ''నేనంతా ఒక పిడికెడు మట్టే కావచ్చు / కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది / ఇలాంటి అద్భుత కవిత్వం రాయటానికి గజల్‌ ఛందస్సును వాడుకొని తన ప్రసిద్ధ భావుకతను రంగరించి మనకి మంచి కవిత్వం ఇచ్చాడు శేషేంద్ర.
           గజల్‌కు ప్రాణమని చెప్పిన దావా దలీల్‌ పద్ధతి ప్రాచీన కవిత్వంలో లోకమంతటా ఉందని శేషేంద్ర 'ఈ నగరం జాబిల్లి' పుస్తకంలో వివరించాడు. కబీరు దోహాలు, వాల్మీకి రచించిన రామాయణంలో అనుష్షుప్‌ ఛందంలో ఎన్నో అద్భుత శ్లోకాలను శేషేంద్ర రామాయణ రహస్యాలలో చెప్పటం జరిగింది. శేషేంద్రకు వాల్మీకి అంటే అమితమైన అభిమానం, అలాగే వేమన ఆటవెలది పద్యాలలో కూడా గజల్‌ యొక్క దావా, దలీల్‌ టెక్నిక్‌ వుందని శేషేంద్ర భావించాడు. మన సంస్కతికి తగ్గ కవితా రచన ద్వారానే కవిత్వం సాధించవచ్చని శేషేంద్ర భావించి అలా నిలిచిపోయే కవితలు రాశాడు. అలాగే కవిత్వంలో లయ అవసరాన్ని శేషేంద్ర నొక్కి చెప్తాడు. అభి వ్యక్తి ప్రక్రియకి లయ, రాగం రక్త బంధువులే గాని, బయటి నుంచి వచ్చిన అతిధులు కావు అన్న శేషేంద్ర ప్రకటనలో మన కవులు నేర్చోకోతగ్గ అంశాలు చాలా ఉన్నాయి. శేషేంద్ర కవిత్వాన్ని విమర్శని అధ్యయనం చేయటం సాహిత్యానికి ఎంతో మేలు చేర్పు అవుతుంది.
 

(మే 30 శేషేంద్ర 16వ వర్థంతి)
- సాగర్‌ శ్రీరామకవచం
98854 23934